Ajith: కార్ రేసర్ గా ద్వితీయస్థానంలో...
ABN, Publish Date - Apr 22 , 2025 | 03:33 PM
తమిళ స్టార్ హీరో అజిత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చిచేరింది. ఇప్పటికే రెండు ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ కాంపిటీషన్ లో తృతీయ స్థానంలో నిలిచిన అజిత్, బెల్జియంలో జరిగిన కార్ రేస్ లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు.
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) నటించిన రెండు సినిమాలు ఈ యేడాది బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. అందులో 'విడా ముయార్చి' (Vidaamuyarchi) పరాజయం పాలు కాగా... 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) బ్యాడ్ టాక్ తెచ్చుకున్న... కలెక్షన్స్ పరంగా మొదటి సినిమాకంటే మెరుగైన ఫలితాన్ని పొందింది. దాంతో అజిత్ అభిమానులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాను తమిళంలో నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ అయితే.. తెలుగులో సక్సెస్ మీట్ ను సైతం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే... తమిళనాట నటుడిగా దూసుకుపోతున్న అజిత్... కార్ రేసర్ గా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకుంటున్నాడు.
ఇప్పటికే అజిత్ రెండు ఇంటర్నేషనల్ కార్ రేసులలో తృతీయ స్థానంలో నిలిచాడు. భారత పతాకాన్ని విదేశాలలో ఎగరేశాడు. తాజాగా అజిత్ బెల్జియం (Belgium) లో జరిగిన కార్ రేస్ లో పాల్గొన్నాడు. అక్కడ అజిత్ కు సెకండ్ ప్లేస్ దక్కింది. అజిత్ బెల్జియం వస్తున్నాడని తెలియగానే అక్కడి అభిమానులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చూడటానికి వచ్చారు. అజిత్ ద్వితీయ స్థానం దక్కించుకోవడం, అక్కడ కూడా భారత పతాకాన్ని రెపరెపలాడించడంతో వాళ్ళంతా ఫుల్ ఖుషీ అయిపోయారు. బెల్జియం ఈవెంట్ కు సంబంధించిన వీడియోలను అజిత్ బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటు నటుడిగా, అటు క్రీడాకారుడిగా అజిత్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం పట్ల అతని అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్స్ తమ అభిమానాన్ని రకరకాలుగా సోషల్ మీడియాలో చాటుకుంటున్నారు. ఏదైన సాధించాలని అజిత్ మనసులో అనుకుంటే ఖచ్చితంగా దానిని ఆయన అఛీవ్ చేసి తీరతాడని కొందరు అంటుంటే... దేశం గర్వించే క్రీడాకారుడు అజిత్ అని, అతనికి ఎల్లలు లేవని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద... యాక్టర్ గా, రేసర్ గా అజిత్ రాణించడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
Also Read: AISF: అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసులు
Also Read: Aamir Khan: వెండితెరపైకి అమీర్ 'మహాభారతం'
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి