Ustaad Bhagat Singh: ఉన్నట్టా... లేనట్టా...

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:51 PM

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదల విషయంలో నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) సినిమాల విడుదల ఊహించని విధంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ యేడాది ఇప్పటికే 'హరిహర వీరమల్లు, ఓజీ' చిత్రాలు విడుదల కావాల్సింది. కానీ రాష్ట్ర పాలనా పగ్గాలను చేపట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు ఏకంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టడం, పైగా నాలుగైదు పోర్ట్ పోలియోస్ ను చూడాల్సి రావడంతో ప్రభుత్వ కార్యకలాపాలతోనే ఆయన బిజీగా ఉన్నారు. అయినా... అవకాశం కుదుర్చుకుని ఆ మధ్య 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారు. అయితే ఇందులో రాజస్థాన్ కు సంబంధించిన ఓ ఎపిసోడ్ బాలెన్స్ ఉండిపోయింది. దాంతో మార్చి 28న విడుదల కావాల్సిన ఈ సినిమాను మే 9కి వాయిదా వేశారు.


ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ చేయాల్సిన రెండో సినిమా 'ఓజీ' (OG) కూడా పూర్తి కావడం ఆలస్యమౌతోంది. అది ఈ యేడాది ద్వితీయార్థంలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. ఇక పవన్ కళ్యాణ్‌ కమిట్ అయిన మరో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' (Gabbar Singh) లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీశ్‌ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో సహజంగానే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే... ఇది తమిళ చిత్రం 'తేరీ'కి రీమేక్ అనే ప్రచారం జరుగుతూ ఉండటం, ఇటీవల హరీశ్‌ రవితేజతో తీసిన హిందీ రీమేక్ 'మిస్టర్ బచ్చన్' పరాజయం కావడంతో కొంత ఈ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పవన్ కళ్యాణ్‌ అభిమానులైతే... మొదటి నుండీ ఈ తమిళ రీ-మేక్ ను చేయవద్దంటూ మొత్తుకుంటున్నారు. అయితే... హరీశ్‌ మీద పూర్తి భరోసా ఉన్న పవన్ కళ్యాణ్‌ వారి మాటలను పెద్దంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందో పవన్ అభిమానుల డిమాండ్ మరింత ఊపు అందుకుంది. ఈ నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇక ఉండకపోవచ్చునేమో అనే అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. అయితే... హరీశ్‌ శంకర్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' పరాజయం తర్వాత స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, మెరుగులు దిద్దాడని సన్నిహితులు చెబుతున్నారు.


ఇక తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ (Ravi Shankar) ఈ సినిమా విషయమై అప్ డేట్ ఇచ్చారు. పక్కా స్క్రిప్ట్ తో తాము షూటింగ్ కు రెడీగా ఉన్నామని, పవన్ కళ్యాణ్‌ ఎప్పుడు డేట్స్ ఇస్తే... అప్పుడు షూటింగ్ చేస్తామని అన్నారు. ఈ యేడాది ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, వచ్చే యేడాది దీనిని జనం ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 'హరిహర వీరమల్లు', 'ఓజీ' చిత్రాల తరహాలోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీనీ పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేయాలనే తపనతో ఉంది. మరి పవన్ కళ్యాణ్‌ ఈ చిత్రానికి డేట్స్ ఎప్పుడు ఇచ్చి షూటింగ్ పూర్తి చేస్తారో చూడాలి.

Also Read: L2: Empuraan Review: మోహన్ లాల్... ఎల్ 2: ఎంపురాన్ మెప్పించిందా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 27 , 2025 | 04:51 PM