Chitraamrutham 2.0: సంగీత మహోత్సవం
ABN, Publish Date - Apr 22 , 2025 | 04:12 AM
మధుర గాయని కె.ఎస్.చిత్ర 45 ఏళ్ల సినీ సంగీత ప్రయాణంలో అనేక అద్భుత గీతాలు ఆలపించారు. ఈ నేపథ్యంలో జూన్ 14న ‘చిత్రామృతం 2.0’ సంగీత మహోత్సవం నిర్వహించనున్నట్లు గాయకుడు ఎస్.పి. చరణ్ మరియు గీత రచయిత చంద్రబోస్ తెలిపారు.
మధుర గాయని కె.ఎస్ .చిత్ర తన 45 ఏళ్ల సినీ సంగీత పయనంలో ఎన్నో అధ్భుత గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా జూన్ 14న ‘చిత్రామృతం 2.0’ పేరుతో సంగీత మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గాయకుడు, నటుడు ఎస్.పి. చరణ్, గీత రచయిత చంద్రబోస్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ‘కాలాన్ని దాటి మనసుల్ని తాకే శక్తి చిత్రగారి గానానికి ఉంది. మా నాన్న బాలుగారితో కలసి పాడిన ఎన్నో అద్భుత గీతాలు మరచిపోలేని జ్ఞాపకాలు’ అని చెప్పారు. చంద్రబోస్ మాట్లాడుతూ ‘నేను రాసిన ఎన్నో పాటలకు చిత్రగారు ప్రాణం పోశారు. పాటల మాటలకు జీవం పోసే మధురమైన గొంతు ఆవిడది’ అన్నారు. జూన్ 14న ‘చిత్రామృతం 2.0’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని నిర్వాహకులు చెప్పారు.