Heroine Shanthi Priya Bald Look: ఆత్మవిశ్వాసమే అసలైన అందం

ABN, Publish Date - Apr 12 , 2025 | 01:01 AM

ఒకప్పటి హీరోయిన్ శాంతిప్రియ గుండు గీయించుకొని అందంపై కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. భర్త జ్ఞాపకంగా అతని బ్లేజర్ ధరించి తీసిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు

ఒత్తైన, పొడవాటి జుట్టు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. జుట్టు ఏ కాస్త రాలినా వారు అస్సలు తట్టుకోలేరు. అలాంటి కురులపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ ఒకప్పటి హీరోయిన్‌ మాత్రం అందంగా కనిపించాలంటే జుట్టు అవసరమా? అని ప్రశ్నించారు. ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని నిర్వచిస్తూ గుండు గీయించుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసారు. ఆమె మరెవరో కాదు... ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ భానుప్రియ చెల్లి శాంతిప్రియ. తెలుగులో మహర్షి, కలియుగ అభిమన్యుడు, సింహ స్వప్నం లాంటి పలు విజయవంతమైన చిత్రాల్లో శాంతి ప్రియ నటించారు. కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించిన ఆమె..ఆ తర్వాత బాలీవుడ్‌ వెళ్లిపోయారు. నటుడు సిద్ధార్థ్‌ రాయ్‌ని 1999లో వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2004లో సిద్ధార్థ్‌ రాయ్‌ గుండెపోటుతో మరణించారు. కాగా, తన లేటెస్ట్‌ లుక్‌తో అందరినీ షాక్‌కు గురిచేశారు శాంతిప్రియ. చనిపోయిన తన భర్త బ్లేజర్‌ ధరించి గుండుతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఈ మధ్యే గుండు కొట్టించుకొన్నాను. విభిన్నమైన అనుభూతిని పొందుతున్నా. మహిళగా మనం జీవితంలో కొన్ని పరిమితులు పెట్టుకుంటాం. సమాజం విధించిన కట్టుబాట్లు, నియమ నిబంధనలు పాటిస్తూ మనల్ని మనమే కట్టడి చేసుకుంటాం. వీటి నుంచి నేను స్వేచ్ఛను కోరుకున్నాను. నన్ను నేను విముక్తి చేసుకున్నాను. అందం అంటే ఇదే అనే ప్రమాణాలను బ్రేక్‌ చేయాలనుకున్నాను. ఎంతో ధైర్యంతో ముందడుగు వేశాను. నా భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతని బ్లేజర్‌’ ధరించాను’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:58 PM