Gadar Awards: గద్దర్ సినీ అవార్డుల జ్యూరీ ఏర్పాటు
ABN, Publish Date - Mar 12 , 2025 | 11:07 AM
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2024 నుండి గద్దర్ సినిమా అవార్డులను వివిధ కేటగిరిల్లో ఇవ్వబోతోంది. అయితే 2014 నుండి 2023 వరకూ ఉత్తమ చిత్రంకు అవార్డులను ఇస్తామని తెలిపింది.
గద్దర్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. బి. నరసింగరావు ఛైర్మన్ గా, దిల్ రాజు వైస్ ఛైర్మన్ గా వేసిన కమిటీలో సలహాదారులుగా కె. రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, డి. సురేశ్ బాబు, చంద్రబోస్, ఆర్. నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణు ఉన్నారు. వీరి నేతృత్వంలో కమిటీ సమావేశమై తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి పంపగా, ప్రభుత్వం కూడా వాటిని పరిశీలించి తాజాగా జీవో జారీ చేసింది. ఈ విషయంలో విధివిధానాల కమిటీ వైస్ ఛైర్మన్ గానే కాకుండా ఎఫ్.డి.సి. ఛైర్మన్ గానూ దిల్ రాజు తగిన చొరవ చూపించారు.
అయితే... నంది అవార్డుల ప్రకటన ఎక్కడైతే ఆగిపోయిందో... అక్కడ నుండి అన్ని కేటగిరిలకూ కాకుండా ఉత్తమ చిత్రానికి మాత్రం అవార్డును ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా 2014 నుండి 2023 వరకూ యేడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయబోతున్నారు. ఇక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి మాత్రం వివిధ కేటగిరిల్లో అవార్డులను ఇవ్వబోతున్నారు. ఆ రకంగా 2024కి సంబంధించి పలు కేటగిరిల్లో ఉత్తమ చిత్రం అవార్డులను, అలానే నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులను అందచేస్తారు. దీనితో పాటుగా కమిటీ సిఫార్స్ చేసిన టి.ఎల్. కాంతారావు, పైడి జైరాజ్ స్మారక అవార్డులనూ సినీ ప్రముఖులకు ఇస్తారు. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేసే పనిలో ఎఫ్.డి.సి. అధికారులు ఉన్నారు. గతంలో ఉన్నట్టుగా ఉత్తమ సినీ గ్రంధం, ఉత్తమ సినీ పాత్రికేయుడు అవార్డునూ అందచేయబోతున్నారు.
Also Read: NTR, ANR: చరణదాసి కాపీ లాపతా లేడీస్ కు అవార్డుల పంట
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశేషం ఏమంటే... ఈసారి నుండి ఉర్దూ భాషా చిత్రాలకూ అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉర్దూ భాషా చిత్రాలను ప్రోత్సహించడం మంచిదే కానీ గత కొంతకాలంగా బంజారా భాషలోనూ చిత్రాలు వస్తున్నాయని, వాటిని కూడా ప్రోత్సాహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని కొందరు సలహా ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే... అవార్డుల ఎంపికకు సంబంధించిన కమిటీని కూడా ఇప్పటికే ప్రభుత్వం వేసేసిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 13వ తేదీ నుండి వచ్చే అప్లికేషన్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించి, షార్ట్ లిస్ట్ చేసి... ఏప్రిల్ మాసంలో గద్దర్ తొలి చలన చిత్ర అవార్డులను అందచేస్తారని అంటున్నారు. నిజానికి నంది అవార్డుల విషయంలో 2014, 2015, 2016 సంవత్సరాలకు కూడా అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించినా... వాటిని గ్రహీతలకు అందచేయలేదు. మరి ఆ సమయంలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన వాటిని ఇప్పుడు గద్దర్ అవార్డుకు పరిగణిస్తారా?లేక కొత్త సినిమాలను ఆ యా సంవత్సరాలలో ఎంపిక చేస్తారా? అనేదే చూడాలి.
Also Read: Devotional Thriller: షణ్ముఖ అందరికీ నచ్చుతుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి