Chhaava: తెలుగులోనూ తగ్గేదే లే అంటున్న విక్కీ కౌశల్
ABN, Publish Date - Mar 06 , 2025 | 06:17 PM
ఫిబ్రవరి 14న విడుదలైన హిందీ చిత్రం 'ఛావా' అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి 7వ తేదీ విడుదల చేస్తున్నారు. 550కు పైగా థియేటర్లలో మూవీని రిలీజ్ చేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు.
'ఛావా' (Chhaava) సినిమా హిందీ వర్షన్ ఇప్పటికే విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో దీనిని ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదిస్తే బాగుంటుందని నిర్మాణ సంస్థ మాడ్డాక్ ఫిలిమ్స్ భావించింది. ఈ సినిమాను తెలుగు భాషల్లోకి అనువదించి, రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 7వ తేదీ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సరికొత్త వివాదం చెలరేగింది. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు సభ్యులు ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. 'ఛావా' సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వద్దని కోరారు. అయితే... సెన్సార్ నుండి క్లియరెన్స్ పొంది, ఫిబ్రవరి 14 నుండి దేశ వ్యాప్తంగా ప్రదర్శితమౌతున్న ఈ చిత్రంపై ఇప్పుడు అభ్యంతరాలను వ్యక్తం చేయడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ముస్లింలు చేసిన ఆరోపణల కారణంగా 'ఛావా' తెలుగులో విడుదల కాదేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులిస్తూ, 'ఛావా' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం 550కు పైగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఇప్పటికే తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించిందని, అతి త్వరలో ఈ సినిమా రూ. 700 కోట్ల గ్రాస్ ను వసూలు చేయబోతోందని చెప్పింది. ఇదిలా ఉంటే... ఇందులో శంభాజీగా నటించిన విక్కీ కౌశల్ సైతం తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ''మీ ప్రేమకు, సహకారానికి ధన్యవాదాలు. 'ఛావా'ను తెలుగులో తీసుకు రావడం గర్వంగా ఉంది. గొప్ప మరాఠా యోధులలో ఒకరైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ కీర్తిని, అజేయమైన శౌర్యాన్ని, త్యాగాన్ని చూసే అవకాశం మీకు కలగడం ఆనందంగా ఉంది'' అని అందులో పేర్కొన్నారు. ఈ చిత్రంలో రశ్మికా మందణ్ణ, అక్షయ్ ఖన్నా, డయానాపెంటీ, అశుతోష్ రాణా, దివ్యాదత్తా ఇతర కీలక పాత్రలు పోషించారు.
Also Read: HBD Sharwanand: బ్యాక్ టు బ్యాక్ శర్వా మూడు చిత్రాలు!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి