Re Release: మార్చిలో ప్రతివారం ఓ రీ-రిలీజ్
ABN, Publish Date - Mar 11 , 2025 | 04:53 PM
ఈ యేడాది జనవరి ఒకటిన 'సై' మూవీ రీ-రిలీజ్ అయ్యింది. ఇక మార్చిలో అయితే ఏకంగా ఐదు చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం ఓ రీ-రిలీజ్ మూవీ ఉండటం విశేషం.
కొత్త సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నలభై ఆరు సినిమాలు విడుదల కాగా మార్చి నెల మొదటి వారాంతంలో ఏకంగా 12 సినిమాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే ఈ యేడాది అసలు ప్రారంభం కావడమే రీ-రిలీజ్ మూవీతో అయ్యింది. జనవరి 1న రాజమౌళి, నితిన్ తో తెరకెక్కించిన 'సై' (Sye) తో మొదలైంది. ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాలు వివిధ సందర్భాలలో రీ-రిలీజ్ అయ్యాయి.
చిత్రం ఏమంటే... మార్చి నెలలో ప్రతి వారం ఓ పాత సినిమా రీ-రిలీజ్ అవుతోంది. నిన్న కాక మొన్న మార్చి 7న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (Sithamma Vaakitlo Sirimalle Chettu) మూవీ మరోసారి జనాన్ని పలకరించింది. దీనికి మంచి స్పందన లభిస్తోందని దిల్ రాజు చెబుతున్నారు. ఇక మార్చి 14న కార్తీ హీరోగా సెల్వరాఘవన్ తెరకెక్కించిన 'యుగానికి ఒక్కడు' మూవీ రీ-రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత వారం అంటే మార్చి 21న ఒకటి కాదు రెండు పాత సినిమాలు జనాలను పలకరించబోతున్నాయి.
అందులో ఒకటి పదేళ్ళ క్రితం సరిగ్గా ఇదే తేదీన వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' (Evade Subramanyam). నాని (Nani), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతోనే నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అతను తీసిన 'మహానటి, కల్కి 2898 ఎ.డి.' ఘన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు 'ఎవడే సుబ్రమణ్యం'పై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇక అదే తేదీ అంటే మార్చి 21నే ప్రభాస్ నటించిన 'సలార్' మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇక మార్చి 28న మంచు విష్ణు హీరోగా నటించగా, శ్రీను వైట్ల రూపొందించిన సూపర్ హిట్ మూవీ 'ఢీ' (Dhee) రిలీజ్ కాబోతోంది. ఆ రకంగా ఈ నెలంతా రీ-రిలీజ్ మూవీస్ హంగామా సాగబోతోంది.
Also Read: Devotional Thriller: షణ్ముఖ అందరికీ నచ్చుతుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి