Tamil Digital Tribute: తమిళ భాషకు డిజిటల్ మెమోరియల్
ABN, Publish Date - Apr 15 , 2025 | 04:41 AM
తమిళ భాషకు గౌరవం కల్పించేందుకు ఏఆర్ రెహ్మాన్ డిజిటల్ మెమోరియల్‌ను రూపొందించనున్నట్టు ప్రకటించారు. తమిళ సాహిత్యం, సంస్కృతిని డిజిటలీకరించి భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు
ప్రపంచ ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తమిళానికి మరింత గుర్తింపు తెచ్చేలా ‘డిజిటల్ మెమోరియల్’ని రూపొందించనున్నట్టు సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ వెల్లడించారు. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన సందేశాన్ని వెల్లడిస్తూ, ‘ప్రపంచ స్థాయి భాషలలో పరిణామం చెందుతూ అత్యంత శక్తిమంతమైన భాషగా తమిళం గుర్తింపు పొందింది. తమిళ భాషను ప్రపంచ వ్యాప్తం చేయడంలో తమిళ సంఘాల కృషి ముఖ్యమైనది. భాషను బలోపేతం చేయడంతో పాటు సవరణలు చేయడం ద్వారా దానిని సుసంపన్నం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. వినూత్నమైన, అర్థవంతమైన మార్గాల్లో తమిళ భాషను తరువాతి తరానికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనకుంది. తమిళ సాహిత్యం, సంస్కృతులను డిజిటలీకరణ చేసేందుకు, తమిళ భాషకు మరింత గౌరవం కల్పించేలా తమిళ సాహిత్యాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించేందుకు ఏఆర్‌ఆర్ ఇమ్మర్షివ్ ఎంటర్‌టైన్మెంట్ (ఏఆర్‌ఆర్ స్టూడియో) కృషి చేస్తుంది. తమిళ గౌరవాన్ని డిజిటల్ రెండరింగ్‌గా తయారు చేసేపనిలో నిమగ్నమై ఉంది. ఇది తమిళ భాష భవిష్యత్‌కు ఒక గర్వకారణంగా నిలుస్తుందని భావిస్తున్నాం’ అని రెహ్మాన్ పేర్కొన్నారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)