Bobby Simha: గురువును కలిసి ఎమోషన్ అయిన బాబీ సింహా

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:03 PM

తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ సింహా తెలుగువాడు. కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రాధమిక విద్యను అభ్యసించాడు. తాజాగా మోపిదేవి వెళ్ళి అక్కడ తన లెక్కల మాస్టర్ ను బాబీ సింహా పలకరించాడు.

ప్రముఖ నటుడు బాబీ సింహా (Bobby Simha) తమిళనాడులో స్టార్ యాక్టర్. మెథడ్ యాక్టింగ్ ను ఔపోసన పట్టి ఏ పాత్ర చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. అయితే బాబీ సింహా తెలుగువారనే విషయం చాలామందికి తెలియదు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం అంతా కృష్ణజిల్లాలోనే జరిగింది. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా తమిళనాడుకు చేరుకున్న బాబీ సింహా సినిమాల మీద అభిమానంతో నటుడిగా అంచలంచెలుగా ఎదిగాడు. 'జిగర్తాండ' (Jigarthanda) మూవీలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డునూ అందుకున్నాడు బాబీ సింహా. తెలుగులోనూ పలు చిత్రాలలో నటించిన బాబీ సింహా ఇటీవల తాన ప్రాధమిక విద్య జరిగిన మోపిదేవికి వెళ్ళాడు. అక్కడ తన లెక్కల మాస్టర్ నర్రా రాంబాబును కలిశాడు బాబీ సింహా. పాఠశాల జీవితాన్ని తలుచుకుని ఎమోషన్ అయ్యాడు. జీవితంలో ఎలా నడుచుకోవాలో తనకు రాంబాబు సార్ చెప్పారని అన్నాడు. తల్లిదండ్రుల తర్వాత మనం పూజించాల్సింది గురువులనే అని బాబీ సింహా ఈ సందర్భంగా చెప్పాడు. తమిళంతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించిన రశ్మీ మీనన్ ను బాబీ సింహా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అలానే నటి పసుపులేటి రేష్మా బాబీ సింహాకు సోదరి అవుతుంది.

Also Read: Bollywood: ఫస్ట్ ఓకే... సెకండ్ నాట్ ఓకే!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 11 , 2025 | 12:03 PM