Women Empowerment: తెర వెనుకా తమదైన ముద్ర
ABN, Publish Date - Mar 08 , 2025 | 04:40 AM
సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. మా వారికి దర్శకుడు అవ్వాలనే కోరిక ఉండేది. ఆయన కోసమని ప్రొడక్షన్‌లో అడుగు పెట్టాను. నిర్మాతగా నా మొదటి చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’.
మిగిలిన అన్ని రంగాల్లో అగ్రపథాన దూసుకుపోతున్న మహిళలకు చిత్రసీమలో లభిస్తున్న ప్రాతినిథ్యం తక్కువే. అయినా సరే తెరపైనే కాకుండా తెర వెనుక కూడా తమదైన ముద్ర వేసేందుకు ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఒకప్పుడు నటనకు, అప్పుడప్పుడు దర్శకత్వ శాఖకు పరిమితమైన మహిళలు ఇప్పుడు చిత్ర నిర్మాణ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మగవారికి దీటుగా ఇరవై నాలుగు విభాగాల్లోనూ తమ సేవలు అందిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. పురుషాధిక్యరంగంగా భావించే చిత్రపరిశ్రమలో అవకాశాలను ఒడిసిపట్టుకుంటూ వడివడిగా అడుగులేస్తోన్న కొందరు నారీ మణులు మహిళా దినోత్సవం సందర్భంగా చిత్రజ్యోతితో పంచుకున్న నాలుగు మంచి మాటలు.
ఆ విధానంలో మార్పు రావాలి
సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. మా వారికి దర్శకుడు అవ్వాలనే కోరిక ఉండేది. ఆయన కోసమని ప్రొడక్షన్‌లో అడుగు పెట్టాను. నిర్మాతగా నా మొదటి చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఈ ప్రయాణంలో దర్శకత్వం వైపూ ఆసక్తి కలిగింది. దాంతో నా దర్శకత్వంలో ‘ఫియర్’ చిత్రం రూపుదిద్దుకుంది. డబ్బులు ఉంటే సినిమా తీయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, పూర్తయిన సినిమాను మార్కెట్ చేయడం పెద్ద సవాలుగా అనిపించింది. ఎవరి వద్దకు వెళ్లినా.. బ్యానర్ ఎవరిది? సినిమా తీసింది ఎవరు? డైరెక్టర్ ఎవరు, వారి బ్యాగ్రౌండ్ ఏంటి వంటి అంశాలనే చూస్తున్నారు కానీ కంటెంట్‌ను పట్టించుకోవడం లేదు. ఈ విధానంలో మార్పు రావాలి. తన ప్రొడక్ట్‌ని అమ్ముకుంటేనే కదా నిర్మాతకు లాభం వచ్చేది. ప్రొడ్యూసర్ బావుంటేనే ఇండస్ట్రీ బావుంటుంది. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఇదే నాకు అర్థమైంది. నా చిన్ననాటి నుంచే ఎన్నో ఇబ్బందులు అనుభవించా. అప్పుడు ఆదుకున్న వారు ఎవరూ లేరు. అందుకే ఎవరైనా సాయం కోరితే నాకు తోచింది చేయాలని నిర్ణయించుకున్నా. ఒక వైపు సినిమాలు చేస్తూనే సొసైటీకి సేవ చేయాలనేది నా లక్ష్యం. ముఖ్యంగా మహిళా సాధికారతకు నా వంతు కృషి చేస్తున్నా.
