Chhatrapati Shivaji : ఛత్రపతి శివాజీని స్మరిస్తున్న సినీఫ్యాన్స్

ABN, Publish Date - Feb 24 , 2025 | 12:47 PM

ప్రస్తుతం సినీ ఫ్యాన్స్ లో హిందీ సినిమా 'ఛావా' (Chhaava)పై చర్చ భలేగా సాగుతోంది. ఆ మౌత్ టాక్ తోనే 'ఛావా' సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తూ ఉంది. ఈ యేడాది ఆల్ ఇండియాలో ఇప్పటిదాకా  నంబర్ వన్ గ్రాసర్ గా నిలచింది 'ఛావా'. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ చరిత్రతో 'ఛావా' సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీని సినీ ఫ్యాన్స్ స్మరించుకుంటున్నారు.

ప్రస్తుతం సినీ ఫ్యాన్స్ లో హిందీ సినిమా 'ఛావా' (Chhaava)పై చర్చ భలేగా సాగుతోంది. ఆ మౌత్ టాక్ తోనే 'ఛావా' సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తూ ఉంది. ఈ యేడాది ఆల్ ఇండియాలో ఇప్పటిదాకా  నంబర్ వన్ గ్రాసర్ గా నిలచింది 'ఛావా'. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ చరిత్రతో 'ఛావా' సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీని సినీ ఫ్యాన్స్ స్మరించుకుంటున్నారు. ఛత్రపతి శివాజీపై సినిమా వస్తే చూడాలనీ ఆశిస్తున్నారు. వారి ఆశలకు ఊపిరిపోస్తూ కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా 'ఛత్రపతి శివాజీ మహారాజ్' (Chatrapati Shivaji Maharaj) అనే హిందీ చిత్రం తెరకెక్కుతోంది.  సందీప్ సింగ్ దర్శకత్వంలో 'ఛత్రపతి శివాజీ మహారాజ్' రూపొందుతోంది. ఈ యేడాదే ఈ చిత్రం వెలుగు చూడనుందని తెలుస్తోంది. తెలుగులోనూ ఆ ప్రయత్నం చేయాలని పలువురు సినిమా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోలు ఛత్రపతి పాత్రలో కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అప్పుడు 'మర్మయోగి'... తరువాత 'మేజర్ చంద్రకాంత్'...


మహానటుడు నటరత్న యన్టీఆర్ కు ముష్కరమూకల దుష్కరచర్యలు అణచిన ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది. ఆ విషయం తెలిసిన దర్శకుడు బి.ఏ.సుబ్బారావు ఏదో ఒక చిత్రంలో యన్టీఆర్ తో శివాజీ వేషం కట్టించాలని ఆశించారు. ఆయన అభిలాషను నెరవేరుస్తూ జూపిటర్ పిక్చర్స్ సంస్థ 'మర్మయోగి' (Marma Yogi)చిత్రాన్ని యన్టీఆర్ హీరోగానే బి.ఏ.సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించింది. 1964లో విడుదలైన 'మర్మయోగి'లో యన్టీఆర్ మారు వేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ గెటప్ ఛత్రపతి శివాజీ మహరాజ్ లాగే ఉంటుంది. పోస్టర్స్ లోనూ ఆ గెటప్ నే ఎక్కువగా వినియోగించారు. అదుగో ఇదుగో అంటూనే కాలం కరిగిపోయింది. యన్టీఆర్ ఛత్రపతి వేషం వేయాలన్న కోరిక తీరలేదు. రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కూడా ఆ ఊసు ఎత్తుకోలేదు. యన్టీఆర్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఆయన టైటిల్ రోల్ లో నటనిర్మాత మోహన్ బాబు 'మేజర్ చంద్రకాంత్' (Major Chandrakanth) నిర్మించారు. ఆ సినిమాలో 'పుణ్యభూమి నా దేశం నమో నమామి...'  పాటలో యన్టీఆర్ తో ఛత్రపతి గెటప్ వేయించారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. తొలి చరణంలోనే "అడుగో ఛత్రపతి..." అంటూ ఈ గీతం సాగుతుంది. ఆ ఛత్రపతి శివాజీ గెటప్ లో యన్టీఆర్ ను చూసిన అభిమానులు పులకించి పోయారు. అదే యన్టీఆర్ నటించిన చివరి చిత్రం. అందువల్ల మొత్తానికి రామారావు మరోమారు శివాజీ గెటప్ లో కనిపించి అభిమానులను అలరించారు.



