Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే 

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:03 PM

సంక్రాంతి పండుగ విక్టరీ వెంకటేశ్‌కు బాగా కలిసొచ్చిన సీజన్‌. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. అయితే కొన్నాళ్లగా చూస్తే ఎఫ్‌–2 సిరీస్‌ మినహా మరే చిత్రం  సంక్రాంతి బరిలో విడుదలై గట్టెక్కింది లేదు.

సినిమా రివ్యూ: సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunna)
విడుదల తేది: 14–01–20245
నటీనటులు: వెంకటేశ్‌, (Venkatesh) ఐశ్వర్య రాజేష్ (Aishwara rajesh) మీనాక్షి చౌదరి, ఉపేంద్ర లిమాయే, సాయికుమార్‌, సర్వదమన్‌ డి బెనర్జీ, నరేష్‌, వీటీవీ గణేష్‌, అవసరాల శ్రీనివాస్‌, పృధ్వీ, మురళీధర్‌ గౌడ్‌, రజిత, వడ్లమాని శ్రీనివాస్‌ తదితరులు.


సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి,
ఎడిటింగ్‌: తమ్మిరాజు
సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
నిర్మాణ సంస్థ: శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌
నిర్మాతలు: దిల్‌ రాజు – శిరీష్‌
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

సంక్రాంతి పండుగ విక్టరీ వెంకటేశ్‌కు బాగా కలిసొచ్చిన సీజన్‌. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. అయితే కొన్నాళ్లగా చూస్తే ఎఫ్‌–2 సిరీస్‌ మినహా మరే చిత్రం  సంక్రాంతి బరిలో విడుదలై గట్టెక్కింది లేదు. తాజాగా వెంకీ నుంచి వచ్చిన చిత్రం ుసంక్రాంతికి వస్తున్నాం’. ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాల తర్వాత అనిల్‌ రావిపూడి, వెంకీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. పాటలు, ట్రైలర్‌, నేటివిటీ సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రమోషన్స్‌ కూడా వినూత్నంగా చేసి ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించారు. పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు పండగ సందడిని రెట్టింపు చేసిందా? విక్టరీ ఖాతాలో హిట్‌ పడిందా? అన్నది తెలియాలంటే రివ్యూపై ఓ లుక్‌ వేయాల్సిందే!



కథ:

అమెరికాలో ఓ బడా కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న వ్యక్తి సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్‌). అతనితో సొంత రాష్ట్రంలో నాలుగైదు మంచి కంపెనీలు పెట్టించి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ (నరేశ్‌ వీకే) తనని హైదరాబాద్‌కు తీసుకువస్తాడు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పగిస్తారు. అయితే సత్య నగరానికి రాగనే పాండే గ్యాంగ్‌ అతన్ని అపహరిస్తారు. ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వానికి డ్యామేజ్‌ అవుతుందని ఓ రహస్య ఆపరేషన్‌ చేపడతారు. అతన్ని కాపాడేందుకు సీఎం సపోర్ట్‌తో సస్పెన్షన్‌లో ఉన్న వై.డి.రాజు అలియాస్‌ చిన్నరాజు (వెంకటేష్‌)ను రంగంలోకి దించడానికి మీనాక్షి (మీనాక్షి చౌదరి) రాజమండ్రి వస్తుంది. చక్కని భార్య భాగ్యం(ఐశ్వర్యారాజేశ్‌), నలుగురు పిల్లలతో సరదాగా జీవితాన్ని సాగిస్తున్న చిన్న రాజు సకుటుంబ సమేతంగా ఆకెళ్లను కాపాడటానికి సిద్ధమవుతాడు. ఆ క్రమంలో ఎదుర్కొన్న సమస్యలేమిటి? మీనాక్షికి, వై.డి.రాజుకు ఉన్న సంబఽంధం ఏంటి? ఈ మిషన్‌ను ఎలా అధిగమించారు అన్నది కథ  
 