- హరిత గోగినేని (దర్శకురాలు)
వద్దన్న వాళ్లే ప్రశంసించారు
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. తెలిసినవాళ్ల ద్వారా ఒక సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది... కానీ ప్రొడక్షన్ విభాగంలో. అక్కడ అన్ని విభాగాలను చక్కగా సమన్వయం చేస్తూ పనిచేయడం చూసి, ‘ఇండస్ట్రీలో మహిళా మేనేజర్లు లేరు. నువ్వు ప్రయత్నం చేయవచ్చు కదా’ అన్నారు. అలా మొదట్లో కొన్ని చిన్న సినిమాలకు పనిచేశాను. ప్రొడక్షన్ యూనియన్‌లో సభ్యత్వం ఉంటే అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు అని అనుకున్నాను. కానీ అమ్మాయిలకు రక్షణ ఇవ్వలేమంటూ సభ్యత్వం ఇచ్చేందుకు తిరస్కరించారు. మీ సంస్థ నియమావళిలో మహిళలకు సభ్యత్వం ఇవ్వకూడదని ఉందా? అని ప్రశ్నించి, పోరాడి యూనియన్ కార్డ్ సాధించుకున్నాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం పెద్ద నిర్మాణసంస్థల దగ్గరకు వెళితే ‘మహిళలు ప్రొడక్షన్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించలేరు’ అన్నారు. ఇండస్ట్రీలో తొలి మహిళా ప్రొడక్షన్ మేనేజర్‌గా ఎదిగాను. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాను. వద్దన్నవాళ్ల ప్రొడక్షన్‌లోనే మేనేజర్‌గా పని చేసి, వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నాను. ఇక్కడ రాత్రికి రాత్రే ఎవరూ గొప్పవాళ్లు కాలేరు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే అమ్మాయిలపై రాళ్లేసేవాళ్లే ఎక్కువ. వాటిని పూలబాటగా మార్చుకొని ప్రయాణం కొనసాగిస్తే విజయం తథ్యం.
- దీప్తి (ప్రొడక్షన్ మేనేజర్)
వీరు సైతం...
ఎస్‌ఎస్ రాజమౌళి భార్య రమా రాజమౌళి చలన చిత్ర రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తున్నారు. స్టూడెంట్ నం.1 సినిమా ద్వారా ఆమె ఈ రంగంలోకి ప్రవేశించారు. మగధీర, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలకు పనిచేశారు.
దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నృత్య కళాకారిణి. నిర్మాతగా కూడా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ‘సార్, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.
కోన వెంకట్ సోదరి కోన నీరజ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో తొలిసారిగా హీరో నితిన్‌కు స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ‘తెలుసు కదా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు రూపా వైట్ల కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.
డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఇటీవలె విడుదలైన ‘గాంధీ తాత చెట్టు’ సినిమా నిర్మాణంలో క్రీయాశీలకంగా వ్యవహరించారు.
దర్శకుడు వైవీఎస్ చౌదరి భార్య గీతా చౌదరి నిర్మాతగా మారారు. జానకిరామ్ తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీస్తున్నారు.
నా పాట నలుగురూ పాడుకునేలా ఉండాలి
సినీ పరిశ్రమలో మహిళల సంఖ్య తక్కువ. అందులోనూ గీత రచయిత్రిలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటిది వరుస సినిమాల్లో అవకాశం రావటం నా కష్టానికి తగిన ప్రతిఫలంగా భావిస్తున్నా. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు కవిత్వం రాయడం అలవాటైంది. ఉద్యోగం చేసే సమయంలో నేను రాసిన కవితలను సోషల్‌మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాను. వాటి ద్వారా నాకు తొలి అవకాశం వచ్చింది. నేను రాసిన రెండో పాట ‘వందేమాతరం’ (ప్రైవేట్ ఆల్బమ్) ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యంగారు పాడటం.. నేను రాసిన ఓ పాట విని నటి గౌతమిగారు ఫోన్ చేసి అభినందించడం మరిచిపోలేని అనుభూతులు. ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తినిచ్చిన వారు లేరు. కానీ పరిశ్రమలో నాకు దిశానిర్ధేశం చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. గీత రచయితగా ప్రత్యేక లక్ష్యాలంటూ ఏమీ లేవు. నా వర్క్ అందరికీ చేరితే చాలు. నా పాట నలుగురు పాడుకునేలా ఉంటే చాలు. ఇప్పటివరకూ 70 సినిమాల్లో 100 పాటలు రాశాను. ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రంలో ‘నాన్నా’, ‘గామి’లో ‘అరిరారో’ అనే లాలిపాట’, ‘హ్యాష్‌ట్యాగ్ నైన్టీస్’ లోని ‘మనసు మంగళం.. ప్రేమ మంగళం’, ‘కాలింగ్ సహస్ర’లోని ‘కలా నిజమా’, ‘హీరామండీ’ వెబ్ సిరీస్‌లోని ‘మనసారా నను లాగిపోకే’ వంటి పాటలతో మంచి గుర్తింపు వచ్చింది’’ అని గీత రచయిత లక్ష్మీప్రియాంక పులవర్తి చెప్పారు.
- లక్ష్మీప్రియాంక (గీత రచయిత)