Venu Swamy: సారీ చెప్పిన వేణు స్వామి.. ఇకపై అలా జరగదు!
ABN, Publish Date - Jan 21 , 2025 | 08:29 PM
వేణు స్వామి క్షమాపణలు చెప్పారు. నాగ చైతన్య, శోభితల విషయంలో తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలుపుతూ.. మంగళవారం ఉమెన్ కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు. ఉమెన్ కమిషన్‌కు కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. అసలు విషయం ఏమిటంటే..
వేణు స్వామి కొన్ని రోజుల క్రితం బాగా వైరల్ అయిన పేరు ఇది. జోష్యం అంటూ సెలబ్రిటీల జీవితాలపై ఆయన చేసే కామెంట్స్ వైరల్ అవడం, ఎక్కడో ఒకటో రెండో ఆయన చెప్పినవి నిజమవడంతో.. అది తను చెప్పినందు వల్లే జరిగిందని చెప్పడం వంటి వాటితో వేణు స్వామి బాగా వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, శోభితల విషయంలో ఆయన జోష్యం శృతి మించడంతో ఇండస్ట్రీ మొత్తం ఫైరయింది. వేణు స్వామి వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫైరవుతూ.. ఉమెన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మధ్యలో ఆయనపై కేసులు కూడా నడిచాయి. ఇకపై సెలబ్రిటీల జోలికి వెళ్లనని ఆ మధ్య చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు ఉమెన్ కమిషన్ ముందు హాజరై.. బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
Also Read- Priyanka Chopra: చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో పూజలు.. ఉపాసనకు థ్యాంక్స్
గతంలో నాగచైతన్య, సమంతలు ఎలా అయితే విడిపోయారో.. ఇప్పుడు నాగ చైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పిన వేణు స్వామి.. ఉమెన్ కమిషన్ ముందు నాగ చైతన్య, శోభితలపై గతంలో తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉమెన్ కమిషన్‌కు కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకూడని వేణు స్వామిని హెచ్చరించింది ఉమెన్ కమిషన్.
అసలేం జరిగిందంటే.. నాగ చైతన్య, శోభితల ప్రేమ వ్యవహారం బయటికి రావడం, ఆ తర్వాత పెళ్లి అనేలా వార్తలు వచ్చిన నేపథ్యంలో వేణు స్వామి ఎప్పటిలానే ఆ జంటపై జోష్యం చెప్పి.. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఫిలిం జర్నలిస్ట్‌లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉమెన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉమెన్ కమిషన్, వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు కూడా ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరోసారి నోటీసులు జారీ చేసింది ఉమెన్ కమిషన్. దీంతో మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరైన వేణు స్వామి.. గతంలో తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపి, క్షమాపణలు కోరారు.