Ram Charan: రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు.. కాదు కాదు అంతకుమించి!
ABN, Publish Date - Jan 19 , 2025 | 07:25 AM
ఒక చేత్తో చేసే సాయం మరో చేతికి కూడా తెలియకూడదనే మనస్థత్వం ఉన్న హీరోలు మెగా హీరోలు. అయినా కూడా వారి సాయం దాగదు. ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట రివీల్ అవుతూనే ఉంటుంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ వ్యక్తికి అందించిన సాయం గురించి అన్‌స్టాపబుల్ షోలో, ఆ సాయం పొందిన వ్యక్తే రివీల్ చేయడంతో.. రామ్ చరణ్ గొప్పతనంపై మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయం అంటే చాలు ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా మెగా హీరోలు చేసే సాయం గురించి ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఒక్క మెగా ఫ్యామిలీ అనే కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి మొదటి నుండి తను సాయం చేయడమే కాకుండా.. తన అభిమానులకు కూడా ఆ మార్గంలో నడిపించి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడాయన వారసత్వాన్ని ఈ విషయంలోనూ రామ్ చరణ్ ముందుకు తీసుకెళుతున్నారు. తాజాగా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో’ కి వచ్చిన రామ్ చరణ్ గొప్పతనాన్ని బాలయ్య ప్రత్యక్షంగా రివీల్ చేశారు. ఓ అభిమాని పడుతున్న కష్టాలకు రామ్ చరణ్ చలించిపోయి సాయమందించిన తీరును ఈ ఎపిసోడ్‌లో తెలియజేశారు. ఆ విషయంలోకి వస్తే...
Also Read- Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!
బంగారుపాళ్యానికి చెందిన ఎంవీడీ మల్లేశ్వర్రావు (స్ర్కీన్ నేమ్ శంకర మహంతి) పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు, దసరా, గామి, నారప్ప, పురుషోత్తముడు’ వంటి దాదాపు 53 చిత్రాల్లో నటించారు. చిరంజీవి అభిమాని అయిన మల్లేశ్వర్రావు ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్‌లో మూడు నెలలకోసారి రక్తదానం చేసేవారు. దీంతో బ్లడ్ బ్యాంకు వ్యవహారాలను చూసే చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడితో పరిచయం పెరిగింది. మల్లేశ్వర్రావు సతీమణి వెంకటదుర్గ(58) తన భర్తను చూసేందుకు కుటుంబ సమేతంగా 2023 జూలైలో హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లేశ్వర్రావు అపోలో ఆస్పత్రిలో వైద్యం కోసం చేర్చారు. ఈ విషయం స్వామినాయుడికి తెలియడంతో హీరో రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసనకు చెప్పారు. దీంతో చలించిన ఉపాసన వెంటనే అపోలో సిబ్బందికి సమాచారం ఇచ్చి వెంకటదుర్గకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
17 రోజులు ఐసీయూలో వున్న వెంకటదుర్గకు ప్రత్యేక డాక్టర్‌ను నియమించి మెరుగైన సేవలు అందించడంతో ఆమె కోలుకున్నారు. దీనికి కృతజ్ఞతలు తెలిపేందుకు మల్లేశ్వర్రావు అవకాశం కోసం ఎదురు చూశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రాంలో ముఖ్యఅతిథిగా హీరో రామ్‌చరణ్ వస్తున్న విషయం తెలుసుకుని ఆహా ఓటీటీ ఫ్లాట్‌పాం నిర్వాహకులను మల్లేశ్వర్రావు సంప్రదించారు. వారు అవకాశం కల్పించడంతో తన అభిమాన హీరో చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ను చూసి మల్లేశ్వర్రావు భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో పాటు ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆహా నిర్వాహకులు ఇతర ఖర్చులకు రూ.లక్ష రూపాయల చెక్కును మల్లేశ్వర్రావుకు అందజేశారు. ఈ విషయం తెలిసి రామ్ చరణ్, ఉపాసనలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇలా తెలిసినవి కొన్నే.. తెలియకుండా చరణ్ చాలా చేస్తాడని, ఆ సాయం అందుకున్నవాళ్లకు కూడా చరణ్ సాయం చేసినట్లుగా తెలియదని హీరో శర్వానంద్ ఇదే షోలో చెప్పడం విశేషం.