స్పెషల్‌ సాంగ్‌తో సిద్ధమా?

ABN, Publish Date - Mar 10 , 2025 | 04:53 AM

సినిమాల్లో కథానాయిక పాత్రల్లో అలరించడమే కాదు, అప్పుడప్పుడూ రూటు మార్చి ప్రత్యేక గీతాల్లోనూ మెరుస్తుంటారు తారామణులు. జనాల్లో క్రేజ్‌ పెంచడమే కాకుండా సినిమా విజయానికీ దోహదపడుతుంటారు...

సినిమాల్లో కథానాయిక పాత్రల్లో అలరించడమే కాదు, అప్పుడప్పుడూ రూటు మార్చి ప్రత్యేక గీతాల్లోనూ మెరుస్తుంటారు తారామణులు. జనాల్లో క్రేజ్‌ పెంచడమే కాకుండా సినిమా విజయానికీ దోహదపడుతుంటారు. తాజాగా అగ్రహీరోలతో ప్రత్యేక గీతాలు చేస్తున్నారంటూ కొంతమంది హీరోయిన్ల పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వారెవరో తెలుసుకుందాం.

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాజాసాబ్‌’. ఈ హారర్‌ థ్రిల్లర్‌లో మాంచి జోష్‌తో నిండిన ప్రత్యేక గీతం ఉందట. ఈ పాటలో స్టెప్పులేసేందుకు ఓ స్టార్‌ హీరోయిన్‌ అయితే బావుంటుందని భావించిన చిత్రబృందం నయనతారని సంప్రదించారని టాక్‌. ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో ప్రభా్‌సకు జంటగా ‘యోగి’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు నయనతార. ఇక ‘యానిమల్‌’ సినిమాలో అందాల ఆరబోతతో అలరించిన త్రిప్తి దిమ్రీని సైతం మేకర్స్‌ సంప్రదించినట్లు ప్రచారం జరిగింది. అయితే, వీరిలో ఎవరు ఫైనల్‌గా పాటలో కనపడతారనేది తెలియాల్సి ఉంది.


ఎన్టీఆర్‌.. హృతిక్‌తో

2022లో వరుణ్‌ధావన్‌ హీరోగా నటించిన ‘భేడియా’ చిత్రంలో ‘తుమ్‌కేశ్వరీ’ అనే ప్రత్యేక గీతంలో మెరిశారు శ్రద్ధా. ‘పుష్ప 2’లో ‘కిస్సిక్‌’ సాంగ్‌ కోసం మొదట శ్రద్ధాని సంప్రదించినా పారితోషికం తక్కువని ఆమె అంగీకరించలేదు. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వార్‌ 2’లో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేయబోతున్నారట. 2019లో విడుదలై సూపర్‌ హిట్‌ సాధించిన ‘వార్‌’కు ఇది కొనసాగింపు. ఈ సినిమాపై తారస్థాయిలో ఉన్న అంచనాలను మరింత పెంచేలా ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. అందుకోసం ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. ‘స్త్రీ 2’తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన శ్రద్ధా కపూర్‌ను ఈ పాట కోసం సంప్రదించారని టాక్‌. మంచి డ్యాన్సరైన శ్రద్ధా తన స్టెప్పులతో.. ఎన్టీఆర్‌, హృతిక్‌ ఎనర్జీని పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ చేస్తారని మేకర్స్‌ అభిప్రాయపడుతున్నారట.

ఒకేసారి రెండు చిత్రాల్లో..

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు కియారా అడ్వాణీ. యశ్‌ కథానాయకుడిగా ‘ముథూన్‌’ ఫేమ్‌ గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. ఇందులో కియారా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే, ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో కూడా ఆమె కనిపించనున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా వచ్చిన ‘సలార్‌’ చిత్రానికి సీక్వెల్‌లో కీలక పాత్రతో పాటు ప్రత్యేక గీతంలో కియారా తళుక్కున మెరవనున్నారనే టాక్‌ నడుస్తోంది. 2022లో విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన ‘గోవింద్‌ మేరా నామ్‌’ చిత్రంలో ‘బిజిలీ’ అనే ప్రత్యేక గీతంలో నటించారు కియార.


సీక్వెల్‌లోనూ ఛాన్స్‌

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్‌’ సినిమా ఘన విజయం సాఽధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా భాటియా చేసిన ‘నువ్వే కావాలయ్యా’ ప్రత్యేక గీతం పెద్ద హిట్‌ అయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌లో తమన్న పాత్ర నిడివిని పెంచడంతో పాటు ఆమెతో ప్రత్యేక గీతం ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌. ఇటీవలే తమన్న ‘స్త్రీ’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయడం.. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో.. ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్‌.

ఓజీ కోసం రాధిక

‘డీజే టిల్లు’ చిత్రంతో యువతరాన్ని ఆకట్టుకున్న కథానాయిక నేహా శెట్టి. ఆ చిత్రంతో ఆమె క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఈ భామకు ఓ సూపర్‌ ఆఫర్‌ వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా సుజీత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ప్రత్యేక గీతం కోసం నేహా శెట్టిని ఎంపిక చేశారు. అయితే, ఇందులో ఆమె కేవలం ఓ పాటకే పరిమితమవుతారా లేదా కీలక పాత్రలో నటిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.


మరోసారి ప్రత్యేక గీతంలో

సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రెట్రో’. మే 1న విడుదలవనున్న ఈ సినిమాలో శ్రియ ఓ ప్రత్యేక గీతంలో స్టెప్పులేశారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ నటించిన ‘పులి’.. వెంకటేశ్‌ నటించిన ‘తులసి’.. తరుణ్‌ నటించిన ‘సోగ్గాడు’.. ప్రభాస్‌ నటించిన ‘మున్నా’ వంటి పలు చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో తళుక్కుమన్నారు శ్రియ.


Updated Date - Mar 10 , 2025 | 04:53 AM