HBD Buchi Babu Sana: ఫస్ట్ మూవీతోనే రూ.100 కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు
ABN, Publish Date - Feb 15 , 2025 | 01:41 PM
తెలుగులో తొలి చిత్రంతోనే వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన దర్శకుడిగా బుచ్చిబాబు సానా రికార్డ్ సృష్టించారు. అంతేకాదు... ఈ సినిమా ఆ యేడాది ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది.
ఇవాళ సినిమాలు సాధించిన కలెక్షన్స్ తోనే వాటి సక్సెస్ రేట్ ను బేరీజు వేస్తున్నారు. నంబర్ ఆఫ్ డేస్ తో సంబంధం లేకుండా ఆడినన్ని రోజులు ఎంత గ్రాస్ వచ్చిందో చెబుతూ, వాటినే పోస్టర్స్ గా వేసి సినిమా సక్సెస్ కు గీటురాయిగా చెప్పుకుంటున్నారు. శనివారం దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) బర్త్ డే. డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) శిష్యుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సానా బుచ్చిబాబు 2021లో 'ఉప్పెన' (Uppena) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దీనిని సుకుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించారు. తెలుగులో తొలి చిత్రంతోనే వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన దర్శకుడిగా బుచ్చిబాబు సానా రికార్డ్ సృష్టించారు.
సానా బుచ్చిబాబు తెరకెక్కించిన 'ఉప్పెన' చిత్రంతో హీరోగా చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), హీరోయిన్ గా కృతీశెట్టి (Krithi Setty) తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రను చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతాన్ని అందించారు. తొలి చిత్రంతోనే గ్రాండ్ విక్టరీని వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, సానా బుచ్చిబాబు అందుకున్నారు. అంతేకాదు... ఈ సినిమా ఆ యేడాది ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. ఆ సినిమా తర్వాత ఇటు వైష్ణవ్ తేజ్, అటు కృతి శెట్టి పలు చిత్రాలలో నటించారు. అయితే వీరిద్దరికీ 'ఉప్పెన' తరహా సక్సెస్ మళ్ళీ ఇంతవరకూ దక్కలేదు. దర్శకుడు సానా బుచ్చిబాబు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు.