Tollywood: వీకెండ్ పదకొండు తెలుగు సినిమాలు
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:35 PM
ఏప్రిల్ లాస్ట్ వీకెండ్ లో చిన్న సినిమాలు థియేటర్లలో హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు. రెండు మలయాళ డబ్బింగ్ సినిమాలతో పాటు ఏకంగా పదకొండు సినిమాలు ఈ వారాంతంలో విడుదల కాబోతున్నాయి.
ఏప్రిల్ మాసంలో ఇంతవరకూ పదిహేను సినిమాలు విడుదలైతే... ఈ వీకెండ్ లో ఏకంగా పదకొండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' మాత్రమే. లాస్ట్ మంత్ 14న ప్రియదర్శి నటించిన 'కోర్ట్' సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి దానికంటే ముందే 'సారంగపాణి జాతకం' రావాల్సింది. కానీ అనివార్యంగా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో 'కోర్ట్' సక్సెస్ ఈ సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటించింది. జాతకాలపై నమ్మకం, అపనమ్మకం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. శుక్రవారం మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా మేకర్స్ థీమ్ సాంగ్ ను విడుదల చేశారు.
'హృదయ కాలేయం'తో బర్నింగ్ స్టార్ గా తెలుగువారి ముందుకు వచ్చి, తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించాడు, కామెడీ క్యారెక్టర్స్ చేశాడు. కానీ కొంతకాలంగా సంపూకి సక్సెస్ దక్కడం లేదు. దాంతో కాస్తంత గ్యాప్ తీసుకుని 'సోదరా' మూవీతో ఈ నెల 25న జనం ముందుకు రాబోతున్నాడు. అన్నదమ్ముల అనుబంధంతో వచ్చిన అనే చిత్రాలు గతంలో మంచి విజయాన్ని సాధించాయి. అదే నమ్మకంతో బ్రదర్ సెంటిమెంట్ తో ఈ సినిమాను చేశాడు సంపూ, అతని సోదరుడుగా సంజోష్ నటిస్తున్న ఈ సినిమాను మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చాగండ్ల నిర్మించారు. 'సోదరా' సినిమాతో తిరిగి తాను సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని సంపూర్ణేష్ బాబు నమ్ముతున్నాడు.
ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మించిన 'చౌర్య పాఠం' సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఇంద్రారామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఈ మూవీతో నిఖిల్ గొల్లమారి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సింగిల్ క్యారెక్టర్ తో రూపుదిద్దుకున్న 'హలో బేబీ', కామెడీ ఎంటర్ టైనర్ 'సర్వం సిద్థం', యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'సూర్యాపేట్ జంక్షన్', 'ఎ.ఎల్.సి.సి.', 'శంభో శివ', 'మన ఇద్దరి ప్రేమకథ' చిత్రాలూ ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలానే ఇప్పటికే మలయాళంలో విడుదలై విజయాన్ని అందుకున్న స్పోర్ట్స్ డ్రామా 'జింఖానా' సైతం శుక్రవారం తెలుగులో వస్తోంది. ఇక శనివారం నాడు మలయాళంతో పాటు తెలుగులోనూ మోహన్ లాల్, శోభన జంటగా నటించిన 'తుడరుమ్' మూవీ విడుదల అవుతోంది. పలు వివాదాలతో వార్తలలో నిలిచిన 'ఎంపురాన్' తర్వాత వస్తున్న 'తుడరుమ్'కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Also Read: Venky Atluri: సూర్య సరసన కీర్తి సురేశ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి