అంచనాలను మించి అలరిస్తుంది

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:50 AM

‘‘నేను తీసే మహాభారతంలో నాని పోషించేది ఏ పాత్ర అనేది చెప్పను గానీ.. అందులో ఆయన కచ్చితంగా ఉంటాడు. నిర్మాత ప్రశాంతిని హిట్‌ మెషీన్‌ అని పిలుస్తుంటాం. ‘హిట్‌ 3’ కూడా ఆమెకు ఘనవిజయాన్ని...

‘‘నేను తీసే మహాభారతంలో నాని పోషించేది ఏ పాత్ర అనేది చెప్పను గానీ.. అందులో ఆయన కచ్చితంగా ఉంటాడు. నిర్మాత ప్రశాంతిని హిట్‌ మెషీన్‌ అని పిలుస్తుంటాం. ‘హిట్‌ 3’ కూడా ఆమెకు ఘనవిజయాన్ని అందిస్తుంది. ఈ ‘హిట్‌’ ఫ్రాంచైజీకి అంతం లేదు. నాని తీసే ప్రతి సినిమాపై అంచనాలు ఎక్కువ ఉంటాయి. ఈ సినిమా అంచనాలను మించి అలరిస్తుంది. ఆయన ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగారు. మరింత గొప్ప స్థాయికి ఎదగాలి. ఈ సినిమాకు సూపర్‌హిట్‌ పక్కా అనే వైబ్‌ కనిపిస్తోంది’’ అని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 3’. మే 1న విడుదలవుతున్న సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ‘‘ఇందులో హింస మీరు భయపడేలా కాదు, ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. ఒక మంచి థ్రిల్లర్‌కు పక్కా కమర్షియల్‌ సినిమా జతకలిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. ఒకప్పుడు రాజమౌళిగారు నా సినిమాలు చూసి ఎలా ఉందో చెప్పేవారు. కానీ ఆ సంప్రదాయం ఈ మధ్య మిస్సయ్యింది. ఈ సినిమాను మాత్రం ఆయన మొదటి రోజు చూస్తారని ఆశిస్తున్నాను. లేదంటే ఆయన పాస్‌పోర్ట్‌ లాగేసుకుంటా. ఆయన పేరు ఇప్పటికే సినిమా డిక్షనరీలోకి వెళ్లిపోయింది. రోమాలు నిక్కబొడుచుకునే ఏ సన్నివేశానికైనా రిఫరెన్స్‌ కావాలంటే.. ‘రాజమౌళి ఎపిసోడ్‌’ అని అనడం అలవాటు అయిపోయింది. ఈ సినిమాలోనూ ఒక అద్భుత సన్నివేశం ఉంటుంది. దాన్ని నేను, శైలేష్‌ ‘రాజమౌళి మూమెంట్‌’ అని పిలుస్తుంటాం. విష్వక్‌ సేన్‌, అడివి శేష్‌ ఈ ‘హిట్‌ యూనివర్స్‌’కు మూలస్తంభాలు. శైలేష్‌ కొలను ఎంతటి ప్రతిభావంతుడో సినిమా విడుదల రోజున మీకందరికీ తెలుస్తుంది. సినిమా బాగుండాలి. సినిమాను కాపాడుకుందాం.


ఈ గురువారం మనకు సినిమా అంటే ఎంత ప్రేమ ఉందో దేశానికి చూపిద్దాం. ‘హిట్‌ 3’ మీ అంచనాలను అందుకోకుంటే ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’ని చూడొద్దండి. ఈ సినిమాతో పాటు విడుదలవుతున్న ‘రెట్రో’, ‘రైడ్‌ 2’ చిత్రాలూ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘హిట్‌’ ఫ్రాంచైజీకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇదో న్యూ ఏజ్‌ సినిమా’’ అని హీరో విష్వక్‌ సేన్‌ అన్నారు. ‘‘ఈ సినిమా చివరి 30 నిమిషాలు చూశాను. చాలా బాగుంది. ఆరంభ వసూళ్లు అదరిపోతాయి’’ అని అడివి శేష్‌ తెలిపారు. ‘‘సినిమా అంటే నానిగారికి అపారమైన ప్రేమ. నన్ను ఇంతగా నమ్మిన ఆయనకు కృతజ్ఞుడ్ని’’ అని దర్శకుడు శైలేష్‌ కొలను చెప్పారు. ‘‘నానిగారితో నటించడం ఒక మరిచిపోలేని అనుభూతి’’ అని హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి తెలిపారు.

Updated Date - Apr 28 , 2025 | 12:50 AM