Sachin Daughter Sara: నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం
ABN, Publish Date - Jan 19 , 2025 | 10:20 AM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మరీ ముఖ్యంగా తన లైఫ్ స్టైల్, తనకు ఎవరంటే ఇష్టమో చెప్పుకొచ్చింది. తన లైఫ్‌లో ఫ్రెండ్స్ పాత్ర ఏంటనేది కూడా తన తాజా ఇంటర్వ్యూలో సారా వెల్లడించింది. మరెందుకు ఆలస్యం సారా చెప్పిన సంగతులేంటో తెలుసుకుందామా..
Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ తండ్రిలాగే తెలివైనది. మహా గట్టిది కూడా. తండ్రి చాటు తనయగా కాకుండా... తనే స్వయంగా కెరీర్‌కు బాటలు వేసుకుంటోంది. ఓవైపు పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా ఉంటూనే, ఇటీవల ‘ఎస్‌టీఎఫ్’ (సచిన్‌టెండూల్కర్ ఫౌండేషన్) డైరెక్టర్‌గానూ బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా తన జీవన విధానం గురించి ఈ సెలబ్రిటీ బ్యూటీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలివే..
సమాజానికి తిరిగివ్వాలి
నాకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమంటే ఆసక్తి ఎక్కువ. సమాజానికి మనవంతుగా ఎంతో కొంత తిరిగివ్వాలని ఎప్పుడూ అమ్మానాన్న చెప్తుండేవారు. నిజానికి వారివల్లే నాకు దాతృత్వ గుణం అలవడింది. ఇటీవల ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించా. ఇప్పటికే మా ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని పేద పిల్లలకు ఉచిత వైద్యం, క్రీడలు, నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఈ సేవలను మరింతగా విస్తరించేందుకు నేను కృషి చేయాలనుకుంటున్నా.
Also Read- Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!
టీనేజ్ సమస్య
నేను టీనేజ్‌లో ‘పీసీఓఎస్’ బారినపడ్డా. దాని కారణంగా ముఖం నిండా మొటిమలు వచ్చేశాయి. వాటిని తగ్గించడానికి నేను చేయని ప్రయత్నం లేదు. చివరికి నా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలనుకున్నా. నెమ్మదిగా బరువు తగ్గడం మొదలుపెట్టా. దాంతోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తరచుగా నీళ్లు తాగడం చేశా. దాంతో నా చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా క్రమక్రమంగా ‘పీసీఓఎస్’ సమస్య కూడా తగ్గింది.
పేరు వెనుక కథ...
నా పేరు వెనక ఓ చిన్న కథ ఉంది. 1997లో నాన్న సారథ్యంలోని భారత్ జట్టు పాకిస్తాన్‌ను ఓడించి ‘సహారా కప్’ గెలుచుకుంది. నాన్న అప్పుడే తొలిసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారట. అదే ఏడాది నేను పుట్టడంతో... సహారా కనెక్ట్ అయ్యేలా నాకు ముద్దుగా ‘సారా’ అని పేరు పెట్టారు. ఆ విషయం నేను కాస్త పెద్దయ్యాక తెలుసుకుని ఆశ్చర్యపోయా.
Also Read-Ram Charan: రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు.. కాదు కాదు అంతకుమించి!
తను లేకపోతే నాకు తోచదు..
నా తమ్ముడు అర్జున్ నా కన్నా రెండేళ్లు చిన్నవాడు. తనంటే నాకు ప్రాణం. మేమిద్దరం అన్ని విషయాలు ఒకరికొకరం పంచుకుంటాం. మా మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు. తను ఇంట్లో లేకపోతే నాకసలు ఏమీ తోచదు. తమ్ముడికి ఏ విషయంలో ఎలాంటి సందేహం వచ్చినా.. మొదట నన్నే అడుగుతాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మా మధ్య అలకలు గానీ, కొట్లాటలు గానీ జరగలేదు.
ఒత్తిడికి గురైతే..
స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడమన్నా, విహారయాత్రల్ని ఆస్వాదించడమన్నా ఇష్టం. కొత్తకొత్త ప్రదేశాలను సందర్శించి, అక్కడ వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడాన్ని ఇష్టపడతా. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనా, మనసు బాగోకపోయినా వెంటనే సముద్ర తీరప్రాంతాలకు వెళ్తా. సోలో ప్రయాణాల కన్నా నా గాళ్స్‌గ్యాంగ్‌ని వెంటబెట్టుకొని తిరగడమంటేనే ఇష్టం.
అందరం కలిసి తింటాం
నాకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. వర్కవుట్స్, కఠినమైన డైట్ ఫాలో అవుతుంటా. పొద్దున్నే నాన్న, తమ్ముడితో కలిసి కాసేపు యోగా చేస్తా. ఆ తర్వాత జిమ్‌లో కసరత్తులు చేస్తా. వెయిట్ లిఫ్టింగ్, పైలెట్స్, ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడానికి ప్రాధాన్యం ఇస్తా. ఇక ఫుడ్ విషయానికొస్తే.. ఇంటి ఫుడ్ తినడానికే ఎక్కువ ఇష్టపడతా. స్ట్రీట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లను. వంట కూడా బాగా చేస్తా. రోజులో ఒక్క పూటైనా ఇంట్లో అందరం కలిసి తినేలా ప్లాన్ చేసుకుంటాం.