డ్రగ్స్‌ తీసుకునే వారితో నటించను

ABN, Publish Date - Apr 17 , 2025 | 02:33 AM

ఇటీవలె వరుస కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేధింపుల ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమలో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వెలువడిన...

ఇటీవలె వరుస కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేధింపుల ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమలో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత అక్కడ పరిస్థితులు సద్దుమణిగాయని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అలాంటి తరుణంలో ‘జనగణమన’ ఫేమ్‌, హీరోయిన్‌ విన్సీసోనీ అలోషియస్‌ ఓ హీరోపై చేసిన ఆరోపణలు మరోసారి అంతటా చర్చనీయాంశమయ్యాయి. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన పెంచే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇటీవల ఓ సినిమాలో తనతో కలసి నటించిన సహనటుడు డ్రగ్స్‌ తీసుకున్న మత్తులో లైంగికంగా వేధించాడని ఆరోపించారు. డ్రగ్స్‌ తీసుకునే వారితో ఇకపై ఎప్పటికీ సినిమాలు చేయనని స్పష్టం చేశారు. ‘‘ఓ సినిమా షూటింగ్‌ సమయంలో నేను వేసుకున్న డ్రెస్‌ అసౌకర్యంగా అనిపించింది. దుస్తులు మార్చుకుందామని డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా, ఆ యాక్టర్‌ ‘నేనూ నీకు తోడుగా వచ్చి నీ డ్రెస్‌ మార్చుకునేందుకు సహాయం చేస్తా’ అని సెట్స్‌లో ఉన్న అందరి ముందే మాట్లాడి ఇబ్బందిపెట్టాడు. ఆయన సెట్స్‌లోనే డ్రగ్స్‌ తీసుకునేవాడు. ఆయనపై చిత్ర దర్శకుడికి, నిర్మాతలకు ఫిర్యాదు చేశా.


ఆయనది ప్రధాన పాత్ర కావడంతో, సినిమా ఆగిపోతుందనే భయంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ షూటింగ్‌ జరిగినన్ని రోజులు చాలా ఇబ్బందిపడ్డాను’’ అని పేర్కొన్నారు. కాగా, 2019లో నటిగా ఇండస్టీలో అడుగుపెట్టారు విన్సీ. పలు చిత్రాల్లో నటించిన ఆమె, ‘రేఖ’ సినిమాకు ఉత్తమ నటిగా కేరళ స్టేట్‌ అవార్డును అందుకున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 02:33 AM