Nidurinchu Jahapana Review: మాస్టర్ ఆనంద్ వర్థన్, హీరోగా సక్సెస్ ఇచ్చాడా
ABN, Publish Date - Feb 14 , 2025 | 07:24 AM
''ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే'' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాస్టర్ ఆనంద్ వర్థన్ ఇప్పుడు 'నిదురించు జహాపనా'తో హీరోగా మారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. మరి అతనిని అదృష్టం వరించిందో లేదో చూద్దాం.
సినిమా రివ్యూ : నిదురించు జహాపన (Nidurinchu Jahapana Review)
విడుదల తేదీ: 14.02.2025
నటీనటులు: ఆనంద్ వర్ధన్, నవమి గయాక్, రోష్ని సాహోతా, రామరాజు, పోసాని కృష్ణ మురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు, వీరేన్ తంబిదొరై, జబర్దస్త్ శాంతి కుమార్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్
డీవోపీ: ఆనంద రెడ్డి నడకట్ల
ఎడిటర్స్ : వెంకట్, నానిబాబు కారుమంచి
ఆర్ట్ డైరెక్టర్: టాగోర్
యాక్షన్ : నందు
నిర్మాత : సామ్
రచన, దర్శకత్వం: ప్రసన్న కుమార్ దేవరపల్లి
బాల నటులుగా రాణించిన చాలా మంది పెద్దయ్యాక హీరోలుగా సక్సెస్ కాక తిప్పలుపడుతుంటారు. పాలుగారే బుగ్గలున్న సమయంలో వారిని తెగ ఇష్టపడిన ప్రేక్షకులు... హీరోగా మారిన తర్వాత ఎందుకో వారిని పెద్దంతగా ఆదరించరు. ఆ జాబితాలో హీరోగా మారిన చాలామంది బాల నటులు ఉన్నారు. ''ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే'' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాస్టర్ ఆనంద్ వర్థన్ ఇప్పుడు 'నిదురించు జహాపనా'తో హీరోగా మారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. మరి అతనిని అదృష్టం వరించిందో లేదో చూద్దాం.
జాలరి పల్లెలో ఉండే వీరూ (ఆనంద్ వర్థన్) తండ్రి (కేరాఫ్ కంచరపాలెం రాజు) కి రోజుల తరబడి నిద్రపోయే అలవాటు ఉంటుంది. వేటకు వెళ్ళినప్పుడు కూడా నిద్రను ఆపుకోలేక పడవలోనే పడుకుండి పోతాడు. అతనికి ఉన్న ఈ జబ్బు తన కొడుకు వీరుకు ఎక్కడ వస్తుందో అని అతని తల్లి జయమ్మ (కల్పలత) భయపడుతుంటుంది. అయితే వీరు తండ్రి మరణానంతరం వాళ్ళు ఓడరేవు నుండి మోటుపల్లికి చేరతారు. అక్కడ వీరూ కు ఎన్.ఆర్.ఐ. మధుర (రోషిణీ సాహోతా) తారస పడుతుంది. ఆమెతో వీరూ ప్రేమలో పడతాడు. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటూ ఉండగా, తండ్రికి వచ్చిన జబ్బే వీరూ కు వస్తుంది. అతను కూడా రోజుల తరబడి నిద్రపోవడం జరుగుతుంది. అలా ఒకసారి నిద్రపోయినప్పుడు అతనికి కలలో సితార (నవమి గయాక్) తారసపడుతుంది. నిద్ర నుండి బయటకు వచ్చిన వీరూ... ఈ విషయాన్ని మధురకు చెబుతాడు. సైకియాట్రిస్ట్ నయన్ (వీరేన్ తంబిదొరై) వీరూ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఈ కల వెనుక కారణాలను అన్వేషిస్తాడు. ఇదే సమయంలో ఆ గ్రామంలో వరుసగా యువకులు హత్యకు గురి అవుతుంటారు? వీరూ కలలో కనిపించిన సితారకు ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అసలు వీరు కలలో కనిపించే సితార ఎవరు? తండ్రికి వచ్చిన నిద్ర జబ్బు కారణంగా వీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఈ చిక్కుముడుల నుండి అతను, మధుర ఎలా బయటపడ్డారు? అనేదే కథ.
విశ్లేషణ:
సహజంగా కొత్త హీరోలు తమ తొలి చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా జనం ముందుకు తీసుకురావాలని చూస్తారు. కానీ బాలనటుడిగా ఎంతో కాలంగా చిత్రసీమలో ఉన్న ఆనంద్ వర్థన్ మాత్రం అందుకు భిన్నంగా కంటెంట్ బేస్డ్ కథను ఎంపిక చేసుకున్నాడు. మనం నిద్రలేమి అనే వ్యాధిని గురించి విన్నాం. కానీ రోజులు, నెలల తరబడి నిద్రపోయే అలవాటు ఉన్నవారు అరుదు. ఇలాంటి వారు సైతం కొందరు ఉన్నారంటూ దర్శకుడు ప్రసన్న కుమార్ దేవరపల్లి పరిశోధన చేశాడు. ఆ జబ్బును హీరోకు పెట్టేశాడు. అంతేకాకుండా... ఆ జబ్బే అతని లవ్ ఫెయిల్యూర్ కు కారణంగా చూపించాడు. ఈ వింత జబ్బు, దాని పర్యవసానాలు అనేవి నమ్మశక్యంగా ఉండవు. అయితే ఆ పాయింట్ ను బేస్ చేసుకునే డైరెక్టర్ కథను అల్లాడు. అదే దారిలో చివరి వరకూ నడిచాడు. ఈ నడకలో పలు చోట్ల తడబడ్డాడు. సినిమా స్టార్టింగ్ నుండి ప్రీ క్లయిమాక్స్ వరకూ మూస ధోరణిలో సాగిపోయింది. దాంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. ఇదేదో హారర్ డ్రామా అని అనుకుంటున్న ప్రేక్షకుల ఊహకు అందకుండా లాజికల్ గా దర్శకుడు మూవీకి శుభం కార్డ్ వేశాడు. దానితో పాటుగా ప్రతి చిక్కుముడినీ క్లయిమాక్స్ లో చక్కగా విడదీశాడు. ఆనంద్ వర్థన్ కు బాలనటుడిగా పేరున్నా... హీరోగా మొదటి సినిమా కాబట్టి చాలా బాలారిష్టాలను దాటుకుని ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. మేకింగ్ విషయంలోనూ దర్శక నిర్మాతలు రాజీ పడినట్టు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చూస్తే అర్థమైపోతోంది. చెప్పాలనుకున్న కథను దర్శకుడు చెప్పాడు తప్పితే... దానికి తగ్గ గ్రాండ్ విజువల్ సపోర్ట్ లభించలేదు. ఉన్నంతలో ఆనందరెడ్డి నడకట్ల సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని చేకూర్చాయి. సినిమా ప్రారంభమై చాలా కాలం కావడంతో ఏదో పాత మూవీని ఇప్పుడు చూస్తున్న భావన కలుగుతుంది. (Nidurinchu Jahapana Review)
నటీనటుల విషయానికి వస్తే... ఆనంద్ వర్థన్ రెండు భిన్నమైన గెటప్స్ లో తెర మీద కనిపించాడు. మొదటిసారి కనిపించినప్పుడు లవర్ బోయ్ గా బాగున్నాడు. కానీ ఆ తర్వాత బవిరి గడ్డం ఉండటంతో చూడటానికి ఇబ్బందిగా ఉంది. బట్.. కథనుగుణంగా అలా కనిపించక తప్పదు. సితారగా నటించిన నవమి గయాక్ కు ఇదే మొదటి తెలుగు సినిమా. ఈ మూవీ విడుదల లేట్ కావడంతో 'నాంది' చిత్రం ముందుగా జనం ముందుకు వచ్చింది. మధురగా రోషిణి సాహోతా నటించింది. కొత్త అమ్మాయిలిద్దరూ చూడటానికి బాగానే ఉన్నారు. హీరో తల్లిగా కల్పలత, తండ్రిగా 'కేరాఫ్ కంచరపాలెం' రాజు యాక్ట్ చేశారు. ఇతర కీలక పాత్రలను రామరాజు, పోసాని, వీరేన్ తంబిదొరై, జబర్దస్త్ శాంతికుమార్ తదితరులు చేశారు. ఓ చిన్న పాయింట్ తీసుకుని, ప్రేక్షకులను మెప్పించాలని దర్శకుడు ప్రసన్న కుమార్ దేవరపల్లి ప్రయత్నించాడు కానీ అది విఫలప్రయత్నమే అయ్యింది. ఓటీటీలో అయినా ఈ కంటెంట్ బేస్డ్ మూవీకి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.
ట్యాగ్ లైన్: నిద్రపుచ్చే జహాపనా!