NTR- ANR: నందమూరి - అక్కినేని అనుబంధం

ABN, Publish Date - Apr 23 , 2025 | 06:45 PM

ఎన్టీఆర్, ఏయన్నార్ టాలీవుడ్ కు రెండు కళ్లలాంటివారు. టాప్ హీరోలుగా చెలామణి అయినా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరిపై మరొకరిపై ప్రేమ ను కురిపించుకున్నారు. అన్నదమ్ముల ఉంటూ పలువురికి రోల్ మోడల్ గా నిలిచారు.

ఎవ్వరు ఎన్ని చెప్పినా, తెలుగు చిత్రసీమకు ఓ క్రమశిక్షణ నేర్పింది నటరత్న యన్టీఆర్ (NTR), నటసమ్రాట్ ఏయన్నార్ (ANR) అనే చెప్పాలి. వారిద్దరిలో వయసులో యన్టీఆర్ పెద్దవారు. సినిమా రంగంలో యన్టీఆర్ కంటే ముందే ఏయన్నార్ రాణించారు. దాంతో ఒకరినొకరు ఎంతో గౌరవించుకొనేవారు. 'బ్రదర్' అంటూ ఆత్మీయంగా పిలుచుకొనేవారు. తెరపై అనేక చిత్రాల్లో అన్నదమ్ములుగా నటించిన యన్టీఆర్, ఏయన్నార్ నిజజీవితంలోనూ అలాగే మసలు కున్నారు. వారిమధ్య కొన్నాళ్ళు విభేదాలు తలెత్తినా, అవి టీ కప్పులో తుఫాన్ లాంటివి. మళ్ళీ కలుసుకున్నారు. కడదాకా అదే అన్నదమ్ముల అనుబంధంతో సాగారు.


యన్టీఆర్, ఏయన్నార్ వంటి సమాన స్థాయి కలిగిన ఇద్దరు స్టార్స్ కలసి 15 చిత్రాలలో నటించడం ప్రపంచంలోనే ఓ అరుదైన రికార్డ్ అని ఏయన్నార్ చెప్పేవారు. యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ తమ పాత్రలకు ప్రాధాన్యమిచ్చేవారే కానీ, ఏ నాడూ పాత్రల నిడివికై పాకులాడలేదు. అందువల్లే అన్ని సినిమాల్లో కలసి నటించారని చెప్పవచ్చు. వారిద్దరూ కలసి నటించిన తొలి చిత్రం 'పల్లెటూరి పిల్ల' (Palletoori Pilla). 1950లో రూపొందిన ఈ చిత్రంలో ఇద్దరూ హీరోలుగా నటించారు. యన్టీఆర్ కు ఇదే తొలి జానపద చిత్రం. తరువాతి రోజుల్లో యన్టీఆర్ తిరుగులేని జానపద కథానాయకునిగా సాగడం మరువరాని అంశం! ఆ తరువాత యన్టీఆర్, ఏయన్నార్ అన్నదమ్ములుగా నటించిన 'సంసారం' (Samsaram) తెరకెక్కింది. ఇది కూడా 1950లోనే వెలుగు చూసింది. అప్పటి దాకా పౌరాణిక, జానపదాలతో సాగిన ఏయన్నార్ కు ఇదే మొదటి సాంఘిక సినిమా. ఆపై యన్టీఆర్, ఏయన్నార్ - 'రేచుక్క', 'పరివర్తన', 'మిస్సమ్మ', 'తెనాలి రామకృష్ణ', 'చరణదాసి', 'మాయాబజార్', 'భూకైలాస్', 'గుండమ్మకథ', 'శ్రీకృష్ణార్జున యుద్ధం', 'రామదాసు', 'చాణక్య-చంద్రగుప్త', 'రామకృష్ణులు', 'సత్యం-శివం' చిత్రాలలో నటించారు. ఈ సినిమాలలో 'పల్లెటూరి పిల్ల, సంసారం, మాయాబజార్, గుండమ్మకథ' చిత్రాలు రజతోత్సవం చూశాయి. వీటిలో 'మాయాబజార్' (Mayabazar) ఆల్ టైమ్ ఫేవరెట్ గా జనాన్ని అలరిస్తోంది. అన్నిటికంటే బిగ్ హిట్ గా 'గుండమ్మకథ' (Gundamma Katha)నిలచింది. అయితే యన్టీఆర్, ఏయన్నార్ కాంబోలో వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా 'సంసారం' నిలచింది. ఈ సినిమా మద్రాసులో 224 రోజులు ఏకధాటిగా ప్రదర్శితమయింది. 11 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.

'సంసారం' చిత్రంలోనిదే ఇక్కడ మనం చూస్తోన్న స్టిల్. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి.వి.రంగదాసన్ నిర్మించారు. ఇందులో యన్టీఆర్ భార్యగా లక్ష్మీరాజ్యం నటించగా, ఏయన్నార్ జోడీగా పుష్పలత నటించారు. ఈ చిత్రంలో ముందు ఏయన్నార్ సరసన సావిత్రిని నాయికగా ఎంచుకున్నారు. అయితే కెమెరా ముందు సావిత్రి తెగ సిగ్గు పడుతూ ఉండడంతో ఆమెను తొలగించి, ఆమె స్థానంలో పుష్పలతను ఎంచుకున్నారు. అయితే ఇదే సినిమాలో ఏయన్నార్ ఎడ్లబండి తోలుకుంటూ పోతూ ఉంటే, పుష్పలత ఆమె ఫ్రెండ్స్ "టక్కు టక్కు టముకుల బండి..." అంటూ టీజ్ చేసే సాంగ్ ఉంది. అందులో కాసేపు సావిత్రి తళుక్కుమన్నారు. ఏది ఏమైనా యన్టీఆర్, ఏయన్నార్ కాంబోలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా 'సంసారం' నిలచింది.

Updated Date - Apr 23 , 2025 | 06:50 PM