ప్రధాని మోదీతో ఇళయరాజా భేటీ
ABN, Publish Date - Mar 19 , 2025 | 02:41 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇసైఙ్ఞాని ఇళయరాజా మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మేరకు ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇసైఙ్ఞాని ఇళయరాజా మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మేరకు ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ‘ప్రధానమంత్రి మోదీతో ఒక చిరస్మరణీయమైన సమావేశం. నా సింఫనీ ‘వాలియంట్’తో సహా అనేక విషయాల గురించి మేం చర్చించుకున్నాం. ఆయన అభినందనలు, మద్దతుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 8వ తేదీన లండన్‌లో ఇళయరాజా తన తొలి సింఫనీ అరంగేట్రాన్ని విజయవంతంగా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఆయన.. తొలుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలసి కృతఙ్ఞతలు తెలిపారు.
ఉపరాష్ట్రపతి ప్రశంస
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. లండన్ వేదికగా ఇళయరాజా సాధించిన ఘనత యావత్ దేశం గర్వించేలా చేసింది అంటూ కొనియాడారు. రాజ్యసభ సభ్యుడైన ఇళయరాజాకు రాజ్యసభ కూడా అభినందనలు తెలిపింది.
చెన్నై (ఆంధ్రజ్యోతి)