Dil Ruba Review: కిరణ్‌ అబ్బవరం క హిట్‌ కొనసాగించాడా

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:46 AM

ఏ బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చారు కిరణ్‌ అబ్బవరం. తొలి సినిమా నుంచి కథల ఎంపికలో వైవిధ్యంగా ఆలోచిస్తారు. ‘క’ సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టారు. అంతకుముందు కూడా మంచి విజయాలు ఉన్నప్పటికీ 'క’ తో ఆయన స్థాయి పెరిగింది. దాంతో అతను చేసే సినిమాలపై అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమా రివ్యూ: దిల్‌ రూబా (Dil ruba Movie Review)
విడుదల తేది: 14-3-2025
నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, రుక్సర్‌ థిల్లాన్‌(Rukshar Dhillon), నజియా, సత్య, జాన్‌ విజయ్‌, గెటప్‌ శ్రీను, నరైన్‌, క్రాంతి తదితరులు.
కెమెరా: డేనియల్‌ విశ్వాస్‌
సంగీతం సామ్‌ సిఎస్‌
ఎడిటింగ్‌: ప్రవీన్‌ కె.ఎల్‌
నిర్మాతలు: రవి, జోజో జోస్‌, రాకేశ్‌ రెడ్డి
దర్శకత్వం: విశ్వకరుణ్‌ (Vishwa karun)

ఏ బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చారు కిరణ్‌ అబ్బవరం. తొలి సినిమా నుంచి కథల ఎంపికలో వైవిధ్యంగా ఆలోచిస్తారు. ‘క’ సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టారు. అంతకుముందు కూడా మంచి విజయాలు ఉన్నప్పటికీ 'క’ తో ఆయన స్థాయి పెరిగింది. అతను చేసే సినిమాలపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన నుంచి ‘దిల్‌ రూబా’ (Dil Ruba) సినిమా వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచారాలు ఆర్భాటంగా చేయడంతో ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? క సక్సెస్‌ను కిరణ్‌ కొనసాగించారా? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే!

కథ:
సిద్దార్థ్‌రెడ్డి అలియాస్‌ సిధ్ధు (కిరణ్‌ అబ్బవరం) లవ్‌ ఫెయిల్యూర్స్‌ కుర్రాడు. తను ప్రేమించిన మ్యాగి (నజియా)తో కొన్ని కారణాల వల్ల్ల బ్రేకప్‌ అవుతుంది. నమ్మిన స్నేహితుడు తన తండ్రిని మోసం చేయడంతో సిద్దార్థ్‌ తట్టుకోలేకపోతాడు. అప్పటి నుంచీ ప్రేమ అనే ఎమోషన్‌కు దూరం అవుతాడు. సారీ, థ్యాంక్స్‌ అనే రెండు పదాలకు అసలు విలువ ఇవ్వడు. ఆ పదాలు పలకనే పలకడు. ఇలాంటి సిద్దార్థ్‌ జీవితంలోకి అంజలి (రుక్సార్‌ థిల్లాన్‌) వస్తుంది. సిద్దార్థ్‌ ని ప్రేమించమని వెంట తిరుగుతుంది. చివరికి సిద్దార్థ్‌ కూడా మ్యాగిని మర్చిపోయి అంజలి ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వల్ల వీళ్ల మధ్య కూడా గ్యాప్‌ వస్తుంది. ఈ జంటను కలపడం కోసం సిద్దార్‌కు బ్రేకప్‌ చెప్పిన మ్యాగి అమెరికా నుంచి తిరిగి వస్తుంది. అసలు అంజలితో సిద్దార్థ్‌ గొడవేంటి? మధ్యలో జోకర్‌ (జాన్‌ విజయ్‌) ఎందుకు వచ్చాడు. సిద్ధూ సారీ, థ్యాంక్స్‌ అనే పదాలను పట్టించుకున్నాడా లేదా, అతని ప్రేమకథ ఏ తీరానికి చేరింది అన్నది కథ.


