Shashtipoorthi: ఒక పాట కోసం ఇళయరాజా, బాలు, డీఎస్పీ

ABN, Publish Date - Mar 25 , 2025 | 12:23 PM

రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటగా నటించిన సినిమా 'షష్టిపూర్తి'. ఇందులో యువ జంటగా రూపేశ్, ఆకాంక్ష సింగ్ నటించారు. ఇళయరాజా స్వరపర్చిన బాణీకి కీరవాణి సాహిత్యం అందించగా దీనిని దేవిశ్రీ ప్రసాద్ దీనిని విడుదల చేశారు.

రూపేష్ కథానాయకుడిగా, నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'షష్టిపూర్తి'. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. ఆకాంక్ష సింగ్ కథానాయిక. పవన్ ప్రభ దర్శకుడు. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. విశేషం ఏమంటే ఇళయరాజా స్వరపర్చిన ఈ గీతానికి కీరవాణి రచన చేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి రచన చేసిన తొలి గీతం ఇది. దీనిని అనన్య భట్ గానం చేశారు. విశేషం ఏమంటే... 'ఏదో ఏ జన్మలోదో' అంటూ సాగే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ, ''ఇళయరాజా గారిని ట్యూన్స్ కోసం చెన్నయ్ వెళ్ళి కలిసినప్పుడు ఆయన రెండు బాణీలు ఇచ్చారు. ఆ తర్వాత మూడో పాట ట్యూన్ కూడా తీసుకోమని అన్నారు. అయితే అది రెగ్యులర్ టైప్ సాంగ్ కాదు. ఆ పాటలో కథను చెప్పాలి. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు అందులో విశదపర్చాలి. అప్పటికే మొదటి రెండు పాటలను రెహమాన్, చైతన్య ప్రసాద్ రాశారు. ఈసారి ఈ మూడో పాటను కాస్తంత భిన్నంగా ట్రై చేయాలనిపించింది. దానిని కీరవాణి గారితో రాయిస్తే ఎలా ఉంటుందని చైతన్య ప్రసాద్ ను అడిగాను. ఆయన బాగుంటుందనడంతో కీరవాణి గారిని సంప్రదించారు. ఆ టైమ్ లో ఆయన చెన్నయ్ లోనే ఉన్నారు. ఇళయరాజాగారి ట్యూన్ కు పాట అనేసరికీ ఆయన అంగీకరించారు. రాజా గారికి ఓ మాట చెప్పమన్నారు. ఆయన దగ్గరకు మేం వెళ్ళేలోగానే పల్లవిని రాసి పంపేశారు. ఆయన సాహిత్యం న భూతో న భవిష్యత్ అనిపించేలా ఉంది'' అని అన్నారు. అతి త్వరలో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.

Also Read: Krishna Vamsi: కృష్ణవంశీ డైరెక్షన్ లో అల్లూరి సీతారామరాజు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 25 , 2025 | 12:28 PM