అర్ధాంగి దర్శకత్వంలో అలరించిన కృష్ణ...



నటశేఖర కృష్ణకు ఎప్పటి నుంచో ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది. స్వరాజ్య పోరాట వీరుడు 'అల్లూరి సీతారామరాజు' (Alluri Seeta RamaRaju) చిత్రం తీసి ఘనవిజయం సాధించిన తరువాత కృష్ణ మనసు ఛత్రపతి పాత్ర పోషించాలనే తపించింది. ఆయనకు కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వీలు పడలేదు. అయితే తన భార్య విజయనిర్మల దర్శకత్వంలో ఆయన నటించిన 'డాక్టర్ సినీయాక్టర్' (Doctor - Cineactor) లో ఓ సీన్ లో ఛత్రపతి శివాజీగా కనిపించి అభిమానులను అలరించారు కృష్ణ.

గణేశన్ ఇంటిపేరుగా మారిన 'శివాజీ'...



మన తెలుగునాట ఛత్రపతి శివాజీపై ఇలా కొందరు నటులు మోజు పెంచుకోగా, తమిళనాట శివాజీ గణేశన్ ఆ పాత్ర పేరుతోనే సుప్రసిద్ధులయ్యారు. సినిమాల్లో అడుగుపెట్టక ముందు గణేశన్ రంగస్థలంపై అనేక మార్లు ఛత్రపతి శివాజీ పాత్రను పోషించి మెప్పించారు. ప్రముఖ రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సి.యన్. అన్నాదురై రాసిన 'శివాజీ కంద హిందూ రాజ్యం' (Shivaji Kanda Hindu Rajyam) లో గణేశన్ అద్భుతంగా నటించేవారు. శివాజీ పాత్రతో అనేక ప్రదర్శనలు ఇచ్చారు గణేశన్. అలా ఆయనను అందరూ శివాజీ పాత్రధారి గణేశన్ గా గుర్తించేవారు. ప్రముఖ సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి ఓ బహిరంగసభలో గణేశన్ ను వేదికపైకి పిలుస్తూ 'శివాజీ  గణేశన్' అని సంబోధించారు. అప్పటి నుంచీ శివాజీ గణేశన్ గానే ఆయన నిలచిపోయారు. చిత్రసీమలోనూ అద్భుతంగా రాణించారు. శివాజీ గణేశన్ తొలి చిత్రం 'పరాశక్తి'. అయితే అంతకు ముందే తెలుగు సినిమా 'పరదేశి'లో ఆయన ఏయన్నార్ తో కలసి నటించారు. ముందుగా 'పరాశక్తి' విడుదలయింది. 'పరదేశి' చిత్రాన్ని అంజలీ పిక్చర్స్ పతాకంపై అంజలీదేవి, ఆమె భర్త ఆదినారాయణరావు నిర్మించారు. తనను తెరకు నటునిగా పరిచయం చేసిన ఆ దంపతులంటే శివాజీగణేశన్ కు ఎంతో గౌరవం ఉండేది. అందువల్లే తరువాతి రోజుల్లో అంజలీ పిక్చర్స్ నిర్మించిన 'భక్త తుకారాం' సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రను పోషించారు శివాజీ గణేశన్.

తండ్రి బాటలోనే బాలయ్య...



యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ కూడా తండ్రి బాటలో పయనిస్తూ సాగారు. ఆయన హీరోగా రూపొందిన 'దేశోద్ధారకుడు' (Desoddharakudu) చిత్రంలో ఓ సీన్ లో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపించారు. అలా బాలయ్య కూడా తన అభిమానులను ఆకట్టుకోవడానికి శివాజీలా అభినయించారు.

Updated Date - Feb 24 , 2025 | 12:55 PM