ANR: సంగీతాభిమానులకు ఆనందం పంచిన అనార్కలి
ABN, Publish Date - Apr 29 , 2025 | 10:39 AM
అక్కినేని, అంజలి జంటగా నటించిన 'అనార్కలి' చిత్రం ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఆదినారాయణరావు నిర్మించి, సంగీతం అందించిన ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
సంగీతాభిమానులకు ఆనందం పంచుతూ 70 ఏళ్ళ కిందట తెలుగువారి 'అనార్కలి' సందడి చేసింది. ఏప్రిల్ 28తో 'అనార్కలి' ఏడు పదులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.
అంజలీ పిక్చర్స్ పతాకంపై అంజలీదేవి, ఆమె భర్త ఆదినారాయణరావు నిర్మించిన చారిత్రక ప్రేమకథాచిత్రం 'అనార్కలి'. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన తెలుగు అనార్కలి 1955 ఏప్రిల్ 28వ తేదీన విడుదలయింది. అంతకు ముందు 1953లో రూపొందిన హిందీ 'అనార్కలి' చిత్రం ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది. హిందీలో బినారాయ్ అనార్కలిగా, ప్రదీప్ కుమార్ సలీమ్ గా నటించారు. తెలుగులో అంజలీదేవి అనార్కలి పాత్రను పోషించగా, ఏయన్నార్ సలీమ్ పాత్ర ధరించారు. హిందీలో అక్బర్ గా ముబారక్ నటించగా, తెలుగులో ఆ పాత్రలో యస్వీ రంగారావు అభినయించారు. ఈ చిత్రానికి నిర్మాత ఆదినారాయణరావే సంగీతం సమకూర్చారు.
రామచంద్ర బాణీలే ఆధారం
అంజలీ పిక్చర్స్ పతాకంపై తాము నిర్మించిన అనేక చిత్రాలకు ఆదినారాయణరావు సంగీతం సమకూర్చి అలరించారు. హిందీ 'అనార్కలి' చిత్రానికి సి.రామచంద్ర స్వరకల్పన చేశారు. ఆయన బాణీలు 1953లో యావద్భారతాన్నీ పులకింప చేశాయి. దాంతో అందులోని రెండు పాటల ట్యూన్స్ ను తెలుగులోనూ యథాతథంగా ఉపయోగించారు ఆదినారాయణరావు. 'జీవితమే సఫలమూ...' , 'రావోయి సఖా..." అంటూ సాగే పాటలకు సి.రామచంద్ర బాణీలే ఆధారం.
తనకు స్వీయ ప్రతిభ ఉన్నా 'అనార్కలి'లో రామచంద్ర బాణీలను కొన్నిటిని వినియోగించుకున్నారు ఆదినారాయణ రావు. అయితే తెలుగు అనార్కలిలో ఆదినారాయణ రావు స్వరపరచిన 'రాజశేఖరా...' పాట సంగీతాభిమానులను పులకింప చేసింది. ఈ నాటికీ ఆ పాటను మ్యూజిక్ లవర్స్ వింటూ ఆనందిస్తూనే ఉన్నారు. 'అనార్కలి' తెలుగులోనూ మంచి విజయం సాధించింది. శతదినోత్సవాలు చూసింది.
Also Read: Anupam Kher: 23 ఏళ్ళ తర్వాత మరోసారి...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి