Vasavi Sakshatkaram: ‘వాసవీ సాక్షాత్కారం’.. ఆ అమ్మవారి అనుగ్రహం వల్లే..
ABN, Publish Date - Jan 28 , 2025 | 10:27 PM
ఒక్కో పాటను అమ్మ వారే దగ్గరుండి చేయించుకున్నారనిపించింది. అమ్మ వారి అనుగ్రహం వల్లే ఈ పాటలు ఇంత అద్భుతంగా వచ్చాయని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. ఆయన సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ‘వాసవీ సాక్షాత్కారం’ ఆడియో, వీడియో ఆల్బమ్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అమ్మ వారి అనుగ్రహం వల్లే ఈ పాటలు ఇంత అద్భుతంగా వచ్చాయని అన్నారు సంగీత దర్శకుడు కోటి. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను ఆయన రెడీ చేశారు. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఈ పాటలను రచించగా.. స్వర కిరీటీ డా. కోటి సంగీత సారథ్యంలో ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్ రూపొందింది. ఈ ఆల్బమ్‌ను అతిరథుల సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ వేడుకకు ఆర్యవైశ్య కుల గురువులు, శ్రీ వాసవీ పీఠం 2వ పీఠాదిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత శ్రీ శైవక్షేత్ర పీఠాదిపతులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివ స్వామిజీ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత గెల్లి రమేశ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వర ప్రసాద్ రెడ్డి, గేయ రచయిత భువన చంద్ర, నటుడు నరేష్ వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
ఈ కార్యక్రమంలో ఏ.వి.ఎమ్ రావు మాట్లాడుతూ.. ‘మా ఈ ప్రయాణంలో జీఎంఆర్ గ్రూఫ్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు (జీఎంఆర్) మాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారని.. కోటి, సామవేదం షణ్ముఖ శర్మ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వాసవీ సాక్షాత్కారం ఆల్బమ్‌ను రూపొందించారని తెలిపారు. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ.. ‘‘వాసవీ మాత చరిత్ర ఈ ప్రపంచమంతటికీ తెలుసు. ఎన్నో వేదికలపై అమ్మ వారి ప్రవచనాలు చెప్పడం జరిగింది. అమ్మ వారి జీవిత చరిత్రపై పాటలు రాయాలని అనుకున్నాను. ఆ సమయంలోనే కోటి గారు ఫోన్ చేసి వాసవీ సాక్షాత్కారం గురించి చెప్పారు. నేను రాసిన పాటలకు కోటి గారు అద్భుతమైన స్వరాలను అందించారు’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. నాకు ఈ ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ ఆల్బమ్ కోసం ఆరు నెలలు కష్టపడ్డాం. ఒక్కో పాటను అమ్మ వారే దగ్గరుండి చేయించుకున్నారనిపించింది. అమ్మ వారి అనుగ్రహం వల్లే ఈ పాటలు ఇంత అద్భుతంగా వచ్చాయి. సౌండ్ డిజైనింగ్, పాటల ప్రజెంటేషన్‌కు ఎక్కువ సమయం పట్టింది. అన్ని పాటలకు సౌండింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఈ పాటలుంటాయి. ముందు తరాలకు కూడా అర్థమయ్యేలా ఈ ఆల్బమ్‌ను రూపొందించాం. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఏ.వి.ఎమ్ రావుగారికి ధన్యవాదాలనిని తెలిపారు. ఇంకా ఈ వేడుకకు హాజరైన వారంతా ఈ ఆల్బమ్ రూపకర్తల ప్రయత్నాన్ని కొనియాడారు.