Malluwood: తెలుగు చిత్రసీమలో మలయాళ సినిమాల పోటీ

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:32 PM

మోహన్ లాల్ నటించిన 'తుడరుమ్' సినిమా తెలుగులో ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఇదే రోజున మలయాళ డబ్బింగ్ సినిమా 'జింఖానా' సైతం తెలుగువారి ముందుకొస్తోంది.

సహజంగా దక్షిణాది భాషా చిత్రాలలో అత్యధికంగా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. అరుదుగా మలయాళ చిత్రాలు, కన్నడ సినిమాలు వస్తుంటాయి. అయితే చిత్రంగా కొంతకాలంగా మలయాళ సినిమాలు తెలుగులో బాగా డబ్ అవుతున్నాయి. కరోనా సమయంలో ఓటీటీ (OTT) ప్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని మలయాళచిత్రాలను చూడటానికి తెలుగువాళ్ళు బాగా అలవాటు పడ్డారు. తక్కువ బడ్జెట్ తో, బలమైన కథతో తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలను ఇష్టపడటం ఎప్పుడైతే మొదలైందో... అప్పటి నుండి మలయాళ చిత్రాలు థియేటర్లలోనూ విడుదల కావడం మొదలైంది. గతంలో మోహన్ లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty), సురేశ్‌ గోపీ (Suresh Gopi) వంటి వారి సినిమాలు మాత్రమే తెలుగులో వచ్చేవి. కానీ ఆ తర్వాత యంగ్ హీరోల చిత్రాలు రావడం మొదలైంది. ఇప్పుడైతే... కొత్త కుర్రాళ్ళు చేసిన సినిమాలు సైతం మలయాళంలో కాస్తంత ఆడగానే తెలుగులో డబ్ చేసి, థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే... సహజంగా టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం తెలుగు సినిమాలతో పాటు ఏవో ఒకటి రెండు అనువాద చిత్రాలు విడుదల కావడం పరిపాటి. ఆ రకంగా చూసినప్పుడు ఒకే వారంలో రెండు తమిళ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడిన సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. గడిచిన నాలుగు నెలల విషయాన్నే తీసుకుంటే... జనవరి చివరి వారంలో 31న తమిళ చిత్రాలు 'ప్రేమిస్తావా', 'మదగజరాజా' విడుదలయ్యాయి. నిజానికి ఇవి పొంగల్ సీజన్ లో తమిళనాడులో రిలీజ్ అయ్యాయి. కాస్తంత ఆలస్యంగా తెలుగులో వాటిని డబ్ చేశారు. ఇక ఫిబ్రవరి నెలలో 21వ తేదీ ధనుష్ (Dhanush) దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంతకోపమా', ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganath) హీరోగా నటించిన 'రిటర్న్ ఆఫ్‌ ది డ్రాగన్' చిత్రాలు ఒకే రోజున తెలుగులో వచ్చాయి. అలానే అదే నెల చివరి వారంలో 27న ఆది పినిశెట్టి నటించిన తమిళ చిత్రం 'శబ్దం', జీవా నటించిన 'అగాత్య' విడుదలయ్యాయి.


ఈసారి చిత్రంగా రెండు మలయాళ చిత్రాలు తెలుగులో ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. వచ్చే శుక్రవారం అంటే ఏప్రిల్ 25న మోహన్ లాల్ నటించిన 'తుడరుమ్' (Thudarum) సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ వస్తోంది. శోభన నాయికగా నటించిన ఈ సినిమాను తరుణమూర్తి తెరకెక్కించారు. ఇదే రోజున మలయాళంలో ఇప్పటికే విడుదలై విజయం సాధించిన 'జింఖానా' (Gymkhana) సినిమా వస్తోంది. 'ప్రేమలు' (Premalu) ఫేమ్ నస్లెన్ హీరోగా నటించిన 'అలప్పుజ జింఖానా' (Alappuzha Gymkhana) సినిమా ఏప్రిల్ 10న విడుదలైంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను ఖలీద్ రహ్మాన్ తెరకెక్కించారు. అక్కడ ఎప్పుడైతే ఈ సినిమా విజయాన్ని అందుకుందో... వెంటనే తెలుగులో డబ్ చేసి ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నారు. సో... మోహన్ లాల్ 'తుడరుమ్'తో 'జింఖానా' తెలుగులో పోటీపడుతోంది. మరి వీటిల్లో ఏ సినిమాకు తెలుగువారు జై కొడతారో చూడాలి.

Also Read: Telugu Cinema: అక్కినేని, అల్లు స్పెషల్ బాండింగ్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 22 , 2025 | 01:12 PM