Shine Tom Chacko: నన్నే టార్గెట్‌ చేస్తున్నారు

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:24 AM

మలయాళ నటుడు షైన్‌ టామ్‌చాకో డ్రగ్స్‌ కేసులో తనను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారని వాపోయారు. నటి విన్సీసోనీ ఓ నటుడిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే

‘నేనొక్కడినే డ్రగ్స్‌ తీసుకోవట్లేదు. నాతో పాటు చాలా మంది ఇండస్ట్రీలో ఆ పని చేస్తున్నారు. కానీ, నన్ను, మరో నటుడ్ని మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారు’ అని మలయాళ నటుడు షైన్‌ టామ్‌చాకో వాపోయారు. డ్రగ్స్‌ వాడాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇటీవలె ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన పోలీసు విచారణలో భాగంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. ‘నేను ఆ రోజు హోటల్‌కు తెలిసిన అమ్మాయిని కలవడానికి వెళ్లాను. నేను పోలీసులు నుంచి తప్పించుకొని పారిపోవడానికి భవంతి దూకి వెళ్లలేదు. నాకు ఓ చిత్రబృందంతో గొడవ జరిగింది. ఆ కారణంగానే భయంతో అలా పారిపోవాల్సి వచ్చింది. నేను నటి విన్సీసోనీతో అసభ్యంగా ప్రవర్తించలేదు. డ్రగ్స్‌ను కొందరు మధ్యవర్తులు అమ్మేవారు. వారే సెట్స్‌కు కూడా తెచ్చి ఇచ్చేవారు’’ అని పేర్కొన్నారు. ఈ విచారణలో భాగంగా ఆయన ఫోన్‌లోని బ్యాంక్‌ లావాదేవీలను తనిఖీ చేశారు పోలీసులు. అందులో ఆయన 14మందికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు గుర్తించారు. దీని గురించి ఆయనను ప్రశ్నించగా, అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఆయనను త్వరలోనే పోలీసులు మరోసారి విచారించనున్నారు.


ఇదిలా ఉంటే నటి విన్సీసోనీ అలోషియస్‌ ఇటీవలె షైన్‌ టామ్‌చాకో పేరు ప్రస్తావించకుండా ఓ నటుడు లైంగిక వేధింపులు చేశాడంటూ ఆరోపిస్తూ కేరళ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నేను ఫిల్మ్‌ఛాంబర్‌లో చేసిన ఫిర్యాదులో ఆ వ్యక్తి పేరు బహిర్గతం చేయొద్దని అధికారులను కోరాను. నేను ఆయనపై చట్టపరంగా ఎలాంటి యాక్షన్‌ తీసుకోవాలనుకోవట్లేదు. ఇది ఇండస్ట్రీలో ఉత్పన్నమైన సమస్య. దీనికి ఇండస్ట్రీలోనే పరిష్కారం దొరకాలి. మలయాళ చిత్ర పరిశ్రమలో నేను మార్పుని చూడాలనుకుంటున్నాను. అందుకే ఫిర్యాదు చేశా. నేను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 04:25 AM