Photo talks: మ్యూజికల్ హిట్స్ కు శ్రీకారం

ABN, Publish Date - Apr 10 , 2025 | 12:53 PM

చిరంజీవిని నవలా నాయకుడిగా నిలబెట్టిన చిత్రం 'అభిలాష'. ఈ నవలా చిత్రం మ్యూజికల్ గానూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో తెరకెక్కించిన తొలి చిత్రం 'అభిలాష' (Abhilasha) పాటల రికార్డింగ్ సందర్భంగా తీసిన ఫోటో ఇది. తొలి పాటగా ఆత్రేయ (Atreya) రాసిన "వేళాపాల లేదు కుర్రాళ్ళాటకు..."ను రికార్డ్ చేశారు. ఆ సందర్భంలో ఇళయరాజా, రికార్డిస్ట్ కూర్చుని ఉండగా, నిల్చున్న వారిలో ఎడమ నుంచి రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సినీ డైలాగ్ రైటర్ సత్యమూర్తి, డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి, గాయని ఎస్.జానకి, ఆత్రేయ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత కె.యస్.రామారావు ఉన్నారు.


చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి (A.Kodanda Rami Reddy), ఇళయరాజా (IlayaRaja), కె.యస్.రామారావు (K S Rama Rao), యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) - ఈ ఐదుమంది కాంబినేషన్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకలోకాన్ని ఓ ఊపు ఊపింది. అలాగే చిరంజీవిని కూడా 'నవలా నాయకుడు'గా తీర్చిదిద్దడానికి ఈ కాంబోనే కారణమయింది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల 'అభిలాష' ఆధారంగా అదే పేరుతో కె. యస్. రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై సినిమా నిర్మించారు. అదే సమయంలో వరుసగా నాలుగైదు చిత్రాలు తెరకెక్కించాలనీ ప్రణాళిక రూపొందించుకున్నారు. అప్పట్లో యండమూరి రచనలు పాఠకులను విశేషంగా అలరించాయి. వాటిలో కొన్నిటిని కె. యస్. రామారావు సినిమాల కోసమే రాశారు. ఆ నవలలే "అభిలాష, డబ్బు టు ది పవరాఫ్ డబ్బు, రాక్షసుడు, మరణమృదంగం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్" - వీటిలో 'డబ్బు టు ది పవరాఫ్ డబ్బు ' నవల 'ఛాలెంజ్'గా వచ్చింది. మిగిలినవన్నీ అవే టైటిల్స్ తో సినిమాలుగా వెలుగు చూశాయి. మొదటి నాలుగు చిత్రాలకు ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు కాగా, చివరి సినిమాకు యండమూరినే డైరెక్టర్ గా వ్యవహరించారు. వరుసగా నాలుగు చిత్రాలు గ్రాండ్ సక్సెస్ ను సాధించడమే కాదు ఇళయరాజా పాటలతో మ్యూజికల్ హిట్స్ గానూ నిలిచాయి. కె.యస్.రామారావు బ్యానర్ లో చిరంజీవి నటించడానికి అంగీకరించిన ఐదవ చిత్రం 'స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్'. ఈ సినిమా ఘోరపరాజయం పాలయింది. ఆ తరువాత మళ్ళీ చిరంజీవి క్రియేటివ్ కమర్షియల్స్ లో నటించలేదు.

Also Read: కల్యాణ్‌రామ్‌ నట విశ్వరూపం చూస్తారు

Also Read: Trisha - Charmy: ఈనాటి ఈ బంధమే నాటిదో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 12:54 PM