Officer on Duty Review: కుంచకో బోబన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Mar 14 , 2025 | 06:02 PM
ప్రస్తుతం మలయాళ చిత్రాల హవా బాగా నడుస్తోంది. థియేట్రికల్‌గానే కాదు.. ఓటీటీల్లోనూ పైచేయిలో ఉందీ మల్లూవుడ్. విలక్షణ నటుడు కుంచకో బోబన్ ఏ కథ ఎంపిక చేసుకున్నా అందులో ఏదో విషయం ఉంటుందనే ప్రేక్షకులు, అభిమానులు భావిస్తారు.
సినిమా రివ్యూ: ఆఫీసర్ ఆన్ డ్యూటీ (Officer on Duty Review)
నటీనటులు: కుంచకో బోబన్((kunchako boban), ప్రియమణి, జగదీష్, అజ్మల్ అమీర్, ఆడుకాలమ్ నరేన్, రాహుల్ హమీద్, విశాక్ నాయర్, విష్ణు జి. వారియర్, లేయా మామెన్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: రాబీ వర్గీసీ రాజ్
సంగీతం: జేక్స్ బిజోయ్ (jakes bijoy)
నిర్మాత: మార్టిన్ ప్రకట్ - రెంజిత్ నాయర్ - సిబీ చవర
దర్శకత్వం: జీతూ అష్రఫ్ (Jithu Ashraf)
ప్రస్తుతం మలయాళ చిత్రాల హవా బాగా నడుస్తోంది. థియేట్రికల్‌గానే కాదు.. ఓటీటీల్లోనూ పైచేయిలో ఉందీ మల్లూవుడ్. విలక్షణ నటుడు కుంచకో బోబన్ ఏ కథ ఎంపిక చేసుకున్నా అందులో ఏదో విషయం ఉంటుందనే ప్రేక్షకులు, అభిమానులు భావిస్తారు. అతని కథల ఎంపిక అలా ఉంటుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. ప్రియమణి కథానాయిక. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ఫిబ్రవరి 20న విడుదలై విమర్శలకు ప్రశంసలు అందుకుంది. మార్చి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ: (Officer on Duty Review)
హరి శంకర్ (కుంచకో బోబన్) సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తారు. కొంతకాలం సస్పెన్షన్ తర్వాత డ్యూటీలో చేరిన రోజు గోల్డ్ చైన్ కేసును ఛేదించాల్సి వస్తుంది. ఆ కేసు విచారణలో భాగంగా ఓ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ కోసం స్ట్టేషన్‌కు రమ్మని పిలిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్యకు, బెంగళూరులోని ఓ పోలీస్ ఆత్మహత్యకు, కేసుకు సంబంధం ఉందనే అనుమానం వ్యక్తమవుతుంది హరికి. తన కుమార్తె మరణానికి హరి శంకర్ కారణం అని అమ్మాయి తండ్రి చంద్రబాబు(జగదీశ్)ఆరోపిస్తాడు. అసలు ఇందులో నిజం ఎంత? విచారణలో హరి శంకర్ ఏం చేశాడు? బెంగళూరు వెళ్లిన తర్వాత అతనిపై హత్యాయత్నం చేసిన ముఠా ఎవరు? వాళ్లకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి? హరి శంకర్ భార్య గీత (ప్రియమణి) అతన్ని విడాకులు ఎందుకు అడిగింది. ఈ కథలో డ్రగ్స్, రేప్ కేసులు సంగతి ఏంటి? అనేది కథ.
