Madhuram movie : మధురం సినిమా రివ్యూ
ABN, Publish Date - Apr 18 , 2025 | 02:53 PM
ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన 'మధురం' చిత్రం శుక్రవారం విడుదలైంది. 1990 నాటి ప్రేమకథను 'మధురం'గా చూపామంటున్నారు మేకర్స్.
కాలేజ్ డేస్ లవ్ స్టోరీస్ పోయి... ఇప్పుడు స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ వచ్చేశాయి! ఆ వయసులో పుట్టేది ప్రేమ కాదు ఇన్ ఫాచ్యుయేషన్ అని అంటారు సైకాలజిస్టులు. అయితే అలాంటి ఇన్ ఫాచ్యుయేషన్ జీవితకాలం పాటు ఉంటే దాన్ని ప్రేమ అనుకోవచ్చా!? టీనేజ్ లవ్ స్టోరీస్ మనకు కొత్త కాదు. కానీ టీనేజ్ లోకి ఎంటర్ కాని వారి ప్రేమకథలను సైతం చూడాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చేసింది. అయితే ఏప్రిల్ 18న విడుదలైన 'మధురం' మూవీ టీనేజ్ లోకి ఎంటర్ అయిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమకథ.
కథ ఏమిటంటే...
ఈ టెండర్ లవ్ స్టోరీ కథ గురించి చెప్పుకోవాలంటే సింపుల్. ఆత్రేయపురంలోని ప్రభుత్వ పాఠశాలలో మధు (వైష్ణవి సింగ్) పదో తరగతి చదువుతుంటుంది. మధును క్లాస్ మేట్ రాజు (రాజేశ్ చికిలే) ప్రేమిస్తుంటాడు. కానీ లవ్ ప్రపోజ్ చేయడానికి ధైర్యం సరిపోదు. దాంతో తొమ్మిదో తరగతిలో ఉన్న ఫ్రెండ్ రామ్ (ఉదయ్ రాజ్)కు తన ప్రేమ గురించి మధుకు చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. తీరా చూస్తే... మధు అప్పటికే తాను రామ్ ను ప్రేమిస్తున్నానని స్నేహితురాలికి చెబుతుంది. రాజు ప్రేమను పక్కన పెట్టేసి రామ్, మధు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. పదో తరగతి పూర్తి కాగానే మధు చదువుకోవడానికి సిటీకి వెళ్ళిపోతుంది. ఆమెను కలవడానికి పట్నంలోని కాలేజ్ కు వెళ్ళిన రామ్... మధు వేరొకరితో సన్నిహితంగా మెలగడం చూసి అపార్థం చేసుకుంటాడు. దాంతో వీరిద్దరి మధ్య ఊహించని అగాధం ఏర్పడుతుంది. ఒకరంటే ఒకరికి మనసులో ప్రేమ ఉన్నా... ఇగోని జయించలేని కారణంగా... దూరమైపోతారు. వారిలోని మధురమైన ప్రేమ కారణంగా వీరు చివరకు ఎలా కలిశారన్నదే ముగింపు.
ఎలా ఉందంటే...
ప్రేమికుల మధ్య అపార్థాలు చోటు చేసుకోవడం, వాటిని కొన్ని రోజుల తర్వాత రెక్టిఫై చేసుకుని వారు ఒక్కటి కావడమనేది కామన్. కథ ముందుకు తీసుకెళ్ళడానికి ఏవేవో కారణాలతో వారిని విడదీయాల్సి వస్తుంది. అయితే దానికి జన్యూన్ రీజన్ ఉండాలి. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ కనిపించదు. హీరోయిన్ మీద హీరోకు ఉండే విపరీతమైన ప్రేమే దానికి కారణం అన్నట్టుగా దర్శకుడు చూపించాడు. అలానే ఒకానొక సమయంలో హీరోయిన్ హీరోని దూరం పెట్టడానికి చూపించే రీజన్ కూడా ఏమంత కొత్తది కాదు. ఈ కథ జరిగే కాలం 90ల నాటిదే అయినా... ఇవాళ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ రీజన్స్ తో ఏ మాత్రం సంతృప్తి చెందడు. దాంతో ఎలాంటి ఉత్సుకత కలిగించని ప్రేమకథగా 'మధురం' మిగిలిపోయింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు...
దశాబ్దంపైగా సినిమా రంగంలోని వివిధ శాఖల్లో పనిచేయడంతో పాటు కొన్ని సినిమాల్లో ఉదయ్ రాజ్ చిన్న చిన్న పాత్రలూ చేశాడు. ఇందులో తొలిసారి హీరోగా నటించే అవకాశం లభించింది. రాజేశ్ చికిలే దర్శకత్వంలో 'మధురం'ను యం. బంగార్రాజు నిర్మించారు. వైష్ణవీ సింగ్ హీరోయిన్. వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే... ఎవరికీ నటనలో పెద్దంత అనుభవం లేదు. ఉదయ్ రాజ్ కు ఇంత పెద్ద పాత్ర చేయడం ఇదే మొదటిసారి. దర్శకుడు రాజేశ్ చికిలే ఇందులో మరో కీలక పాత్ర చేశాడు. హీరో ఉదయ్, హీరోయిన్ వైష్ణవీ సింగ్ మాగ్జిమమ్ కష్టపడి నటించారు. అయితే... వాళ్ళను స్కూల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గా ఊహించుకోవడం చాలా కష్టం. స్కూల్ హెడ్ మాస్టర్ గా 'బస్ స్టాప్' ఫేమ్ కోటేశ్వరరావు, హీరో తండ్రిగా కిట్టయ్య, స్నేహితుడిగా అప్పు నటించారు. ఇతర ప్రధాన పాత్రలను దివ్యశ్రీ, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష తదితరులు పోషించారు. మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ, వెంకి వీణ ట్యూన్స్ కాస్తంత బాగుండటంతో పాటలు వినసొంపుగానూ, చూడదగ్గవిగానూ ఉన్నాయి. పల్లెటూరి వాతావారణాన్ని మనోహర్ చక్కగా కాప్చర్ చేశారు.
'ఎ మెమొరబుల్ లవ్' అనే ట్యాగ్ లైన్ మూవీకి పెట్టారు కానీ ఇదేమీ మెమొరబుల్ మూవీ కాదు! కాకపోతే... కమర్షియాలిటీ వంకతో ఎలాంటి వల్గారిటీకి తావు ఇవ్వకుండా వీలైనంత వరకూ క్లీన్ ఎంటర్ టైనర్ ను అందించే ప్రయత్నం చేశారు. పరిమితమైన బడ్జెట్ లో తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఓ చిన్న బృందం చేసిన ప్రయత్నంగానే 'మధురం'ను చూడాలి. అంతకు మించి ఈ సినిమా నుండి ఏమీ ఆశించలేం.
ట్యాగ్ లైన్: కొరవడిన కొత్తదనం
రేటింగ్: 2/5
Also Read: Kalyan Ram: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ
Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి