Dhandoraa: దండోరాలో వేశ్యగా బిందుమాధవి

ABN, Publish Date - Apr 14 , 2025 | 05:22 PM

ప్రముఖ నటి బిందుమాధవి దండోరా చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆమె చేస్తున్న వేశ్య పాత్ర చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు

ఉత్తమ ప్రాంతీయ సినిమా అవార్డును అందుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’ (Color Photo) ! దీనితో పాలు 'బెదురులంక 2012' చిత్రాన్ని నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని ప్రస్తుతం 'దండోరా' (Dhandoraa) మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో ఉంది. 25 రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో బిందు మాధవి (Bindu Madhavi) భాగమయ్యారు. ఇప్పటికే ఈ షెడ్యూల్ లో శివాజీ (Shivaji) పాల్గొంటున్నారు. ఇప్పుడు బిందు మాధవి జాయిన్ అయ్యారు. పలు చిత్రాలలో నాయికగా నటించిన బిందు మాధవి చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా చిత్రం 'దండోరా'లో ఆమె వేశ్య పాత్రను పోషిస్తున్నారు.


ఫ‌స్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న 'దండోరా' సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోందని, అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని 'దండోరా'లో చూపించబోతున్నామని రవీంద్ర బెనర్జీ ముప్పానేని తెలిపారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు. నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 05:24 PM