Gymkhana Review: సినిమా రివ్యూ: అల్లెపీ జింఖానా
ABN, Publish Date - Apr 25 , 2025 | 10:41 PM
గత సంవత్సరం 'ప్రేమలు' అంటూ ఓ మలయాళ అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నస్లెన్ ( Naslen). ఆ తర్వాత ఐ యామ్ కథలాన్ అంటూ టెక్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో హిట్ అందుకుని తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సైతం ఏర్పాటు చేపుకున్నాడు.
సినిమా రివ్యూ: అల్లెపీ జింఖానా
విడుదల తేది: ఏప్రిల్ 25
రేటింగ్: 2.75
నటీనటులు: నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాన్సిస్, శివ హరిహరన్, అనఘ రవి
సంగీతం: విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్
ఎడిటర్: నిషాద్ యూసుఫ్
నిర్మాతలు: ఖలీద్ రెహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి
దర్శకత్వం: ఖలీద్ రెహమాన్
గత సంవత్సరం 'ప్రేమలు' అంటూ ఓ మలయాళ అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నస్లెన్ ( Naslen). ఆ తర్వాత ఐ యామ్ కథలాన్ ( I Am Kathalan) అంటూ టెక్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో హిట్ అందుకుని తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సైతం ఏర్పాటు చేపుకున్నాడు. తాజాగా నస్లైన్ నటించిన అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana) ఏప్రిల్ 10న కేరళలో విడుదలై సంచలన విజయం సాధించడమే కాకుండా సుమారు రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో అనువాదం చేసి ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో హీరో నస్లైన్ తప్ప అన్నీ కొత్త, తెలియని, మనకు ఏమాత్రం పరిచయం లేని మోహాలే కావడం గమనార్హం. అయితే గతంలో టొవినో థామస్, కళ్యాణి ప్రిమయదర్శన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ తల్లుమాల (Thallumaala) సినిమాను తెరకెక్కించిన కలీద్ రహమాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. మరి ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కేరళ రాష్ట్రంలోని అల్లెపీ ప్రాంతానికి చెందిన జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత, పెద్దోడు, చిన్నోడు, సెహనావాస్ ఐదుగురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అల్లరి చిల్లరిగా ఉంటూ రేపటి గురించి బెంగ అనేది లేకుండా అనుక్షణం ఎంజాయ్ చేద్దాం అనే మూడ్‌లో ఉంటారు. అయితే అప్పటికే రాసిన ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో ఐదుగరిలో ఒక్కరు మాత్రమే ఫాస్ అయి నలుగురు ఫెయిల్ అవుతారు. అయినా వాళ్లు దాన్ని సెలబ్రేట్ చేసుకుని ఇకపై కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటారు. కానీ తాము ఏ పని చేయలేమని ఆఖరికి బాక్సింగ్ నేర్చుకుని టోర్నమెంట్స్ ఆడి కాలేజీలో పాస్ మార్కులతో బయట పడొచ్చని సమీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడమీలో ట్రైనింగ్ కోసం చేరుతారు. అక్కడి నుంచి వారి ప్రయాణం ఎలా సాగింది, డిస్ట్రిక్ లెవల్, స్టేట్ లెవల్ టోర్నమెంట్లలో పాల్గొన్నారా, విజయం సాధించారా చివరకు ఏమైందనేది కథ.
విశ్లేషణ:
అలెప్పి జింఖానా సినిమాలో పేరుకు హీరో నస్లైన్ అయినప్పటికీ సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఆరేడుగురి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందరికీ సమాన స్రకీన్ స్పేస్ ఉంటుంది. నస్లైన్ తప్పితే అంతా మన తెలుగు వారికి పరిచయం లేని నటులే ఉన్నప్పటికీ ఎండింగ్ వరకు మనకు ఆ తేడా ఏ కోశానా అనిపించదు. అంతలా సినిమా ను తీర్చి దిద్దారు. సినిమా ఆరంభమే స్నేహితుల ఇంటర్ రిజల్ట్స్ నుంచి మొదలు మొదటి 20 నిమిషాలు వారి డైలీ రొటీన్ చూయించి, అక్కడి సన్నివేశాలు, లేటెస్ట్ ట్రెండింగ్ పంచులతో థియేటరంతా పగలబడి నవ్వేలా చేశారు. ముఖ్యంగా ఇటీవల ఫేమస్ అయి ట్రెండింగ్‌లో ఉన్న అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వద్ద జాతకం చూపించి చెప్పాలా అంటూ పలు ట్రెండీ డైలాగ్స్ వాడారంటే ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో కిక్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఫస్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్, అమ్మాయిలకు సైట్ కొట్టే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఎక్కడా వల్గారిటీ, అసభ్యత, అశ్లీలతలకు తావీవకుండా పాత్రల మధ్య నుంచి సందర్భోచిత కామెడీని పుట్టించారు. ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ టోర్నమెంట్‌తోనే సాగుతుంది. స్నేహితులుగా నటించిన ఐదుగురు వారి వారి పాత్రల్లో ఫర్‌ఫెక్ట్ యాప్ట్ అయ్యారు. మొదటి 20 నిమిషాలు కామెడీతో ఆలరించగా చివరి 20 నిమిషాలు పంచ్ డైలాగులు, యాక్షన్‌సీన్లు, క్లైమాక్స్ హీరో ఇంట్లో సన్నివేశంతో సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు నవ్వు మొహంతో బయటకు వచ్చేలా చేశారు. ఇక సాంకేతిక పరంగా సనిమా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఉంది. కేరళ విలేజ్ అందాలను అక్కడక్కడ మంచిగా చూపించారు. ఈ సినిమాలో అలరించే పాటలు లేక పోయినప్పటికీ సంగీతం సినిమాకు ఆయువు పట్టు. బ్యాగ్రైండ్ మ్యూజిక్ సినిమా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది.
అయితే.. ఇప్పటి వరకు మనం చూసిన స్పోర్ట్స్, డ్రామా, హీరో ఓరియంటెడ్ సినిమాలా కాకుండా వాటికి పూర్తి విరుద్దంగా ఈ సినిమా సాగుతుంది. చిత్రం అసాంతం ఐదుగురి చుట్టూ తిరిగినా ఎమోషనల్ సన్నివేశాలు అంతగా లేక పోవడం, హీరో పాత్రను ప్రత్యేకంగా చూయించక పోవడం మైనస్ కాగా. అంతేకాదు బాక్సింగ్ వచ్చే సమయాల్లో , మరో ఒకటి రెండు సందర్భాల్లో కోచ్‌పై. ఆటపై అంత సీరియస్ నెస్ ఉన్నట్లు కాకుండా సిల్లీగా కథనం నడిపించారు. రెండు మూడు లవ్ ట్రాక్‌లు పెట్టినప్పటికీ వాటికి సరైన ముగింపు ఇవ్వలేదు. ఎమోషనల్ లవ్ , స్పోర్ట్స్ డ్రామా, అని సినిమాకు పోతే వారు డిసప్పాయింట్ అవక తప్పదు. ఫస్ట్ నుంచి చివరి వరకు కాసేపు సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వారికి ఈ మూవీ ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఎక్కడా బోర్ ఫీలవ్వరు.
రేటింగ్: 2.75
ట్యాగ్ లైన్: వేసవిలో.. నవ్వుల వర్షం