విశ్లేషణ:
క్రైమ్‌ కథతో ముడిపడిన కుటుంబ కథా చిత్రమిది. ఓ పెద్ద వ్యాపారవేత్త కిడ్నాప్‌, బడా గ్యాంగ్‌స్టర్‌, కిడ్నాప్‌ను ఛేధించడం, చక్కని కుటుంబం, భార్య, పిల్లలు మాజీ లవర్‌, బ్రేకప్‌ చుట్టూ సాగే యాదగిరి దామోదర రాజు కథ ఇది. అనిల్‌ రావిపూడి కథల్లో కొత్తదనం లేకున్నా ఏదో మ్యాజిక్‌ చేస్తాడని ప్రేక్షకుల నమ్మకం. ఇక్కడా అలాంటి ప్రయత్నమే చేశారు. అతని బలం ఎంటర్‌టైన్‌మెంట్‌. కథ ఏంటనేది పాటలు, టీజర్‌, ట్రైలర్‌లో పూర్తిగా చెప్పేసినా, హీరో, ఇద్దరు హీరోయిన్ల మధ్య ఎలాంటి జర్నీ నడిచిందన్నది ఇఇందులో ఆసక్తికర అంశం. సత్యా ఆకెళ్ల కిడ్నాప్‌తో మొదలుపెట్టిన డ్రామా రెస్య్కూ ఆపరేషన్‌తో కథలోకి తీసుకెళ్లింది. కథ రాజమండ్రికి షిప్ట్‌కాగానే మరింత వేగంగా నడుస్తుంది. ఆద్యంతం వినోదం పంచుతుంది. భాగ్యం, తన పిల్లలు, వై.డి రాజుగా వెంకీ అల్లరి, పిల్లనిచ్చిన మావతో ఎదురయ్యే సమస్యలు ఇలా పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. గోదారి గట్టు పాట తర్వాత ఇంట్లో జరిగే పంచాయతీ, హాయ్‌ అనే మెసేజ్‌ వల్ల జరిగే రాద్దాంతం, అక్కడ ఓటీటీ సిరీస్‌లకు బాగా అలవాటు పడిన బుల్లి రాజు పాత్ర విపరీతంగా నవ్విస్తాయి. రాజు–మీనుల పాత ప్రేమకథ పైకి రాగానే ఇంట్లో వారి స్పందన, ఆపరేషన్‌కు భాగ్యం అంగీకరించడం, వెంకీ బరితోకి దిగడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇదంతా సెకెండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది. సెకెండాఫ్‌ కూడా కిడ్నాప్‌ డ్రామాతో మొదలవుతుంది. జైల్లో ఉన్న పాండే గ్యాంగ్‌ పాపా భాయ్‌ను కిడ్నాప్‌ చేయడానికి వేసే ఎత్తుగడలు, దాని కోసం ఆస్పత్రిలో వేసే నాటకపు కిడ్నాప్‌ భార్య, మాజీ ప్రేయసీ చేసే హడావిడి సోసోగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్‌ ఉండదు. అక్కడి నుంచి క్లైమాక్స్‌ వరకూ అంతా రొటీన్‌ రొట్టకొట్టుడే. ఏ సన్నివేశం గుర్తుంచుకునేలా లేదు. ఫస్టాఫ్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ సెకెండాఫ్‌లో బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. అయితే రాజు, భాగ్యం, మీనుల మధ్య నడిచే టామ్‌ అండ్‌ జెర్రీ సన్నివేశాలు మాత్రం బాగానే నవ్విస్తాయి. క్లైమాక్స్‌కు ముందు మగాళ్లకు వెంకీ చెప్పే సూత్రాలు సోసోగా  ఉన్నాయి. ఆస్పత్రి నుంచి పాపా బాయ్‌ను బయటకు తీసుకొచ్చింది మొదలు.. ఆ ట్రాక్‌ అంతా బోర్‌గా సాగింది.  తనకి చదువు చెప్పి గురువు ఎపిసోడ్‌, దాని నుంచి వచ్చే మెసేజ్‌ బావుంది కానీ అందులో లోతు లేదు. వేల్యూ ఉన్న ఎపిసోడ్‌ను లైట్‌ తీసుకున్నాడు. ఆ సన్నివేశంలో భావోద్వేగం పండలేదు. కామెడీ, కమర్షియల్‌ అంశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అనిల్‌ ముందుకెళ్లాడు. ఆ తరుణంలో లాజిక్‌ల మీద దృష్టి పెట్టలేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
