భారీ ఓపెనింగ్స్‌ ఖాయం

ABN, Publish Date - Mar 27 , 2025 | 03:43 AM

‘తన లోని ధైర్యమే నిర్మాతగా వంశీని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆయన జడ్జిమెంట్‌లో తిరుగుండదు. ప్రచార చిత్రాలతోనే ‘మ్యాడ్‌ మాక్స్‌’ సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ ఖాయం’ అని హీరో నాగచైతన్య...

‘తన లోని ధైర్యమే నిర్మాతగా వంశీని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆయన జడ్జిమెంట్‌లో తిరుగుండదు. ప్రచార చిత్రాలతోనే ‘మ్యాడ్‌ మాక్స్‌’ సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ ఖాయం’ అని హీరో నాగచైతన్య అన్నారు. బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘మ్యాడ్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, నితిన్‌ రామ్‌ ప్రధాన తారాగణం. కల్యాణ్‌ శంకర్‌ దర్శకుడు. నాగవంశీ సమర్పణలో హారికా సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా యూనిట్‌ బుధవారం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ ‘‘మ్యాడ్‌ స్క్వేర్‌’ లాంటి సినిమాలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. ‘సరదాగా ‘మ్యాడ్‌’ లాంటి సినిమాలు చూడండి’ అని డాక్టర్లు కూడా తమ పేషంట్లకు సిఫారసు చేయాలి. పాత్రలు, కథ మన జీవితాలకు దగ్గరగా ఉంటాయి. ఇలాంటి సినిమాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి చూడాలి. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ విడుదలయ్యాక నటీనటులు అంతా ప్రేక్షకుల కుటుంబంలో ఒకరవుతారు. తెరపై కామెడీ పండించడం అంత సులువు కాదు.


నార్నే నితిన్‌, శోభన్‌, రామ్‌ అద్భుతంగా నటించారు. కల్యాణ్‌ దర్శకత్వం అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులను ఆధ్యంతం నవ్వుల్లో ముంచెత్తేలా ఉంటుంది. టికెట్‌ కోసం పెట్టిన ప్రతి రూపాయికీ న్యాయం జరిగిందని ప్రేక్షకులు భావిస్తారు’ అని చెప్పారు. హారికా సూర్యదేవర మాట్లాడుతూ ‘కామెడీ నేపథ్యంలో సాగే కథతో ఏకంగా ఫ్రాంచైజీ చిత్రాలు చేస్తున్నారంటే అది మా దర్శకుడి గొప్పదనమే. ప్రచార చిత్రాల్లో కొంతే చూశారు. సినిమా మరింత అలరిస్తుంది’ అని తెలిపారు. మన జీవితాలతో ముడిపడిన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం ఇదని నార్నే నితిన్‌ అన్నారు. ఈ సినిమాలో కామెడీ చాలా కాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని సంగీత్‌ శోభన్‌ తెలిపారు.

Updated Date - Mar 27 , 2025 | 03:43 AM