Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!
ABN, Publish Date - Jan 18 , 2025 | 04:47 PM
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదానికి కారణం అంతా ఆస్తి తగాదాలే అని అనుకుంటున్న తరుణంలో.. మంచు మనోజ్ మీడియా ఎదుట షాకింగ్ విషయాలు బయట పెట్టారు. తను గొడవ పడటం లేదని, పోరాటం చేస్తున్నానని, ఆ పోరాటం కూడా ఎందుకో క్లారిటీ ఇచ్చాడు మంచు మనోజ్. ఇంతకీ మనోజ్ ఏం చెప్పాడంటే..
గత కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ఏ విధంగా వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియని విషయం కాదు. ఎందుకంటే, వారు బహిరంగంగానే కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ తను చేసేది ప్రతీది అందరికీ తెలియాలని మీడియాను వెంటేసుకుని మరీ చేస్తుండటంతో.. మోహన్ బాబు, మంచు విష్ణు వంటివారు ఆ ఫ్యామిలీలో జరిగేది ఎంత దాచాలన్నా దాగడం లేదు. చివరికి కన్న కొడుకుపైనే పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసేంతగా మోహన్ బాబు పరిస్థితి ఉందంటే.. వారి మధ్య వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయం సూక్ష్మంగా పరిశీలిస్తే.. మోహన్ బాబు చెబుతున్న ప్రకారం ఆస్తి కోసమే ఈ వివాదం అనేది తెలుస్తుంటే.. మంచు మనోజ్ మాత్రం ఆస్తి కోసం కాదు నా పోరాటం అంటూ, అసలు విషయం మీడియా సమక్షంలో ఓపెన్ అయ్యారు.
Also Read: Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..
ముందుగా మోహన్ బాబు ఈ వివాదంలో ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే.. ‘‘తను సంపాదించిన ఆస్తులలో ఉన్నవారిని వెంటనే వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని, తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి, తనకు అప్పగించాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో కోరారు. అయితే, గత కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలో నివాసం ఉంటుండగా.. జల్ పల్లి ఇంటిలో మంచు మనోజ్ నివాసం ఉంటున్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని మంచు మనోజ్‌కు నోటీసు పంపించారు. ఈ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు.. రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను శనివారం మంచు మనోజ్ కలిశారు.
రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్‌ని కలిసిన అనంతరం.. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘వారంతా చెబుతున్నట్లుగా అసలు మాకు ఆస్తి తగాదాలు లేనే లేవు. నా పోరాటం అంతా విద్యార్థుల కోసమే. వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. మీకు కూడా ఆ విషయం తెలుసు. మా నాన్నను అడ్డం పెట్టుకుని మా అన్న విష్ణు ఆడుతున్న నాటకమిది. విద్యార్థులు, వారి కుటుంబాలు, అలాగే నా కుటుంబం కోసమే నేను న్యాయ పోరాటం చేస్తున్నా. ఈ విషయంలో న్యాయం దక్కే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నా పోరాటం ఆగదు, ఆపను..’’ అని మనోజ్ స్పష్టం చేశారు.