సినిమాటిక్ క్రియేటివిటీ ... సైంటిఫిక్ ఎక్స్ పెరిమెంట్స్!
ABN, Publish Date - Apr 08 , 2025 | 05:09 PM
ఊహలకు రెక్కలు వస్తే వాస్తవాలు పరుగులు తీస్తాయని ఓ సామెత. ఇది నవ్వుతాలుకు అన్నట్టుగా ఉంటుంది కానీ, ఇందులో ఎంతో వాస్తవం ఉంది. ఓ నాటి ఊహ- మరో నాటికి వాస్తవం కావచ్చునని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు.
ఊహలకు రెక్కలు వస్తే వాస్తవాలు పరుగులు తీస్తాయని ఓ సామెత. ఇది నవ్వుతాలుకు అన్నట్టుగా ఉంటుంది కానీ, ఇందులో ఎంతో వాస్తవం ఉంది. ఓ నాటి ఊహ- మరో నాటికి వాస్తవం కావచ్చునని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. అదే తీరున సినిమా క్రియేటివిటీ - సైంటిఫిక్ ఎక్స్ పెరిమెంట్స్ కు దారి తీస్తోంది. దశాబ్దాల క్రిందట విఖ్యాత అమెరికన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రాసిన 'రోబో' (Robot) నవలల ఆధారంగానే నేడు 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్' (Artificial Intelligence)కు న్యాయసూత్రాలు రూపొందిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అసిమోవ్ రోబో నవలల ఆధారంగా కొన్ని సినిమాలు వెలుగు చూశాయి. ఇక 'జురాసిక్ పార్క్' (Jurassic Park) సినిమాను చూసి అంతరించి పోయిన జంతుజాలాన్ని పునః సృష్టి చేసేలా 'జీన్ ఎడిటింగ్' సాగుతోంది. అలాగే బుల్లితెరపై విశేషాదరణ చూరగొన్న 'గేమ్స్ ఆఫ్ థ్రాన్స్' (Game of Thrones)లోని డైర్ వూల్ఫ్ ను చూసి ఇప్పుడు రీక్రియేషన్ చేశారు. నిజానికి డైర్ వూల్ఫ్ అన్న జంతుజాతి అంతరించి 12,500 సంవత్సరాలయింది. 'గేమ్ ఆఫ్ థ్రాన్స్'లో గ్రాఫిక్స్ ద్వారా రూపొందిన డైర్ వూల్ఫ్ ను చూసినప్పటి నుంచీ జీన్ సైంటిస్ట్స్ ఆ జీవిని రీక్రియేట్ చేసే పనిలో పడ్డారు. అమెరికాకు చెందిన 'కొలొస్సల్ బయోసైన్సెస్' అనే బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ కంపెనీ జీన్ ఎడిటింగ్ విధానంతో మొత్తానికి 12500 ఏళ్ళ క్రితం ఈ భూమిపై సంచరించి తరువాత అంతమై పోయిన డైర్ వూల్ఫ్ పిల్లలను సృష్టించింది. ఈ ప్రయోగశాలలో మూడు డైర్ వూల్ఫ్ పిల్లల్లో రెండు మగవి, ఒకటి ఆడది. మగ డైర్స్ కు రోమన్ సామ్రాజ్య నిర్మాణరూపశిల్పులైన కవల సోదరులు రొములస్, రెమస్ అన్న పేర్లు పెట్టారు. ఇక 'గేమ్ ఆఫ్ థ్రాన్స్'లో కీలకమైన పాత్ర ఖలీసి పేరును ఆడ డైర్ పిల్లకు జోడించారు.
12500 ఏళ్ళ నాటి మంచు యుగంలో సంచరించిన డైర్ వూల్ఫ్ పిల్లలను పునఃసృష్టించిన వైనాన్ని హాలీవుడ్ జనం కూడా విశేషంగా చర్చించుకుంటున్నారు. కొందరు 'జురాసిక్ పార్క్' నవల రచయిత మైఖేల్ క్రిచ్ టన్ (Michael Crichton) ను, ఆ చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ (Steven Speilberg) ను గుర్తు చేసుకోగా, మరికొందరు 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' రైటర్ జార్ట్ రేమండ్ మార్టిన్ (George Raymond Martin) ను తలచుకుంటున్నారు. వీరిలో స్పీల్ బెర్గ్, జార్జ్ రేమండ్ మార్టిన్ జీవించే ఉన్నారు. వారిద్దరూ డైర్ వూల్ఫ్స్ పిల్లల గురించి మిత్రులతో సన్నిహితులతో భలేగా ముచ్చటిస్తున్నారు. తాను 'గేమ్ ఆఫ్ థ్రాన్స్'లో చొప్పించిన ఓ అంతరించి పోయిన జంతువును సైంటిస్ట్స్ తిరిగి సృష్టించడం పట్ల మార్టిన్ ఆనందం అంతా ఇంతా కాకుండా ఉంది.
ఇక సినిమా లవర్స్ గతంలో తాము వీక్షించిన సైన్స్ ఫిక్షన్ మూవీస్ ను, వాటిలో తాము భావించిన అభూతకల్పనలను గుర్తు చేసుకోవడం విశేషం! అలా సైన్స్ ఫిక్షన్ లవర్స్ గుర్తు చేసుకుంటున్న చిత్రాలలో జీన్ ఎడిటింగ్ ఆధారంగా రూపొందిన 'జురాసిక్ పార్క్' (1993) ముందు వరుసలో నుంచుంది. ఇదే తీరున జెనెటికల్ ఇంజనీరింగ్ తో జంతువులను రూపొందించిన చిత్రాలలో "ర్యాంపేజ్ (2018), బ్లేడ్ రన్నర్ 2049 (2017), ఏలియెన్ - రోములస్ (2024), ద సబ్ స్టాన్స్ (2024)" వంటి చిత్రాలు ఉన్నాయి. వీటిలో జీన్ ఎడిటింగ్ ద్వారా క్రియేట్ చేసిన జంతువులు, వింత మానవుల వంటి పాత్రలు చోటు చేసుకున్నాయి. కాగా, కేవలం జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన మానవుల గాథలతోనూ కొన్ని సినిమాలు వెలుగు చూశాయి. అలాంటి వాటిలో "గట్టాకా (1997), ద ఫిఫ్త్ ఎలెమెంట్ (1997), ద సిక్స్త్ డే (2000), ఎలిజీయమ్ (2013), క్రైమ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ (2022)" వంటి సినిమాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓ వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు జెనిటికల్ ఇంజనీరింగ్ రెండూ పరుగులు తీస్తూ పోతున్నాయి. వీటి నేపథ్యంలో ఇప్పటికే అనేక చిత్రాలు రూపొంది జనాన్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సఫలీకృతమైన ప్రయోగాల రీత్యా మరికొన్ని సినిమాలు జీన్ ఎడిటింగ్ నేపథ్యంలో రూపొందవచ్చు. సినిమాటిక్ క్రియేటివిటీ - సైంటిఫిక్ ఎక్స్ పెరిమెంట్స్ కు స్ఫూర్తిగా నిలవడం అన్నది సినీజనానికి మహదానందం కలిగిస్తోంది.