విశ్లేషణ: (Dil ruba Movie Review)
ఒకమ్మాయితో బ్రేకప్, మంగుళూరు కాలేజ్లో  ఇంకో అమ్మాయితో ప్రేమాయణం, మరో స్టూడెంట్ తో లవర్ కు సంబందించిన గొడవ, థర్డ్ పార్టీ కింద ఇంకో విలన్... వీరి మధ్య నడిచే కథ ఇది. పూర్తిగా హీరో క్యారెక్టరైజేషన్‌ మీద రాసుకున్న కథ ఇది. కానీ సన్నివేశాల్లో కొత్తదనం లేదు. లవ్‌ ట్రాక్‌ అంతా రొటీన్‌గా అనిపించింది. అంజలి పాత్ర ఆసక్తికరంగానే ఉంది. ఇంటర్‌వెల్‌ ఫైట్‌ డిజైన్‌ బావుంది. దానికి బలమైన కారణం చెప్పుంటే బావుండేది. సెకెండాఫ్‌లో మాజీ ప్రేయసి మ్యాగీ ఇండియాకు రావడంతో  కొత్తదనం వస్తుందేమో అనిపిస్తుంది. కానీ అక్కడా మెరుపులు లేవు.  మ్యాగి రావడం కాలేజీ లెక్చరర్‌గా చేరడం, సిద్ధూకి తను ఇచ్చే సలహాలు నడిపించే తీరు ఏదో బలవంతంగా ఇరికించినట్లు ఉంటుంది.  డ్రగ్స్‌ ట్రక్‌ యాక్సిడెంట్‌, రూ.600 కోట్లు, సింగిల్‌ సెటిల్‌మెంట్‌ అంటూ జోకర్‌ (జాన్‌ విజయ్‌) పాత్రకూ ఏదో చిన్న లింక్‌ పెట్టి ఇరికించారు. కడపలో సిద్ధూ బ్యాగ్రౌండ్‌ సీన్‌ బావుంది. అదే క్లైమాక్స్‌లోనూ వాడారు. ఆ సన్నివేశాలు క్లైమాక్స్‌ ఫైట్‌లో కన్వెన్సింగ్‌గా ఉన్నాయి. పతాక సన్నివేశంలో  థ్యాంక్స్‌, సారీ ఎందుకు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? అనే సీన్ ఆకట్టుకుంది.  

నటీనటుల విషయానికొస్తే కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ప్రతిభ ఉన్న నటుడు, కష్టపడేతత్వం కలవాడు. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే అవుట్‌పుట్‌ బావుంటుంది. సిద్దు పాత్రకు కిరణ్‌ న్యాయం చేశాడు. కొత్తగా ఫ్రెష్‌ లుక్‌లో కనిపించాడు. ప్రేమకథ అనగానే భావోద్వేగాలు తప్పనిసరి. ఆ సన్నివేశాల్లో మాత్రం ఎక్కడో న్యాయం చేయలేకపోయాడనిపించింది. ఎమోషన్‌ సీన్స్‌లో నటించేటప్పుడు, సౌండింగ్‌ డైలాగులు చెప్పేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. అరిచే సందర్భాల్లో అతని గొంతు పీలగా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌లో మాత్రం ఎనర్జిటిక్‌గా కనిపించాడు. అంజలిగా రుక్సార్‌ వంద శాతం ఎంటర్‌టైన్‌ చేసింది. చాలా ఎనర్జీగా, గ్లామర్‌గా కనిపించింది. అయితే లవ్‌ ట్రాక్‌లో మాత్రం తేలిపోయింది. మ్యాగి క్యారెక్టర్‌ సినిమాకు కీలకం. కానీ పాత్ర చిత్రణ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఏదో సోసోగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో తను ఉన్న ఏ సినిమాలో అయినా సత్యకు మంచి పాత్రలు పోషించాడు. కానీ అతన్ని సరిగ్గా వాడుకోలేపోయాడనిపిస్తుంది.

సాంకేతిక నిపుణులు విషయానికొస్తే.. డేనియల్‌ విశ్వాస్‌ కెమెరా వర్క్‌ రిచ్‌గా ఉంది. ఫస్టాఫ్‌ లవ్‌ ట్రాక్‌లో ఎడిటర్‌ ఇంకాస్త వర్క్‌ చేసుంటే సినిమా క్రిస్ప్‌గా ఉండేది. శ్యామ్‌ సి.ఎస్‌ నేపథ్య సంగీతం, పాటలు సినిమా చాలా ప్లస్‌ అయింది. ఇంట్రవెల్‌ ఫైట్‌కు ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ భలే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడిపై పూరి జగన్నాథ్‌ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. హీరో క్యారెక్టర్‌లో యారగెన్స్‌, డైలాగ్‌ డిక్షన్‌ పూరి జగన్నాథ్‌ స్టైల్లో ఉంది.  కొన్ని డైలాగ్స్‌లో పూరి జగన్నాథ్‌ మార్క్‌ కనిపించింది. దర్శకుడికి రచనపై పట్టుంది. మాటలు బాగా రాసుకున్నాడు. పూర్తిగా హీరో క్యారెక్టరైజేషన్‌ మీద అల్లుకున్న కథ ఇది. కథతో కాస్త కొత్తదనం ఉన్నా థియేటర్‌లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టవచ్చు. అయితే పాయింట్‌ ఒకటే కొత్తగా ఉంటే సరిపోదు. తెరకెక్కించడం, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నా ప్రేక్షకుడిని కన్వెన్స్‌ చేసేలే రాసుకోవడం, తీయడం చాలా ముఖ్యం. దర్శకుడి పనితీరులో అదే మిస్‌ అయింది. సెకండాఫ్‌ పూర్తిగా తడబాటు కనిపించింది. ‘క’ తరవాత ఓ మంచి సినిమా తీసి అంచనాలు పెంచాల్సిన కిరణ్‌ అబ్బవరం తడబడిన భావన కలుగుతుంది. (Dil ruba Movie Review)

ట్యాగ్‌లైన్‌: సారీ .. చెప్పాలి... 

Updated Date - Mar 14 , 2025 | 02:14 PM