Mari Selvaraj: కర్ణన్ దర్శకుడితో ధనుష్‌ మరో సినిమా...

ABN, Publish Date - Apr 11 , 2025 | 09:06 AM

ప్రముఖ నటుడు ధనుష్‌, దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 'కర్ణన్' మూవీ వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ (Dhanush) వీలైనంతవరకూ వైవిధ్యమైన కథాంశాలనే ఎంపిక చేసుకుంటాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డునూ అందుకున్న ధనుష్‌ లో మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. అయితే అతను తెరకెక్కించిన 'రాయన్' (Raayan), ఇటీవల వచ్చిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' (Jabilamma neeku antha Kopama) చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా పట్టువిడవని విక్రమార్కుడిలా మరోసారి దర్శకుడిగా తన సత్తాను చాటుకోవడానికి 'ఇడ్లీ కడై' (Idly Kadai) మూవీని రూపొందిస్తున్నాడు. ఇందులో ధనుష్ సరసన నిత్యామీనన్ (Nitya Menon) నాయికగా నటిస్తోంది. అక్టోబర్ 1న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. అయితే దీనికంటే ముందు ధనుష్‌ నటించిన 'కుబేర' (Kubera) సినిమా జూన్ 20న రిలీజ్ అవుతోంది. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కీలక పాత్రను పోషించారు.


ఇదిలా ఉంటే... 2021లో ధనుష్... మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 'కర్ణన్' (Karnan) మూవీని చేశాడు. కలైపులి ఎస్ ధాను నిర్మించిన ఈ సినిమా తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా ధనుష్ నటించాడు. పలు వివాదాలకూ తెర తీసిన ఈ సినిమా కమర్షియల్ గా బాగానే ఆడింది. దాంతో దీనిని తెలుగులోనూ రీమేక్ చేయడానికి కొందరు నిర్మాతలు అప్పట్లో ఆసక్తి చూపించారు. ధనుష్‌ 'అసురన్' (Asuran) ను తెలుగులో 'నారప్ప' (Narappa) గా రీమేక్ చేసిన దగ్గుబాటి సురేశ్‌ బాబు 'కర్ణన్' ను తెలుగులో పునర్ నిర్మించాలనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీని తెలుగు హక్కుల్ని బెల్లంకొండ సురేశ్‌ కొన్నాడని, తన కొడుకు సాయి శ్రీనివాస్ తో ఆయన రీమేక్ చేస్తాడనీ చెప్పుకున్నారు. కానీ కారణాలు ఏవైనా 'కర్ణన్' తెలుగులో రీమేక్ కాలేదు.


ఇక తాజాగా 'కర్ణన్' దర్శకుడు మారి సెల్వరాజ్ తో ధనుష్ తన 56వ చిత్రాన్ని చేయబోతున్నాడు. దీనిని వేల్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ సంస్థ నిర్మించబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ గురువారం ఓ పోస్టర్ ను మేకర్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 'కర్ణన్' మూవీ విడుదలై ఏప్రిల్ 9కి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రకటన వచ్చింది. ఈ మధ్యలో మారి సెల్వరాజ్ తెరకెక్కించిన 'మామన్నన్' కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో సురేశ్ బాబు 'నాయకుడు' పేరుతో విడుదల చేశారు. ఇది కూడా కుల వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీనే!

Also Read: Karan Johar: నాగరాజ్ గా కార్తీక్ ఆర్యన్

Also Read: Bhool Chuk Maaf: రాజ్ కుమార్ రావ్, వామికా పెళ్ళి అవుతుందా... లేదా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 11 , 2025 | 09:14 AM