Drishyam: వెంకటేష్, అజయ్ దేవగన్ కు మోహన్ లాల్ షాక్
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:31 AM
మాలీవుడ్ లోని ఓ సీనియర్ స్టార్ హీరో తన చిత్రాలు రీమేక్స్ ఇతర భాషల్లోనూ ఇరగదీస్తున్నాయి కదాని భారీ సాహసానికి ఒడికట్టబోతున్నాడు. ఇటీవల ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయి, మార్కెట్ లేకున్నా పాన్ ఇండియాపై మనసు పారేసుకుంటున్నాడు.
మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) నటించిన 'దృశ్యం" ఫ్రాంచైజీ (Drishyam ) మూవీలు ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు. అదే కథతో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో వేరు వేరు హీరోలు రీ-మేక్ చేసి, ఘన విజయాలను అందుకున్నారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ''దృశ్యం, దృశ్యం 2''లో రాంబాబు పాత్రకు కనెక్ట్ అయిన తెలుగు ఆడియెన్స్, కమర్షియల్‌గా కాసుల వర్షం కురిపించారు. హిందీలోనూ అజయ్ దేవగణ్ (Ajay Devgn)కు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బాస్టర్ అందించారు. అయితే ప్రస్తుతం 'దృశ్యం 3' కోసం డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeethu Joseph ) ప్లాన్ చేస్తుండగా... ఓ బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
'దృశ్యం 3' సినిమాను కేవలం మలయాళానికే పరిమితం చేయకుండా.. మోహన్‌లాల్ ఈసారి పాన్-ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు బజ్ వినిపిస్తోంది. అంటే తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ చేయకుండా, మోహన్‌లాల్ వెర్షన్‌నే అన్ని భాషల్లో చూడాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్న అనుమానాలు లేకపోలేదు. మోహన్‌లాల్ చేసే వెర్షన్‌ను తెలుగు, హిందీ ఆడియన్స్ ఎంతమేర ఆదరిస్తారన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 'దృశ్యం' థ్రిల్లర్ కాన్సెప్ట్ అయినా, హీరో మార్కెట్ కూడా విజయంలో కీలకం. తెలుగులో వెంకీకి, హిందీలో అజయ్‌కి ఉన్న క్రేజ్ .. మోహన్‌లాల్‌కి ఆయా భాషల్లో ఉందా అని ట్రేడ్ వర్గాలు చర్చిస్తున్నాయి. పాన్-ఇండియా రిలీజ్‌తో మోహన్‌లాల్ వెర్షన్‌కి బిజినెస్ లిమిటెడ్‌గానే ఉంటుందని.. అది చాలా చిన్న మొత్తమని అంటున్నారు. మరోవైపు వెంకటేష్ తెలుగు వెర్షన్‌లో నటిస్తే రూ. 80 కోట్ల నుండి100 కోట్ల బిజినెస్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. హిందీలో అజయ్ దేవగన్ మార్కెట్ అయితే భారీగానే ఉంటుంది. అదే మోహన్‌లాల్ అంటే ఆ స్థాయి బిజినెస్ జరగకపోవచ్చు. అలానే ఫలితంగా కూడా అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మలయాళ 'దశ్యం-3' మేకర్స్ దీని గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి.