Kollywood: తమిళనాట సంక్రాంతికి రంజైన పోటీ
ABN, Publish Date - Apr 03 , 2025 | 03:46 PM
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్... హీరో టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ కు బాక్సాఫీస్ బరిలో చెక్ పెట్టబోతున్నాడు. 'జన నాయగన్' విడుదల టైమ్ లోనే 'జైలర్ -2'నూ రజనీకాంత్ రిలీజ్ చేస్తాడట.
తమిళ స్టార్ హీరోల చూపు ఎప్పుడైతే రాజకీయాల వైపు మళ్ళిందో వారికి బయటే కాదు చిత్రసీమలోనూ విరోధులు పెరగడం మొదలైంది. సహజంగా అన్ని పార్టీలలోనూ తమ అభిమానులు ఉంటారు కాబట్టి స్టార్ హీరోలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే... కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో తమలోని రాజకీయ నాయకుడిని అణిచి ఉంచలేక పొలిటికల్ టర్న్ తీసుకుంటారు స్టార్స్. గతంలో ఎంజీఆర్ (MGR) , కరుణానిధి, శివాజీ గణేశన్, జయలలిత (Jayalalitha) తదితరులంతా అలా సినిమాల్లోంచి రాజకీయ రంగంలోకి వచ్చి అదృష్టం పరీక్షించుకున్నవారే. తమిళనాడులో నటులుగా కాస్తంత గుర్తింపు పొందిన వారు కూడా ఏదో ఒక పార్టీలో నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేయడమో, లేదంటే కులం బలంతో సొంత పార్టీని స్థాపించడమో చేశారు. అయితే అందులో చాలామంది నిదానంగా నీరు కారి పోయి తమ పార్టీలను ఇతర పార్టీలలో విలీనం చేసేశారు. గత ఎన్నికల్లో శరత్ కుమార్ (Sarath Kumar) సైతం తన పార్టీని బీజేపీ (BJP)లో కలిపేశారు. అలానే కొందరు తమ పార్టీలను నిదానంగా రద్దు చేసేశారు. ఇక కమల్ హాసన్ అయితే... ఇప్పుడు అధికార డీఎంకే (DMK) తో అంటకాగుతున్నారు. రజనీకాంత్ కొంతకాలం పాటు సొంత పార్టీ పెట్టాలని ఉవ్విళ్ళూరినా... ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ఉన్నంతలో బీజేపీకే ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు.
తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) సొంత పార్టీని స్థాపించాడు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల నుండి అభ్యర్థులను నిలబెడతామని చెబుతున్నాడు. దాంతో సహజంగానే విజయ్ ని అభిమానించే ఇతర పార్టీల్లోని వారు నిదానంగా అతనికి దూరమవ్వడం మొదలైంది. సినిమా రంగంలోని నటీనటులు కూడా ఇప్పుడు విజయ్ ను దూరం పెడుతున్నారు. లేదా పొలిటికల్ గా అతని నిర్ణయాలను విమర్శిస్తున్నారు. ఇటీవల అధికార డీఎంకే పార్టీని బహిరంగ సభలో విజయ్ విమర్శించినప్పుడు అతన్ని చాలామంది తప్పు పట్టారు. అయితే విజయ్ పొలిటికల్ ఎజెండాను బట్టి అలా మాట్లాడాడని పట్టించుకోని వాళ్ళూ లేకపోలేదు. రజనీకాంత్ అభిమానులు కొందరు ఆ సమయంలో విజయ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దానికి ప్రతిగా విజయ్ అభిమానులూ రజనీకాంత్ ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అయితే... ఈ రాజకీయ పరమైన వివాదం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వార్ గా మారబోతోంది.
రాజకీయ పార్టీపై దృష్టి పెట్టాలని భావించిన విజయ్ ఇక మీదట సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాడు. అతని చివరి సినిమా 'జన నాయగన్' పొంగల్ కానుకగా జనవరి 9న రాబోతోంది. అయితే... ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే ప్రస్తుతం సెట్స్ పైన వున్న రజనీకాంత్ 'జైలర్ -2' సినిమాను సైతం పొంగల్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. విజయ్ తో రాజకీయంగా విభేదిస్తున్న రజనీకాంత్ కావాలనే తన 'జైలర్ -2'ను 'జన నాయగన్'కు పోటీగా రిలీజ్ చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయాల్లోకి వస్తున్నప్పుడే దేనికైనా తెగించాలని నిర్ణయించుకున్న విజయ్... తన 'జన నాయగన్'ను పొంగల్ కే రిలీజ్ చేస్తాడా? లేకపోతే వాయిదా వేసుకుంటాడా? అనేది చూడాల్సి ఉంది. విజయ్ చివరి సినిమా అనే ప్రచారం జరుగుండటం వల్ల 'జన నాయగన్'కు మంచి క్రేజే ఉంది. అలానే 'జైలర్' మూవీతోనే రజనీకాంత్ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో... 'జైలర్ -2' మీదా భారీ అంచనాలేర్పడ్డాయి. మరి ఈ ఇద్దరూ పొంగల్ బరిలో ఒకరితో ఒకరు పోటీ పడతారా? లేకపోతే ఎవరైనా ఒకరు వెనక్కి తగ్గుతారా? అనేది చూడాలి.
Also Read: Naani: రూమర్స్ కు ఘాటుగా బదులిచ్చిన 'పారడైజ్' టీమ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి