A. R. Rahman : కృత్రిమ మేధ గురించి రెహ్మాన్...
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:59 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ తన మనసులోని మాటలను చెప్పారు. ఆయన ఏమన్నారంటే...
కొత్తొక వింత- పాతొక రోత అంటూ సాగుతూ ఉంటుంది జనం. అయితే కొత్త మొహంమొత్తినప్పుడు పాతనే మళ్ళీ ఆలింగనం చేసుకోవడం మనుషుల సహజలక్షణం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కృత్రిమ మేధ (Artificial Intelligence) వైపు పరుగులు తీస్తున్నారు. ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవులకు నిరుద్యోగ సమస్య ఎదురవుతుందని కొందరు సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఏ.ఐ. వైపే అందరూ దృష్టిని సారిస్తున్నారు. అందుకు సినిమా రంగమేమీ మినహాయింపు కాదు. ఒకప్పుడు ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సామాన్యుల ఉపాధి కరవవుతుందని వాపోయిన హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరాన్ (James Cameron) లాంటివారు కూడా పనులు చకచకా పూర్తి కావాలంటే ఏఐని ఉపయోగించక తప్పదు అనే నిర్ణయానికి వచ్చేశారు. అదే తీరున ఎందరో మూవీ టెక్నీషియన్స్ ఏఐని తమ ప్రాజెక్ట్స్ కు ఎలా ఉపయోగించుకోవాలో యోచిస్తున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకులు, గాయనీగాయకులు, గీత రచయితలకు కృత్రిమ మేధ చెక్ పెట్టేలా ఉందనీ అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల్లోనూ ఏఐని ఉపయోగించి పాటలు కంపోజ్ చేస్తున్నారు. కొందరు ఏకంగా దివంగత గాయనీగాయకుల గళాలను ఇమిటేట్ చేస్తూ పాటలు రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగాలు హర్షించదగ్గవి కావు అంటున్నారు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రహమాన్ (A R Rahaman). మ్యూజిక్ వరల్డ్ లో ఏ మోడరన్ టెక్నాలజీ వచ్చినా దానిని అందిపుచ్చుకొని తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నారు రహమాన్. అలాంటి ఆయన కూడా ఏఐని వ్యతిరేకించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏ నూతన ప్రక్రియనైనా అందిపుచ్చుకోవడం మంచిదే కానీ, దాని వల్ల మానవాళికి ఏ మాత్రం ఉపయోగం ఉంది అనీ ఆలోచించాలని అంటున్నారు రహమాన్. అలాగని ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కు తానేమీ వ్యతిరేకిని కాననీ రహమాన్ స్పష్టం చేశారు. అయితే కృత్రిమ మేధను ఉపయోగించుకుంటూ మన మేధకు పదను పెట్టాలే కానీ, మొత్తంగా దానిపైనే ఆధారపడితే అది కృత్రిమంగానే ఉంటుంది తప్ప ఒరిజినాలిటీని చూపించదనీ ఆయన హెచ్చరిస్తున్నారు. సంగీత ప్రపంచంలో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రయోగాలు చేయవచ్చునని ఆయన చెప్పారు. అయితే ఇతరుల స్వరాలను అనుకరించడం, దివంగత గాయనీగాయకుల గాత్రాలను పునఃసృష్టించడం సబబు కాదని రహమాన్ హితవు పలికారు. తద్వారా క్రియేటివిటీ మరుగున పడిపోతుందని, ఎవరికి కావలసిన గొంతను వారు అరువు తెచ్చుకుంటూ పాటలు అల్లుకుంటూ పోతే ఏది సహజమైనదో శ్రోతలు తెలుసుకోలేక అయోమయ పరిస్థితికి గురవుతారనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బాధ్యత వహించేవారెవరూ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇంతకు ముందు దుబాయ్ లో రహమాన్ నిర్వహించిన "అబండెన్స్ ఫర్ ద ఫ్యూచర్' (Abundance For The Future) అనే ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ సమయంలోనే మెటాహ్యూమన్స్ (Metahumans) సాయంతో ఓ బ్యాండ్ ను నిర్వహించబోతున్నానని ప్రకటించారు. వర్చువల్ 3డి టెక్నాలజీతో ఈ మెటాహ్యూమన్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'అన్ రియల్ ఇంజిన్' (Unreal Engine) టూల్ తో తాను సాగబోతున్నట్టు రహమాన్ తెలిపారు. ఏఐ టెక్నాలజీతో తన మ్యూజిక్ లో వండర్స్ సృష్టించబోతున్నారు రహమాన్. కృత్రిమ మేధకు తన స్వరజ్ఞానం జోడించి రహమాన్ రాబోయే రోజుల్లో సంగీతప్రియులను ఏ తీరున అలరిస్తారో చూడాలి.
Also Read: NTR - ANR: ఒకరి వెనుకే మరొకరు...
Also Read: Akhanda -2: హక్కుల కోసం ఓటీటీల ఆరాటం
Also Read: Sankranthi Movies: వంద రోజులు ఎక్కడంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి