రూ.5 కోట్లు పరిహారం చెల్లించాల్సిందే!
ABN, Publish Date - Apr 16 , 2025 | 04:00 AM
అజిత్‌కుమార్ హీరోగా రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్ర నిర్మాతలు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని పేర్కొంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు..
అజిత్‌కుమార్ సినిమాకు ఇళయరాజా నోటీసులు
అజిత్‌కుమార్ హీరోగా రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్ర నిర్మాతలు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని పేర్కొంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, గతంలో ‘నాట్టుపురపాట్టు’, సకలకళా వల్లవన్’, ‘విక్రమ్’ సినిమాలకు తాను స్వరాలు సమకూర్చిన మూడు పాటలను ఈ మూవీలో తన అనుమతి లేకుండా రీ క్రియేట్ చేశారని ఇళయరాజా నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకుగాను రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఆ పాటలను తొలగించడంతో పాటు నిర్మాతలు క్షమాపణ చెప్పాలని ఇళయరాజా పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)