NTR: ఆడవేషంలో పెద్దాయన....
ABN, Publish Date - Apr 21 , 2025 | 09:13 AM
నటరత్న ఎన్టీఆర్ అంటే రాజసానికి పెట్టింది పేరు. అలాంటి ఆయన కూడా రంగస్థలంపై, వెండితెరపై స్త్రీ పాత్రలను పోషించి మెప్పించారు. ఆ ముచ్చట్లు తెలుసుకుందాం....
నటీనటుల్లో ఆడవాళ్ళు మగవేషం కట్టి, పురుషులు స్త్రీలాగా అభినయించి మెప్పిస్తేనే నటరత్నాలుగా కీర్తి గడిస్తారు. ఇది నాటకరంగంలో తిరుగులేని సూత్రం. అలా ఎందరో నటీనటులు రంగస్థలంపై రాణించారు. నాటకాలు వేసే రోజుల్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులు పోషించి రక్తి కట్టించిన సందర్భాలున్నాయి. అంతెందుకు మహానటుడు నటరత్న యన్టీ రామారావు (NTR) చదువుకొనే రోజుల్లో నాయకురాలు నాగమ్మ పాత్రలో నటించి అలరించారు. ఇక చిత్రసీమలో అడుగు పెట్టిన తరువాత రామారావు మొట్టమొదట స్త్రీ వేషం వేసి ఆకట్టుకున్న చిత్రం 'అన్న-తమ్ముడు' (Anna-Tammudu) అనే చెప్పాలి. ఈ సినిమా 1958లో జనం ముందు నిలచింది. ఇందులో యన్టీఆర్ ఆడ వేషం వేసుకొని పోలీసుల బారి నుండి తప్పించుకొనే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో యన్టీఆర్ ఆడవేషాన్ని చూసి మఫ్టీలో ఉన్న పోలీసు రేలంగి "వయసు మళ్ళిన వన్నెలాడి..." అంటూ పాటందుకుంటారు. ఆ సన్నివేశం భలే వినోదం పండిస్తుంది. 'అన్న-తమ్ముడు'లో యన్టీఆర్ అన్నగా, జగ్గయ్య తమ్మునిగా నటించారు. ఈ సినిమా మంచి ఆదరణ చూరగొంది. అదే సంవత్సరంలో విడుదలైన 'కార్తవరాయని కథ' (Karthavarayani Katha) సినిమాలోనూ ఓ సీన్ లో యన్టీఆర్, ఆయనతో పాటు రమణారెడ్డి ఆడవేషాలు వేసి వినోదం పంచారు. టి.ఆర్.రామన్న దర్శకత్వంలో తెరకెక్కిన 'కార్తవరాయని కథ' పురాణగాథ ఆధారంగా రూపొందింది. స్త్రీ వేషాలు ధరించినప్పుడు యన్టీఆర్ కన్నడలోనూ, రమణారెడ్డి తమిళంలోనూ మాట్లాడడం మరింత వినోదం పంచుతుంది.
యన్టీఆర్ 1960లో వచ్చిన 'దేవాంతకుడు' (Devantakudu) లోనూ మరోమారు స్త్రీ వేషం వేసి రక్తి కట్టించారు. అందులో ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి అలా ఆడవేషం వేసి మురిపించారు. తెలుగులో తొలి సోషియోఫాంటసీగా రూపొందిన 'దేవాంతకుడు' జనాన్ని విశేషంగా అలరించింది. సి.పుల్లయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశేషమేంటంటే అంతకు ముందు 'అన్న-తమ్ముడు'లో యన్టీఆర్ తో స్త్రీవేషం కట్టించిన దర్శకుడు సి.యస్.రావు పుల్లయ్య తనయుడే. అలా తండ్రీకొడుకులు ఇద్దరూ యన్టీఆర్ ను ఆడవేషం కట్టించి అలరించారు.
యన్టీఆర్ తో బి.విఠలాచార్య దర్శకత్వంలో డి.వి.యస్.రాజు 1966లో నిర్మించిన 'పిడుగురాముడు' (Pidugu Ramudu) లోనూ రామారావు మరోమారు ఆడవేషం వేసి రక్తి కట్టించారు. ప్రతినాయకుడు రాజనాల తరుముతూ వస్తే, వారి బారి నుండి తప్పించుకోవడానికి యన్టీఆర్, పద్మనాభం ఆడవేషాలు వేస్తారు. ఆ సందర్భంలో "రంగులు రంగులు..." అంటూ సాగే పాట చోటు చేసుకుంది. అంతకు ముందు యన్టీఆర్ 'అన్న-తమ్ముడు'లో ఆడవేషం వేసినా, పాటలో ఆయనకు ఘంటసాలనే గాత్రదానం చేశారు. అయితే 'పిడుగురాముడు'లో రామారావుకు ఎల్.ఆర్.ఈశ్వరి నేపథ్యగానం చేయడం విశేషం! తరువాతి రోజుల్లో బి.ఏ.సుబ్బారావు రూపొందించిన 'రైతుబిడ్డ' (Rythu Bidda) లో ఓ సీన్ లో అర్ధనారీశ్వర వేషం వేసి భలేగా అలరించారు రామారావు. అప్పుడు సగం స్త్రీగా కనిపించి మురిపించారు. 1979లో విడుదలైన 'డ్రైవర్ రాముడు' (Driver Ramudu) లో పోలీసుల బారి నుండి తప్పించుకోవడానికి చీరలు కట్టి యన్టీఆర్, సత్యనారాయణ హోటల్ లో పిండిరుబ్బేలా కనిపిస్తారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'డ్రైవర్ రాముడు' ఘనవిజయం సాధించింది. అలా రామారావు ఆడవేషంలో కనిపించిన చిత్రాలు ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఆకట్టుకోవడం విశేషం!
Also Read: ఈ నెలలోనే ఎన్టీఆర్ షెడ్యూల్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి