Muthayya: రాజమౌళి ఆవిష్కరించిన ట్రైలర్
ABN, Publish Date - Apr 28 , 2025 | 06:36 PM
'బలగం' సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా 'ముత్తయ్య'. మే 1 నుండి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఎస్.ఎస్. రాజమౌళి దీని ట్రైలర్ ను ఆవిష్కరించారు.
'బలగం' ఫేమ్ కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య' (Muthayya). ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య (Bhaskhar Maurya) రూపొందించారు. వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 1ను ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి (S.S. Rajamouli), ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ చేతుల మీదుగా 'ముత్తయ్య' సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయించారు. 'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని ఈ సందర్భంగా రాజమౌళి తెలిపి, చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
నటుడు కావాలనేది 60 ఏళ్ల ముత్తయ్య కల. తమ ఊరైన చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ చేస్తాడు. నాటకాల్లో బాగా డైలాగ్స్ చెప్పే ముత్తయ్యకు నటనలో ప్రతిభ ఉంటుంది. కానీ సినిమా నటుడు కావడం అంత సులువు కాదు. అతని కల నెరవేర్చుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందదు. ఇలాంటి పరిస్థితులన్నీ తట్టుకుని ముత్తయ్య నటుడు కాగలిగాడా? ఏదో ఒక రోజు ఊరి ప్రజలకు తను నటించిన సినిమా పెద్ద తెరపై చూపించాలనే కలను ఎలా నెరవేర్చుకున్నాడా? అనేదే ఈ సినిమా. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ద్వారా కథను తెలియచెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు భాస్కర్ మౌర్య. ఇందులో 'కలను వెంటనే నెరవేర్చుకోవాలి, లేదంటే అప్పుడే చంపేసుకోవాలి, కానీ వెంటపెట్టుకుని తిరగకూడదు' అంటూ ముత్తయ్య చెప్పే డైలాగ్ అతని క్యారెక్టర్ పడే మానసిక సంఘర్షణను తెలియచేసే విధంగా ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులను అందకున్న తమ చిత్రం ఓటీటీ వీక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు.
Also Read: Manchu Vishnu: ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప మూవ్‌మెంట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి