ఆ లోటును భర్తీ చేస్తుంది
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:03 AM
‘అష్టాచెమ్మ’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘సమ్మోహనం’ వంటి చిత్రాలతో సెన్సిబుల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘సారంగపాణి జాతకం’....
‘అష్టాచెమ్మ’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘సమ్మోహనం’ వంటి చిత్రాలతో సెన్సిబుల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడవాయూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మోహనకృష్ణ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఒకప్పటితో పోల్చితో తెలుగులో పూర్తి స్థాయి కామెడీ చిత్రాల సంఖ్య తగ్గిపోయింది. ఆ లోటును భర్తీ చేస్తుందీ చిత్రం. కథానాయకుడి పాత్రకు ఎవరు సరిపోతారా అని వెతికే క్రమంలో, ప్రియదర్శి నటించిన ‘బలగం’తో పాటు ఆయన చేసిన మరికొన్ని చిత్రాలు చూశా. ఈ కథకు ఆయనే సరిపోతారనిపించింది. ఇందులో పాత్రలన్నీ కొత్తగా ఉంటాయి. కేవలం థియేటర్లో చూసి ఆనందించడమే కాకుండా.. కొన్ని రోజుల పాటు మాట్లాడుకునేలా ఉంటుందీ సినిమా. అన్ని వర్గాలను మెప్పించే ఈ చిత్రం, కాసేపు మీ కష్టాలన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. జాతకాలను అతిగా నమ్మే ఓ యువకుడి జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలే చిత్రకథాంశం. నమ్మకం మూఢనమ్మకంగా మారి, ఇతరుల్ని ఇబ్బందిపెట్టకూడదనే సందేశాన్ని వినోదాత్మకంగా అందిస్తుంది. సినిమాలో కడుపుబ్బా నవ్వుకునే వినోదంతో పాటు ఓ క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడిగా ఈ సినిమా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. వారు థియేటర్లో మొబైల్ తీయకుండా ఉంచగల స్థాయిలో సినిమాలు తీయడం దర్శకులు నేర్చుకోవాలి’’ అని చెప్పారు.