ANR: శ్రీమహావిష్ణువు పాత్రలో ఏయన్నార్...

ABN, Publish Date - Apr 22 , 2025 | 10:01 AM

శ్రీ మహా విష్ణువు అనగానే తెలుగువారి మదిలో మెదిలే వ్యక్తి నందమూరి తారకరామారావు. కానీ ఆయన సమకాలీనుడైన అక్కినేని సైతం శ్రీమహా విష్ణువుగా మూడు చిత్రాలలో నటించారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

తెలుగువారికి పౌరాణికాలు అనగానే చప్పున గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్నయన్టీఆర్ (NTR). మరో మహానటుడు నటసమ్రాట్ ఏయన్నార్ (ANR) సైతం కొన్ని పౌరాణిక చిత్రాల్లో నటించారు. అందునా శ్రీమహావిష్ణువు పాత్రలో యన్టీఆర్ ను తప్ప తెలుగువారు ఎవరినీ ఊహించుకోలేరు. అలాంటి శ్రీమహావిష్ణువు పాత్రలో ఏయన్నార్ సైతం మూడు సార్లు తెరపై కనిపించడం విశేషం! అలా మూడోసారి విష్ణువుగా ఏయన్నార్ కనిపించిన చిత్రం 1967లో వచ్చిన 'సతీ సుమతి' (Sati Sumathi). అంతకు ముందు 1964లో చిత్తూరు నాగయ్య నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన 'రామదాసు' (Ramadasu)లోనూ విష్ణుమూర్తిగా ఏయన్నార్ అతిథి పాత్రలో కనిపించారు. అందులో శ్రీమహాలక్ష్మిగా అంజలీదేవి తెరపై తళుక్కుమన్నారు. దీనికంటే ముందు 1958లో బి.ఏ.సుబ్బారావు నిర్మించి, దర్శకత్వం వహించిన 'చెంచులక్ష్మి' (Chenchu Lakshmi)లోనూ శ్రీమహావిష్ణువు పాత్రలో ఏయన్నార్ అభినయించారు. ఇందులో శ్రీమహాలక్ష్మిగా, చెంచులక్ష్మిగా అంజలీదేవి అలరించారు. 'చెంచులక్ష్మి' చిత్రం మంచి విజయం సాధించింది. అప్పటికే 'మాయాబజార్'లో శ్రీకృష్ణ పాత్రలో యన్టీఆర్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులోనే పతాక సన్నివేశంలో శ్రీమహావిష్ణువుగా యన్టీఆర్ కనిపించారు. అయినప్పటికీ బి.ఏ.సుబ్బారావు తన 'చెంచులక్ష్మి'లో ఏయన్నార్ ను విష్ణుమూర్తి పాత్ర కోసం ఎన్నుకొని విజయం సాధించారు. అందులో లక్ష్మీదేవిగా నటించిన అంజలీదేవితో కలసి 'రామదాసు'లో రెండో సారి విష్ణువుగా ఏయన్నార్ కనిపించారు. అంజలీదేవి సొంత చిత్రంగా రూపొందిన 'సతీ సుమతి'లో ఆమె కోరగానే ఏయన్నార్ అందులో శ్రీమహావిష్ణువుగా కనిపించడానికి అంగీకరించారు. అలా మూడుసార్లు విష్ణువుగా ఏయన్నార్ తెరపై తళుక్కుమన్నారు. శ్రీమహావిష్ణువుగా ఏయన్నార్ మూడుసార్లు కనిపించిన చిత్రాలతోనూ అంజలీదేవికి అనుబంధం ఉండడం విశేషం!


అంజలీదేవి, ఆమె భర్త ఆదినారాయణరావుతో మొదటి నుంచీ అక్కినేనికి అనుబంధం ఉంది. అంజలీదేవి, ఆదినారాయణ రావుతో కలసి అక్కినేని స్లీపింగ్ పార్ట్ నర్స్ గా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో 'స్త్రీ సాహసం' నిర్మించారు. వేదాంతం కూడా ఆ చిత్రానికి నిర్మాణంలో పాలు పంచుకున్నారు. తరువాత 'అంజలీ పిక్చర్స్ ' పతాకంపై రూపొందిన 'అనార్కలి, సువర్ణసుందరి, రుణానుబంధం' చిత్రాలలో వేదాంతం దర్శకత్వంలోనే ఏయన్నార్ నటించారు. ఈ చిత్రాలలో 'సువర్ణసుందరి' బిగ్ హిట్. ఈ సినిమాను తరువాత హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేయగా,అందులోనూ ఏయన్నార్ హీరో. ఆయనకు ఏకైకస్ట్రెయిట్ హిందీ మూవీ 'సువర్ణసుందరి' కావడం విశేషం! ఆ తరువాత అంజలీ పిక్చర్స్ లో ఏయన్నార్ నటించిన 'భక్త తుకారాం' కూడా మంచి విజయం సాధించింది.ఇలా అంజలీదేవితోనూ, ఆమె నిర్మాణ సంస్థ అంజలీపిక్చర్స్ తోనూ ఏయన్నార్ కు ఎంతో అనుబంధం ఉంది. అలాగే అంజలీ పిక్చర్స్ సంస్థ తమిళంలో నిర్మించిన కొన్ని చిత్రాలలో జెమినీగణేశన్ నటించారు. ఆ అభిమానంతో జెమినీ, ఆయన భార్య సావిత్రి 'సతీ సుమతి'లో పార్వతీ పరమేశ్వరులుగా కనిపించారు. ఇందులో మాత్రం ఏయన్నార్ సరసన లక్ష్మీదేవిగా కృష్ణకుమారి నటించారు. ఇక బ్రహ్మ పాత్రలో జగ్గయ్య, సరస్వతీదేవిగా జమున కనిపించడం విశేషం! ఈ చిత్రంలో సతీ అనసూయగా, సతీ సుమతిగా అంజలీదేవి ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం! ఇందులో సుమతి భర్త కౌశికునిగా కాంతారావు, అనసూయ పతి అత్రి మహామునిగా ధూళిపాల నటించారు. 1967లో వెలుగు చూసిన 'సతీ సుమతి' చిత్రంలోనే ఇలా మేటి నటీనటుల కలయికలో వెలసిన దృశ్యం ఇక్కడ కనువిందు చేస్తోంది.

Also Read: Ram- Bhagya Shri: ఒకే గదిలో రామ్ , భాగ్యశ్రీ...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 22 , 2025 | 11:39 AM