విశ్లేషణ: (kunchako boban)
కరోనా తర్వాత నుంచి మలయాళ చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్ పెరిగింది. అందులోనూ మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్‌కు ఇక్కడ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. తాకట్టు పెట్టడానికి వెళ్లిన తన గోల్డ్ చైన్ నకిలీదని, ఒరిజినల్ చైన్ కొట్టేసి తన చేతిలో రోల్డ్ గోల్డ్ పెట్టారని ఓ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ దగ్గర కథ మొదలవుతుంది. బంగారం గొలుసు దగ్గర మొదలైన కథ, ప్రతీకారం తీర్చుకోవాలని డ్రగ్స్‌కు బానిసలైన కొంతమంది గ్యాంగ్ అమ్మాయిలను ట్రాప్ చేసి, వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసిన ఘటన దగ్గర ఆగుతుంది. రచయితగా షాహి కబీర్ - దర్శకుడు జీతూ అష్రఫ్ కథను నడిపించిన తీరు బావుంది. కథ ప్రారంభం ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశారు దర్శకుడు జీతూ అష్రఫ్. కథను నడిపిన తీరు ఓ మూడ్‌లోకి తీసుకెళ్తుంది. ఇందులో హీరోకి సమస్య ఉందని చెబుతూ వచ్చి... ఆ సమస్య ఏమిటో రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అతని సమస్యకు, కేసుకు భలే చిక్కుముడి పెట్టారు. కథ నడుస్తున్న కొద్దీ ముందు ఏం జరగబోతోందా అని ఎగ్జైట్‌మెంట్ కలుగుతుంది. సినిమాలో ఎంగేజ్ చేేస కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. స్ర్కీన్‌ప్లే బావుంది. పతాక సన్నివేశాల్లో మెయిన్ ట్విస్ట్ బయటపెట్టాక కథలో ఉన్న తీవ్రత తగ్గిపోతుంది. అప్పటి దాకా ఉన్న హై మోమెంట్స్ ఒక్కసారిగా డల్ అయిపోతుంది. అక్కడి నుంచి కొన్ని సీన్లు రొటీన్‌గా ఉంటాయి. తండ్రీ, కూతుళ్ల అనుబంఽధాన్ని ఇంకాస్త బాగా చెప్పి ఉంటే బావుండేది. దానిపై దర్శకుడు ఎందుకో దృష్టి పెట్టలేదనిపిస్తుంది. దాని వల్లే కథ డైవర్ట్ అవడానికి రీజన్ అనుకోవచ్చు. తెలుగు డబ్బింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది. పోరాట సన్నివేశాలు చూస్తునప్పుడు గతంలో చూసిన కొన్ని ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలు గుర్తుకొస్తాయి. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల వ్యవహారాలు ఇలాగే ఉంటాయేమో అనిపించేలా సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక సినిమాలో పోలీస్ డ్రామాకు చాలా పోలికలు కనిపిస్తాయి.
నటీనటుల విషయానికొస్తే.. సినిమాల సక్సెస్‌తో పని లేకుండా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. కుంచకో బోబన్. అక్కడక్కడా ఆయన నటించిన చిత్రాలు ఫెయిల్ అయివుండొచ్చు. కానీ నటుడిగా ఆయన ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఈ సినిమాలో కూడా అంతే. పోలీస్ అధికారిగా అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేషన్ కంటే ఎమోషన్స్ చూపించే సీన్స్ చాలా బాగా చేశారు. అతనికి భార్యగా ప్రియమణి పర్వాలేదు అనిపించింది. జగదీష్ పాత్ర బావుంది. డ్రగ్ పెడలర్స్‌గా నటించిన ఐదుగురు కుర్రాళ్లను చూస్తే ఇలా ఉంటారా అనిపిస్తుంది. వారిని చూస్తేనే వెగటు పుట్టించేలా పాత్రలా ఇమిడిపోయారు. మిగతా ఆర్టిస్ట్‌లు తెలుగువారికి అంతగా పరిచయం లేనివారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. కెమెరామెన్ రాబీ వర్గీస్ రాజ్ సినిమకు మరో పిల్లర్ అని చెప్పొచ్చు. కుంచకు కనిపించే హీరో అయితే కనిపించని హీరో సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్. అద్భుతమైన సంగీతం అందించాడు, క్రైమ్ థ్రిల్లర్‌లో ఇంటెన్స్ క్రియేట్ చేయడంతో నేపథ్య సంగీతం కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాల్లో టెన్షన్ క్రియేట్ కావడానికి జేక్స్ బీజాయ్ ఆర్‌ఆర్ కారణం. అనుక్షణం ఉత్కంఠ కలిగించాడు. ఎడిటింగ్ కూడా బావుంది. నిర్మాణ విలువలకు పేరు పెట్టక్కర్లేదు. కానీ తెలుగు అనువాదం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. టైటిల్ కార్డ్స్ నుంచి పేర్లు పలకడం వరకూ చాలా తప్పులు దొర్లాయి. చిన్నచిన్న పొరపాట్లను పక్కనపెడితే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చక్కని సస్పెన్స్ థ్రిల్లర్.
ట్యాగ్‌లైన్: ఎంగేజింగ్ ఆఫీసర్ ఛేజ్