ANR: ఏకకాలంలో మూడు భాషల్లో అల్లావుద్దీన్
ABN, Publish Date - Apr 21 , 2025 | 03:49 PM
అక్కినేని హీరోగా నటించిన 'అల్లాఉద్దీన్ అద్భుత దీపం' చిత్రంలో ఎస్వీరంగారావు ప్రతినాయకుడిగా నటించారు. ఆ సినిమా ముచ్చట్లు తెలుసుకుందాం.
నటసమ్రాట్ ఏయన్నార్ (ANR), నటచక్రవర్తి యస్వీఆర్ (SVR) - అనేక చిత్రాల్లో కలసి నటించారు. వారిద్దరూ తండ్రీకొడుకులుగా, మామాఅల్లుళ్ళుగా, అన్నతమ్ముళ్ళుగా నటించి మెప్పించారు. అయితే వీరిద్దరూ నాయక-ప్రతినాయక పాత్రల్లో నటించిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. అలా ఏయన్నార్ హీరోగా, యస్వీఆర్ విలన్ గా నటించిన చిత్రాలలో 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' (Allauddin Adbhuta Deepam) ఒకటి. అరేబియన్ నైట్స్ లో సుప్రసిద్ధమైన అల్లావుద్దీన్ అద్భుతదీపం కథ ఆధారంగా 'అల్లావుద్దీన్ అద్భుతదీపం' చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ. హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో ఏయన్నార్ అల్లావుద్దీన్ గా, యస్వీఆర్ జాఫర్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అల్లావుద్దీన్ గెటప్ లో ఉన్న ఏయన్నార్, పక్కనే మెడలో స్టిల్ కెమెరా వేసుకొని యస్వీఆర్ ఇలా ఫోటోకు ఫోజిచ్చారు. యస్వీ రంగారావుకు ఫోటోగ్రఫి అన్నా, హంటింగ్ అన్నా ఎంతో మక్కువ. సమయం దొరికితే చాలు తన దగ్గర ఉన్న స్టిల్ కెమెరాతో తనకు నచ్చిన సీన్స్ ను క్లిక్ అనిపించేవారు. ఇక షూటింగ్ లేని సమయంలో మిత్రులతో కలసి దూరంగా హంటింగ్ కు వెళ్ళేవారు.
ఇక యస్వీఆర్, ఏయన్నార్ నటించిన 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' విషయానికి వస్తే ఇందులో అంజలీదేవి నాయిక యాస్మిన్ పాత్ర పోషించారు. ఈ సినిమాను 'అల్లావుద్దీన్ అండ్ ద వండర్ ల్యాంప్' పేరుతో ఆరంభించారు. తెలుగులో 'అల్లావుద్దీన్ అద్బతుదీపం'గానూ, తమిళంలో 'అల్లావుద్దీన్ అర్పుద విలక్కుమ్'గానూ, హిందీలో 'అల్లాదీన్ కా చిరాగ్'గానూ రూపొందించారు. ఏకకాలంలో మూడు భాషల్లో చిత్రీకరణ చేసినా, తొలుత 1957 మార్చి 29న తమిళ వర్షన్ రిలీజ్ చేశారు. తరువాత అదే యేడాది ఏప్రిల్ 13న తెలుగులో విడుదల చేశారు. మరి కొద్ది రోజులకు హిందీలో ఈ సినిమా వెలుగు చూసింది. అయితే ఏ భాషలోనూ 'అల్లావుద్దీన్ అండ్ ద వండర్ ల్యాంప్' అలరించలేకపోయింది. అందుకు కారణం లేకపోలేదు.
అరేబియన్ నైట్స్ లోని అల్లావుద్దీన్ కథనే కొన్ని మార్పులూ చేర్పులూ చేసి తెలుగు వాతావరణానికి అనువుగా పింగళి నాగేంద్రరావు 'పాతాళభైరవి' కథ రూపొందించారు. అందులో యన్టీఆర్ కథానాయకునిగా, ప్రతినాయక పాత్రలో యస్వీఆర్ నటించారు. 1951 మార్చి 15న విడుదలైన 'పాతాళభైరవి' బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమా జనం మదిలో చెరగని ముద్ర వేసింది. పైగా 'పాతాళభైరవి'లో విలన్ గా నటించిన యస్వీఆర్ ఇందులోనూ ప్రతినాయక పాత్ర పోషించడంతో జనం కొత్తగా అనుభూతి చెందలేదు. ఏది ఏమైనా టి.ఆర్. రఘునాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పరాజయం పాలయింది. అయితే ఓ పాటను గేవాకలర్ లో చిత్రీకరించారు. అయినా ఎవరూ అంతగా ఆదరించలేదు. ఈ సినిమా రిలీజ్ కు ముందు అదే యేడాది విజయావారి 'మాయాబజార్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఆ కారణంగానూ 'అల్లావుద్దీన్' అంత ఆదరణ చూరగొనలేకపోయింది.
Also Read: Vicky Kaushal: 'ఛావా' విజయాన్ని మరువలేకున్న రశ్మిక
Also Read: Singer Pravashti: పాడుతా తీయగా పై ఫైర్ అయిన సింగర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి