Naani Interview: నాని వాల్‌ పోస్టర్‌ వెనకున్న కథ ఇదే.. 

ABN, Publish Date - Apr 27 , 2025 | 10:23 AM

నా దృష్టిలో నటన అనేది సుడిగాలి లాంటిది. అయితే నా పక్కన నా భార్య అంజన బలంగా నిలబడింది. ఈ గందరగోళ వాతావరణంలో ఆమే నా ప్రశాంతత. తను నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం.

క్లాస్‌ నుంచి క్రమక్రమంగా మాస్‌ యాక్షన్‌లోకి దిగుతున్నాడు నేచురల్‌ స్టార్‌ నానీ. ‘దసరా’ తర్వాత తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్న ఈ జెంటిల్‌మ్యాన్‌... తాజాగా ‘హిట్‌ 3’లో మాస్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని విశేషాలివి..

ఆ విషయంలో గిల్టీగా...

చదువుకునే రోజుల్లో అన్ని సబ్జెక్టుల్లో కన్నా ఇంగ్లిష్‌లోనే ఎక్కువ మార్కులొచ్చేవి. నిజానికి అప్పట్లో నాకు ఇంగ్లిష్‌ సరిగా రాదు. పరీక్షల్లో ప్రతీ ప్రశ్నకూ టైటానిక్‌ కథే రాసేవాణ్ని. విచిత్రంగా మార్కులు బాగా పడిపోయేవి. ఒకసారి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పా. దాంతో నాన్నకు తెలిస్తే ఎక్కడ తిడతారోనని... ఆయనకి చూపించకుండా నేనే ప్రోగ్రెస్‌ కార్డులో సంతకం పెట్టేశా. అలా చేయడం తప్పని ఆ తర్వాత తెలుసుకున్నా. ఇప్పటికీ ఆ విషయంలో గిల్టీగా ఫీలవుతుంటా.

ఆయన సినిమాలు చూసి...

చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. మణిరత్నం తీసిన ‘రోజా’, ‘దళపతి’ చిత్రాలు టీవీలో ఎన్నోసార్లు చూశాను. ఆ సమయంలో దర్శకుడెవరో కూడా నాకు తెలియదు. కానీ, ఆ సినిమాలు చూడడం ప్రారంభించాకే దర్శకుడు ఎలా ఆలోచిస్తాడు? సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తున్నాడు? వంటి విషయాలపై ఆసక్తి కలిగింది. ఆయన సినిమాలు మాత్రమే కథతో పాటు అన్ని విషయాల గురించి ఆలోచించేలా ఉంటాయి. ప్రతీ సన్నివేశంపై దృష్టి పెట్టేలా చేస్తాయి. ఆయన సినిమాల నుంచి మేకింగ్‌ టెక్నిక్స్‌ చాలా నేర్చుకున్నా.


తనే నా బెస్ట్‌ క్రిటిక్‌...

నా దృష్టిలో నటన అనేది సుడిగాలి లాంటిది. అయితే నా పక్కన నా భార్య అంజన బలంగా నిలబడింది. ఈ గందరగోళ వాతావరణంలో ఆమే నా ప్రశాంతత. తను నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. నాకేం కావాలో నాకన్నా తనకే బాగా తెలుసు. నేను వేసుకునే దుస్తులు కూడా తనే సెలెక్ట్‌ చేసి పెడుతుంది. నా బిగ్గెస్ట్‌ క్రిటిక్‌ కూడా తనే. నా సినిమాల్లోని ప్లస్‌లు, మైనస్‌లు నిర్మొహమాటంగా చెబుతుంది.

వాల్‌పోస్టర్‌ అంటే ఇష్టం కాబట్టే ...

వాల్‌పోస్టర్లంటే చాలా ఇష్టం. అప్పట్లో అమీర్‌పేటలో ఉండేవాణ్ని. సత్యం థియేటర్‌కు వెళ్లేదారిలో ఒక మైదానం వద్ద పెద్ద గోడ ఉండేది. ఆ గోడ మీద సినిమా పోస్టర్‌లు అంటించేవాళ్లు. అవి బాగా ఆకర్షించేవి. ప్రేక్షకుడికి సినిమా చూడాలనిపించేలా వాల్‌పోస్టర్‌ ఇచ్చే కిక్‌... ట్రైలర్‌, టీజర్‌, సోషల్‌మీడియా ఏదీ ఇవ్వదు. పోస్టర్‌లోనే సినిమాటిక్‌ హైప్‌ ఉందనేది నా ఫీలింగ్‌. అందుకే నా నిర్మాణ సంస్థకు ఆ పేరుపెట్టా.

బెస్ట్‌ మూమెంట్‌ అదే...

మా అబ్బాయి జున్నూ చాలా చలాకీ. తనకి సంగీతం అంటే మక్కువ. పియానో నేర్చుకున్నాడు. ఎంతో ఆసక్తి ఉంటే తప్ప పియానో అంత త్వరగా నేర్చుకోలేరని టీచర్లు చెబుతుంటారు. నా సినిమాకి ఏదోరోజు జున్నూనే సంగీతం సమకూరుస్తాడేమో చూడాలి. ‘నీ అభిమాన హీరో ఎవరు?’ అని ఓరోజు సరదాగా అడిగితే... ‘ఇంకెవరు... నువ్వే నా రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ హీరో’ అన్నాడు. నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌ అంటే అదే.

ఫటా ఫట్‌

- నటుడు కాకపోయుంటే: థియేటర్‌లో ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడిని.

- నటనలో స్ఫూర్తి: కమల్‌హాసన్‌

- ఫేవరెట్‌ క్రీడ: క్రికెట్‌

- అభిమాన క్రికెటర్‌: ధోని

- ఫేవరెట్‌ హాలీడే డెస్టినేషన్‌: యూరప్‌

- నచ్చిన వెబ్‌సిరీస్‌: బ్రేకింగ్‌ బ్యాడ్‌

- ఫేవరెట్‌ ఫుడ్‌: అమ్మ చేసిన టమాటా రైస్‌

- ఫిట్‌నెస్‌ రహస్యం: నేను పెద్దగా డైట్‌ ఫాలో కాను. అన్నీ ఇష్టంగా తింటా.

Updated Date - Apr 27 , 2025 | 10:23 AM