మెరుగైన కంటెంట్.. భవిష్యత్తు కోసం ఏఐ
ABN, Publish Date - Apr 17 , 2025 | 02:35 AM
ప్రేక్షకులకు సరికొత్త వినోదం అందించడం కోసం చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషిస్తుంటుంది. ఒకప్పుడు కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం, డి.టి.ఎస్, డి.ఐ ఇలా రకరకాల సాంకేతిక హంగులను...
ప్రేక్షకులకు సరికొత్త వినోదం అందించడం కోసం చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషిస్తుంటుంది. ఒకప్పుడు కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం, డి.టి.ఎస్, డి.ఐ ఇలా రకరకాల సాంకేతిక హంగులను సమకూర్చుకుని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించడానికి కృషి చేస్తోంది చిత్ర పరిశ్రమ. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సరికొత్త సాంకేతిక సదుపాయం ఏ.ఐ. ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్న ఏ. ఐ. విధానం భవిష్యత్‌ను శాసిస్తుందని కూడా కొందరు అంటున్నారు. ఏ.ఐ టెక్నాలజీ కోసం పెద్ద పెద్ద సంస్థలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు దృష్టి కూడా దీనిపై పడింది. కొత్తను ఆహ్వానించడం, అనుసరించడంలో మిగిలిన వారి కంటే ముందు ఉండాలనే తపన కలిగిన ఆయన తాజాగా ఇప్పుడు ఏ.ఐ ప్రొడక్ట్ కంపెనీని ఏర్పాటు చేశారు. తెలుగు సినిమాలకు ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే ‘క్వాంటమ్ ఏ వన్’ కంపెనీతో ఆయన చేతులు కలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన సంస్థ విడుదల చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దిల్ రాజు తన ఆలోచనలను పంచుకుంటూ
‘ఇది కేవలం మెరుగైన కంటెంట్ గురించి మాత్రమే కాదు. వినోద ప్రపంచానికి అవసరమైన ఏ వన్ వ్యవస్థ నిర్మాణం గురించి కూడా. ఏ వన్ గ్లోబల్ సాంకేతిక నైపుణ్యాలతో భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న పరిష్కారాలను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు. కంపెనీ పేరు, ఇతర వివరాలు మే 4న వెల్లడిస్తామని ఆయన తెలిపారు.