వెంకటేశ్‌ ఎన్నో బలమైన పోలీస్‌ పాత్రలు చేశారు. ఇందులో మాజీ పోలీస్‌ అధికారిగా కనిపించారు. ఈ తరహా పాత్రలు వెంకీకి కొత్తేమీ కాదు. దర్శకుడు రాసిన పాత్రను తనదైన శైలిలో చేసుకుంటూ వెళ్లిపోయాడు. బాధ్యతగల భర్తగా, మాజీ ప్రియుడిగా బ్యాలెన్స్‌డ్‌గా నటించారు. వెంకీ. మీనుతో ప్రేమ కథ బయటపడ్డాక ఇద్దరితో వేగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. భాగ్యం పాత్ర ఐశర్యా రాజేశ్‌కు బంపర్‌ ఆఫర్‌లా దొరికింది. ఈ మఽధ్య నటించిన అన్ని చిత్రాల్లో డీ గ్లామర్‌గా కనిపించిన మీనాక్షి చౌదరి ఇందులో గ్లామర్‌గా మెప్పించింది. నటనలోనూ ఇద్దరూ హీరోయిన్లు పోటీపడ్డారు. వెంకీ తనయుడుగా నటించిన బాల నటుడు రేవంత్‌ పాత్ర సినిమాకు హైలైట్‌. అతను తెరపై కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుడి పెదాలపై నవ్వు కనిపించింది. రచయితగా అనిల్‌ రావిపూడి సక్సెస్‌ అనిపించుకుంది కూడా బుల్లి రాజు పాత్రే. ఆ పాత్ర మాత్రం థియేటర్‌లో విపరీతంగా పేలింది. అందరికీ ఆ క్యారెక్టర్‌ నచ్చుతుంది. వీటీవీ గణేష్‌, నరేష్‌ ట్రాక్‌ అక్కడక్కడా నవ్వించింది. శ్రీని అవసరాల, సాయికుమార్‌; మురళీధర్‌ గౌడ్‌ తదితరులు పరిధి మేరకు నటించారు. ప్రస్తుతం భీమ్స్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సినిమాకు చక్కని పాటలు, సంగీతం అందించారు. పాటలన్నీ వినడానికి చాలా బావున్నాయి. ప్రేక్షకులు ఆదరణ పొందాయి కూడా. అయితే విజువల్‌గా మాత్రం వర్కవుట్‌ కాలేదు. నేపథ్య సంగీత బావుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్‌ డీసెంట్‌గా ఉంది. టెక్నికల్‌గా చూస్తే సినిమా కాస్త వీక్‌. సెకెండాఫ్‌లో కాస్త కత్తెర వేసుంటే బావుంది. అనిల్‌ రావిపూడి సినిమాలు కామెడీ బేస్‌ మీద ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఇది పూర్తిగా అనిల్‌ మార్క్‌ ఎంటర్‌టైనర్‌. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌, వేగం సెకెండాఫ్‌లో కూడా ఉంటే బావుండేది. అదే  మిస్‌ అవడం వల్ల సెకెండాఫ్‌ గాడి తప్పింది. అయితే ఈ పండగ సీజన్‌లో ఆ మాత్రం కామెడీ ఉంటే చాలు. ప్రేక్షకులు ఎగబడి సినిమా చూడటానికి. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం బ్లాక్‌బస్టర్‌ సంక్రాంతి పాటను క్లైమాక్స్‌లో పెట్టారు. అయితే అంతా పెద్ద హిట్‌ టాక్‌ కష్టం కానీ.. లాజిక్కులు పక్కన పెట్టి సినిమా చూస్తే కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం. పైగా సంక్రాంతి బరిలో విడుదలైన ఇతర చిత్రాల్లో ఇదే వినోదాత్మక చిత్రం కావడం సినిమాకు ప్లస్‌. లేదంటే యావరేజ్‌ సినిమా కేటగిరిలో ఉండేది.

ట్యాగ్‌లైన్‌: భాగ్యం.. బుల్లిరాజు.. బంపర్‌ ఆఫర్‌.. 

Updated Date - Jan 14 , 2025 | 03:31 PM