Tollywood: ఆ రెండు సినిమాలు తెలుగులో రావట్లేదు...
ABN, Publish Date - Apr 07 , 2025 | 12:06 PM
పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతాయని భావించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్' చిత్రాలు ఇప్పుడు ఆ యా భాషల్లో మాత్రమే రిలీజ్ కాబోతున్నాయి.
ఏప్రిల్ 10న రెండు పాన్ ఇండియా (Pan India) సినిమాలు విడుదల అవుతాయనే ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇందులో ఒకటి సన్నీ డియోల్ నటించిన హిందీ చిత్రం 'జాట్' (Jaat) కాగా రెండోది అజిత్ (Ajith) హీరోగా నటించిన తమిళ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) . అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి తెలుగు వారికి సంబంధం ఏమిటంటే...ఈ సినిమాను నిర్మించి తెలుగు వారే. 'జాట్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంస్థ భారీగా నిర్మించింది. తెలుగువాడైన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఈ సినిమాకు దర్శకుడు. అతని ఇదే తొలి హిందీ చిత్రం. అలానే తమిళ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమిళ దర్శకుడైన అధిక్ రవిచంద్రన్ తో నిర్మించింది. పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 10న జనం ముందుకు వస్తోంది. ఇక మొదటి నుండీ 'జాట్' సినిమాను ఏప్రిల్ 10నే తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే... ఈ రెండు సినిమాలు కూడా తెలుగులోనూ ఏప్రిల్ 10నే విడుదల అవుతాయని మేకర్స్ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
అటు 'జాట్', ఇటు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాలకు ఆ యా భాషల్లో, ఆ యా ప్రాంతాల్లో పబ్లిసిటీ చేస్తున్నారు కానీ తెలుగులో మాత్రం కేవలం ప్రచార చిత్రాలకే పరిమితం అయిపోయారు. చూస్తుండగానే ఏప్రిల్ 10 దగ్గరకు వచ్చేసింది. 'జాట్' సినిమాకు సంబంధించిన రాములోరి పాటను శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. దాంతో మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారంలోనూ సన్నీడియోల్ పాల్గొంటున్నాడు. అయితే 'జాట్'ను తెలుగులో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా... తెలుగు వర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఏప్రిల్ 15కి కానీ ఫస్ట్ కాపీ రాదట. ఆ లెక్కన 10న కేవలం హిందీ రిలీజ్ కే నిర్మాతలు పరిమితం అవుతున్నారట. ఒకవేళ అన్నీ బాగుండి... హిందీలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే... వెంటనే ఏప్రిల్ 18న తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తారట.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా విషయానికి వస్తే... నిజానికి ఈ సినిమాను గత యేడాది దీపావళికి రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత 'విడా ముయూర్చి' కారణంగా సంక్రాంతికి వాయిదా వేశారు. అప్పుడూ ఈ సినిమా రాలేదు. చివరకు 'విడా ముయార్చి' ఫిబ్రవరిలో విడుదల కావడంతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ని ఏప్రిల్ 10న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. కానీ ఎప్పుడైతే 'విడా ముయార్చి' పరాజయం పాలైందో చిత్ర నిర్మాతలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే... 'విడా ముయార్చి' తెలుగులోనూ 'పట్టుదల' పేరుతో డబ్ అయ్యి ఇక్కడా ఫ్లాప్ అయ్యింది. సో... ఏప్రిల్ 10న కేవలం తెలుగు వర్షన్ ను మాత్రం రిలీజ్ చేసి, పాజిటివ్ రిజల్డ్ ను సినిమా దక్కించుకుంటే... అప్పుడు తెలుగులో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. అయితే.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమా పంపిణీ పరంగా బిజీగానే ఉంది. ఈ రెండు సినిమాలు తెలుగులో రాకపోయినా... అదే సంస్థ ప్రదీప్ మాచిరాజు నటించిన 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' సినిమాను పంపణీ చేస్తోంది. కాబట్టి... ఓరకంగా ఈ రెండు సినిమాల డబ్బింగ్ వర్షన్ విడుదల కాకపోవడం, 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి', 'జాక్' చిత్రాలకు కలిసి వచ్చే అంశం.
Also Read: Sreeleela: శ్రీలీలను లాక్కుపోయాడు.. ఇదొక చేదు అనుభవం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి